'సౌదీఅరేబియా చమురు క్షేత్రాలపై దాడులు ఇరానే చేసిందనడానికి ఈ శకలాలే నిదర్శనం'

సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికీ

తమ చమురు కేంద్రాలు, క్షేత్రాలపై దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ అందుకు ఆధారంగా డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల శకలాలను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ బయట ప్రపంచానికి చూపించింది.

18 డ్రోన్లు, 7 క్రూయిజ్ మిసైళ్లు ఉత్తర దిశ నుంచి పేల్చారని సౌదీ తాజాగా చెప్పడంతో ఈ దాడులు యెమెన్ భూభాగం నుంచి జరగలేదని సూచించినట్లయింది.

ఇంతకుముందు ఈ దాడులు తమ పనేనని యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.

ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, దీన్ని అడ్డంపెట్టుకుని తమపై ఎవరైనా దాడులు చేస్తే తిప్పికొడతామని ఇరాన్ హెచ్చరించింది.

మరోవైపు ఈ దాడుల వెనుక ఉన్నది ఇరానే అంటూ అమెరికా ఢంకా బజాయించి చెబుతోంది. బుధవారం సౌదీ అరేబియా వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో దీనిపై మాట్లాడుతూ ఇది ‘యుద్ధానికి కవ్వింపు చర్య’ అన్నారు.

వీటిని తిప్పికొట్టడానికి అమెరికా ముందు చాలా మార్గాలున్నాయని ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా అన్నారు.

'మేం చాలా బలమైన స్థితిలో ఉన్నాం. మా ముందు చిట్టచివరగా ప్రయోగించాల్సిన అస్త్రమూ సిద్ధంగానే ఉంది, దానికంటే ముందు దశలూ ఉన్నాయి. ఏం చేయాలో నిర్ణయిస్తాం' అన్నారాయన.

సౌదీ చూపించిన శకలాలు
ఫొటో క్యాప్షన్, సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రదర్శించిన యూఏవీ, మిసైల్ శకలాలు

సౌదీ ఏం చెబుతోంది?

సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డ్రోన్లు, క్షిపణుల శకలాలను ప్రదర్శించారు.

రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్ మాలికీ మాట్లాడుతూ.. ఈ దాడులు ఉత్తరం వైపు నుంచి జరిగాయని చెప్పారు. ఇరానే దీనికి కారణమనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు.

మాలికీ సమావేశంలో ప్రదర్శించిన శకలాలలో ఇరాన్ మానవ రహిత వైమానిక వాహనానికి (యూఏవీ) చెందిన రెక్క ఒకటి ఉంది. అంతేకాదు... ఈ యూఏవీల్లో ఉన్న కంప్యూటర్లలోని డాటా ఆధారంగా అవి ఇరాన్‌వేనని తేలిందన్నారు.

అబ్కాయిక్ చమురు కేంద్రంపై 18 యూఏవీలు, అబ్కాయిక్, ఖురైస్ రెండు క్షేత్రాలపైనా కలిపి 7 క్రూయిజ్ మిసైళ్లు ఇరాన్ వైపు నుంచి ప్రయోగించారని ఆయన ఆరోపించారు.

ఖురైస్ చమురు క్షేత్రంపై నాలుగు క్రూయిజ్ మిసైళ్లు పడ్డాయని.. మరో మూడు అబ్కాయిక్ సమీపంలో పడ్డాయని చెప్పారు.

ఇవన్నీ ఉత్తర దిశ నుంచి వచ్చాయని మాలికీ తెలిపారు. అబ్కాయిక్‌పై యూఏవీ పడుతున్న దృశ్యాలనూ ఆయన ప్రదర్శించారు.

ఎక్కడి నుంచి ప్రయోగించారన్నది కచ్చితంగా నిర్ధారణైన తరువాత ఆ వివరాలూ వెల్లడిస్తామన్నారు.

ఈ దాడులు అంతర్జాతీయ సమాజంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించిన ఆయన దీనికి కారణమైనవారికి తగిన శాస్తి జరగాలన్నారు.

ఇరాన్ ఏమంటోంది?

సౌదీ ఆరోపణలపై ఇంతవరకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. అయితే, ఇరాన్ ఒక దౌత్య ప్రకటన చేసిదంటూ ఆ దేశ వార్తా ఏజెన్సీ ఒకటి ఇంతకుముందు చెప్పింది. దానిప్రకారం.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్య చేపట్టినా అందుకు వెంటనే ప్రతిఫలం అనుభవిస్తారు' అని ఉందంటూ ఆ వార్తాసంస్థ ఇంతకుముందే చెప్పింది.

ఇరాన్ అధ్యక్షుడి సలహాదారు ఒకరు ''సౌదీ సమావేశం చూస్తుంటే వారికేమీ తెలియదని తెలిసిపోయింది'' అని అన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి ''సౌదీ తన చమురు కేంద్రాలకు జరిగిన నష్టాన్ని తక్కువగా చూపుతూ శాటిలైట్ చిత్రాలను మార్ఫింగ్ చేసింది'' అని అన్నారు.

ఏం జరగబోతోంది?

ఈ దాడుల వెనుక ఇరాన్ ఉందని అమెరికా బాహాటంగానే చెబుతున్నప్పటికీ ఈ వ్యవహారంలో అమెరికా వైపు నుంచి సైనిక జోక్యం జరపడానికి ట్రంప్ ఆసక్తిగా లేరు.

బుధవారం ఆయన మాట్లాడుతూ.. ''దీన్ని సైనిక సంక్షోభంగా మలచడం చాలా సులభం. కానీ, మధ్యప్రాచ్యంలోని గత అనుభవాలు అలాంటి చర్యలు పరిస్థితులను మరింత జటిలంగా మారుస్తాయని రుజువు చేశాయి'' అన్నారు.

సౌదీ ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముందు ట్రంప్ ఓ ప్రకటన చేశారు. అందులో ఆయన తాను ఇరాన్‌పై ఆంక్షలు మరింత పెంచాలని అమెరికా ఖజానా అధికారులకు సూచించినట్లు చెప్పారు. మరో 48 గంటల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయనీ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై ఇప్పటికే అమెరికా విధించిన ఆంక్షలు ఆ దేశ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతూ ఆ దేశాన్ని ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టాయి.

దాడుల దృశ్యాలు

ఫొటో సోర్స్, Reuters

ఇంతకీ గొడవేమిటి?

సౌదీ ప్రభుత్వ సంస్థ ఆరామ్కో నిర్వహణలోని చమురు కేంద్రం అబ్కాయిక్, ఖురైస్ చమురు క్షేత్రాలపై శనివారం ఉదయం డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడులు జరిగాయి.

పొరుగునే ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీలోని జనసమ్మర్థ ప్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ లాంఛర్లతో వరుస దాడులు చేశారు.

హౌతీ తిరుగుబాటుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ దేశాధ్యక్షుడికి సౌదీఅరేబియా మద్దతు ఉంది. దాంతో సౌదీ, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య వివాదం ఉంది. అలాగే, ఇరాన్, సౌదీల మధ్యా ప్రాంతీయ శత్రుత్వం ఉంది. సౌదీకి బలమైన మిత్రుడైన అమెరికా - ఇరాన్‌కు శత్రుత్వం ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాలను పరిమితం చేసేందుకు ఉద్దేశించిన ఓ ఒప్పందం నుంచి బయటకొచ్చేశారు. ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయి.

గల్ఫ్‌లో జూన్, జులైల్లో రెండు చమురు నౌకలపై జరిగిన దాడుల వెనుకా ఇరాన్ ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అంతకు ముందు మే నెలలో చమురునౌకలపై జరిగిన దాడులూ ఇరాన్ పనేనని అమెరికా ఆరోపిస్తోంది. అయితే, ఇరాన్ ఈ ఆరోపణలన్నీ ఖండిస్తూ వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)