నన్నపనేని రాజకుమారి దళిత ఎస్సైని దూషించారనే కేసుపై ఏమంటున్నారు... వైసీపీ ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Rajakumari
చలో ఆత్మకూరు పేరుతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు తర్వాత సెప్టెంబర్ 11 న జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి.
టీడీపీ నేతల గృహ నిర్బంధం, పలు చోట్ల అరెస్టులు జరగడంపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, ఇదే సమయంలో టీడీపీ నేతల తీరు మీద కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
ముఖ్యంగా మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మీద నమోదయిన కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మహిళా ఎస్సైని ఆమె కులం పేరుతో దూషించారంటూ వైసీపీ, కక్ష సాధింపు చర్యలంటూ టీడీపీ పోటాపోటీ ఫిర్యాదులకు సిద్ధపడింది.
రాజకుమారిపై ఎస్సై ఫిర్యాదు, కేసు నమోదు
నన్నపనేని రాజకుమారి సెప్టెంబర్ 11న తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ పెదకాకాని ఎస్సై అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విధినిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై అనురాధ, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో దూషణ, విధులకు ఆటంకం కలిగించినట్టు ఫిర్యాదు రావడంతో మంగళగిరి పీఎస్ లో నన్నపనేనిపై కేసు నమోదయ్యింది.
ఆమెతో పాటు సత్యవాణి అనే మరో మహిళా నేతపై ఐపీసీ 353, 506, 509 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మంగళగిరి పోలీసులు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Rajakumari/fb
వివాదం ఏమిటి?
టీడీపీ అధిష్టానం సెప్టెంబర్ 11న ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడిక్కడ పలువురు టీడీపీ నేతలను అడ్డుకున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా ఉండవల్లిలోని ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన్ని కలుసుకునేందుకు పలువురు నేతలు చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు. వారిలో నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సహా పలువురు నేతలున్నారు.
ఆ సందర్భంగా వారిని చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు పోలీసులు అనుమతించలేదు. వారిని అడ్డుకుని ఉండవల్లి నుంచి మంగళగిరికి తరలించారు. ఆ సమయంలో నన్నపనేని రాజకుమారి తనను కించపరిచేలా వ్యవహరించాంటూ ఎస్సై అనురాధ ఆరోపించారు.
ఆమె తీవ్రంగా స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
''దళితులంటే చిన్నచూపా, దరిద్రం అంటారా'' అంటూ అనురాధ తీవ్రస్వరంతో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎస్సై అనురాధ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి పోలీసులు నన్నపనేనిపై కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Rajakumari/fb
‘ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి'
నన్నపనేని రాజకుమారిపై అధికార వైసీపీ, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమె దళితులను కించపరిచారంటూ మంగళగిరిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజకుమారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. నన్నపనేని తక్షణమే అరెస్ట్ చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''టీడీపీ నేతలకు దళితులంటే చిన్నచూపు. చంద్రబాబు నుంచి నన్నపనేని రాజకుమారి వరకూ అందరిదీ అదే తీరు. పోలీసులు వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలి'' అని అన్నారు.

'కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు'
తాను ఆ రోజు వ్యాన్ గురించి మాత్రమే దరిద్రంగా ఉందని వ్యాఖ్యానించినట్టు నన్నపనేని రాజకుమారి వివరణ ఇచ్చారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''మాపార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడింది. నన్ను అరెస్ట్ చేసి మూడు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారు. పోలీసులు మా పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒక పాత వాహనాన్ని తీసుకొచ్చి బలవంతంగా దానిలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ వాహనం దుమ్ము, ధూళితో ఉన్నందున మా నాయకురాలితో మాట్లాడుతూ ''ఏంటమ్మా ఈ బండి ఇలా ఉంది... దరిద్రంగా'' అని వ్యాఖ్యానించాను.
‘‘ఆ సమయంలో ఆ వాహనం వెనుకనే ఉన్న మహిళా ఎస్సై ఎవరిని దరిద్రం అంటున్నారంటూ, మాపై కోపం ప్రదర్శిస్తూ, పరుష పదజాలం వాడారు. పోలీస్ జీప్‌లో ఉన్న మేమందరం, మా మానాన మేం ఏదో మాట్లాడుకుంటుంటే, ఆ మాటలను తనకు ఆపాదించుకొని సదరు మహిళా ఎస్సై ఎందుకలా వ్యవహరించిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాకగానీ మహిళాఎస్సైని నేను దూషించానంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని గమనించలేకపోయాను'' అని చెప్పారు.
తనకు ఏ పాపం తెలియదని నన్నపనేని వాదిస్తుండగా, కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- నాని గ్యాంగ్ లీడర్ సినిమా రివ్యూ
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








