గ్లోబల్ వార్మింగ్ - ఎస్ఎఫ్6: కార్బన్ డై ఆక్సైడ్ కంటే 23,500 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన వాయువు ఇది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ పర్యావరణ ప్రతినిధి
గ్రీన్‌హౌస్ వాయువుల్లో అత్యంత శక్తిమంతమైనది సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇటీవల కాలంలో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఉద్గారాలు బాగా ఎక్కువైనట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.
సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ (SF6)ను విద్యుత్ రంగంలో విరివిగా వాడతారు. షార్ట్ సర్క్యూట్‌లు, విద్యుత్ ప్రమాదాల నివారణకుగాను విద్యుత్ నిరోధంగా దీన్ని ఉపయోగిస్తుంటారు.
అయితే, గత కొంతకాలంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ వాయు ఉద్గారాలు ఎంతగా పెరిగాయంటే.. కొత్తగా 13 లక్షల కార్లు రోడ్డుపైకి వస్తే ఎంత కాలుష్యం వెలువడుతుందో అంత స్థాయిలో పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.
హరిత ఇంధనాల వెల్లువలో భాగంగా అనుకోని పర్యవసానంగా సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ స్థాయి విపరీతంగా పెరుగుతోంది.
సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ రంగు, వాసన లేని సింథటిక్ గ్యాస్. దీనికి మండే స్వభావం కూడా ఉండదు. మధ్యశ్రేణి, అధిక వోల్డేజీ విద్యుత్ పరికరాలు, వ్యవస్థలలో దీన్ని విద్యుత్ నిరోధంగా వాడతారు.
భారీ విద్యుత్ కేంద్రాలు, టర్బైన్‌లు.. గ్రామాలు, పట్టణాల్లో ఉండే సబ్‌స్టేషన్ల వరకు అన్నిచోట్లా దీన్ని వినియోగిస్తారు. విద్యుత్ కారణంగా సంభవించే ప్రమాదావకాశాలను ఇది తగ్గిస్తుంది.
విద్యుత్ ప్రమాదాలను నిరోధించడానికి పనికొచ్చే ఈ వాయువు అన్నిటికంటే ఎక్కువగా భూతాపం కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కార్బన్ డై ఆక్సైడ్ కలిగించే భూతాపం కంటే ఇది 23,500 రెట్లు ఎక్కువ భూతాపం కలిగించగలదు.
అంతేకాదు.. ఇది వాతావరణంలో సుదీర్ఘకాలం ఉండిపోతుంది. వెయ్యేళ్ల పాటు భూతాపానికి ఇది కారణమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భూతాప కారక వాయువును ఎందుకు ఇంతగా వాడుతున్నారు?
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగ తీరు శరవేగంగా మారుతోంది. ఒకప్పుడు బొగ్గు ఆధారిత కేంద్రాల నుంచే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తయ్యేది. కానీ, వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా తీసుకొస్తున్న మార్పులతో థర్మల్ విద్యుత్ తగ్గుతూ పవన, సౌర విద్యుదుత్పత్తి పెరుగుతూ వస్తోంది.
దీంతో విద్యుత్ గ్రిడ్‌లకు అనుసంధానమయ్యే వ్యవస్థలు పెరుగుతున్నాయి. అన్నింటా సర్క్యూట్లు, స్విచ్‌లలో సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ సురక్షిత పరికరాల వినియోగమూ తప్పనిసరైంది.
షార్ట్ సర్క్యూట్‌లు, ఇతర విద్యుత్ ప్రమాదాల నిరోధానికి వాడే సురక్షా పరికాలను స్విచ్‌గేర్ అంటారు. వీటిలో ఎక్కువగా సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్‌నే వినియోగిస్తారు.
''పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెరుగుతున్నకొద్దీ స్విచ్‌గేర్‌ల అవసరమూ ఎక్కువైంది. ముఖ్యంగా విండ్ టర్బైన్లలో ఇవి తప్పనిసరి'' అని స్కాట్లాండ్‌లోని ఈస్ట్ ఏంజిలా విండ్ ఫాంలో ఇంజినీర్ కోస్టా పిర్గాసిస్ అన్నారు. ఈ ప్లాంటులో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వినియోగించడం లేదు.
''టర్బైన్లు ఎన్ని ఎక్కువగా ఉంటే అన్ని స్విచ్‌గేర్‌ల అవసరం ఉంటుంది. ఫలితంగా సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వినియోగమూ అంతేస్థాయిలో పెరుగుతుంది' అని ఆయన చెప్పారు.

సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఉద్గారాలు పెరుగుతున్నాయని ఎలా చెప్పగలం?
బ్రిటన్‌లోని విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లలో 10 లక్షల కేజీల సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వినియోగించారు. కార్డిఫ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం అన్ని రకాల విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థలలో దీని వినియోగం ఏటా 30 నుంచి 40 టన్నుల మేర పెరుగుతోంది.
ఇది 2017లో యూరోపియన్ యూనియన్‌లోని 28 సభ్య దేశాల్లో 67 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలకు సమాన స్థాయిలో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఉద్గారాలు పెరిగేలా చేసిందని నివేదికలో వెల్లడించారు.
ఏడాదికి 13 లక్షల కార్లు కొత్తగా రోడ్డుపైకి వస్తే కర్బన ఉద్గారాలు ఎంత పెరుగుతాయో ఇది అంత కాలుష్యానికి సమానం.
వాతావరణంలో భూతాప కారక వాయువుల స్థాయిని నిత్యం పరిశీలించే బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనకర్తలు గత 20 ఏళ్లలో ఎస్‌ఎఫ్6 ఉద్గారాలు భారీగా పెరిగినట్లు గుర్తించారు.
గత రెండు దశాబ్దాలలో వాతావరణంలో ఈ వాయువు శాతం రెట్టింపైందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ కెమిస్ట్రీ రీడర్ డాక్టర్ మేట్ రిగ్బీ చెప్పారు.
ఎస్‌ఎఫ్6 వాతావరణంలో ఎలా చేరుతుంది
విద్యుత్ రంగంలో వినియోగించే ఎస్‌ఎఫ్6 లీకైతే అది వాతావరణంలో చేరుతుంది.
ఎస్‌ఎఫ్6 లేని స్విచ్‌గేర్‌లు తయారుచేసే సంస్థ ఈటన్ చెబుతున్న ప్రకారం.. ఎస్‌ఎఫ్6 వాడే స్విచ్‌గేర్లలో వాటి జీవితకాలంలో 15 శాతం వాయువు బయటకు లీకవుతుంది.
అయితే, కొత్తగా వస్తున్నవాటిలో లీకేజీ శాతం తక్కువగా ఉందని.. కానీ, అందరూ ఇలాంటి లీకేజీ తక్కువగా ఉన్న అధునాతన స్విచ్‌గేర్లు వాడకపోవడమే అసలు సమస్యని ఈటన్‌లో ఎలక్ట్రికల్ బిజినెస్ మేనేజరుగా పనిచేసే లూయిస్ షాఫర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిబంధనలేం చెబుతున్నాయి?
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎస్‌ఎఫ్6 వినియోగం మరో 75 శాతం పెరుగుతుందని అంచనా. ఈ ఎస్‌ఎఫ్6 ఎందులోనూ కరగదు.. సహజసిద్ధంగా నాశనమూ కాదు. దీన్ని రసాయన పద్ధతుల్లోనే నాశనం చేయాల్సి ఉంటుంది. లేదంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర వాయువులు వాడాల్సి ఉంటుంది.
ఎస్‌ఎఫ్6 వినియోగంపై ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు ఏటా తాము ఎంతమేర వినియోగించామన్నది ఐరాసకు నివేదించాలి. వర్ధమాన దేశాలకు అలాంటి బాధ్యతేమీ లేదు.
అయితే, అభివృద్ధి చెందిన దేశాలు ఐరాసకు సమర్పించే నివేదికల్లో చెబుతున్న దానికంటే వాతావరణంలో 10 రెట్లు అధికంగా ఎస్‌ఎఫ్6 ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదంతా భారత్, చైనా, దక్షిణకొరియా వంటి దేశాల నుంచి మాత్రమే రావడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎందుకు దీన్ని నిషేదించలేదు?
పర్యావరణానికి హాని కలిగించే పలు వాయువులను నిషేధించాలని యూరోపియన్ యూనియన్ 2014లో తలపోసింది. ఏసీలు, ఫ్రిజ్‌లలో వాడే గ్యాస్‌లు కూడా అందులో ఉన్నాయి. కానీ, ఐరోపా పారిశ్రామిక రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముందుకెళ్లలేకపోయారు.
''ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ లాబీ చాలా బలంగా ఉంది. దాంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయాం'' అని యూరోపియన్ పార్లమెంటు సభ్యుడు బాస్ ఈక్హాట్ అన్నారు.

ఫొటో సోర్స్, Alan o neill
ప్రత్యామ్నాయాలున్నాయా?
ఎస్‌ఎఫ్6కి సరైన ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక వోల్డేజీ విద్యుత్ వ్యవస్థల్లో నిరోధానికి ఎస్‌ఎఫ్6 తప్పనిసరంటున్నారు.
''నిజమైన ప్రత్యామ్నాయంగా ఏదీ నిరూపణ కాలేదు'' అని కార్డిఫ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మనూ హదాద్ అన్నారు.
పరిశోధకులు పలు ప్రత్యామ్నాయాలు సూచిస్తున్నా సంస్థలు రిస్క్ తీసుకోదలచుకోవడం లేదని చెప్పారాయన.
అయితే.. మధ్య, చిన్న తరహా విద్యుత్ వ్యవస్థల్లో కొన్ని ప్రత్యామ్నాయాలు వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు.
ఎస్‌ఎఫ్6 లేకుండా..
స్కాట్లాండ్‌కు చెందిన ఈస్ట్ ఏంజిలా సంస్థ కొన్ని టర్బయిన్లలో ఎస్ఎఫ్6 వాడడం లేదు. ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన గాలి, వేక్యూమ్ టెక్నాలజీ వాడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ విధానం కూడా బాగా పనిచేస్తోందని, పైగా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయదని కోస్టా పిర్గాసిస్ చెప్పారు.
వచ్చే ఏడాది యూరోపియన్ యూనియన్ ఎస్‌ఎఫ్6 వినియోగాన్ని సమీక్షించనుంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించనుంది. అయితే, 2025 వరకు దీనిపై నిషేధం విధించక పోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- చెర్నోబిల్: భారీ అణు విషాదానికి 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
- క్లీన్ ఎనర్జీ దిశగా తమిళనాడు పరుగులు
- అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు
- పాకిస్తాన్లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం
- మోదీకి గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డుపై అభ్యంతరాలు ఎందుకు?
- ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?
- పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా
- ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?
- చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...
- ‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








