ఆర్టీసీ విలీనం: జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణయంతో మేలు జరిగేది ఎవరికి?

ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ చిహ్నం

ఆంధ్ర‌ప్రదేశ్‌ ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)ని ప్ర‌భుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించింది.

క్యాబినెట్ ఆమోదించ‌డంతో ఆర్డినెన్స్‌తో ఆచ‌ర‌ణ‌లోకి దిగుతామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఆహ్వానిస్తూనే, కొన్ని అనుమానాలను తీర్చాల‌ని కోరుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయనున్నట్లు వెల్లడించింది. తొలి క్యాబినెట్ స‌మావేశంలో దానికి సుముఖ‌త వ్య‌క్తం చేస్తూ తీర్మానం చేశారు.

ఆర్టీసీ విలీనం కోసం నిపుణుల క‌మిటీని నియ‌మించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజ‌నేయ‌రెడ్డి నేతృత్వంలోని ఈ క‌మిటీ 90 రోజుల పాటు అధ్య‌య‌నం చేసి, త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించింది.

ఐదు ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌భుత్వం ముందుంచింది. అందులో ఆర్టీసీ విలీనం కోసం ప్ర‌భుత్వంలో ప్ర‌జా ర‌వాణా విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్ర‌ధాన‌మైన‌ది. దాంతో పాటుగా ఆర్టీసీని విలీనం చేయ‌కుండా, సంస్థ‌ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా గ్రాంట్స్ రూపంలో స‌హాయం అందించ‌డం వంటి ప్రతిపాద‌న‌లను ప్ర‌భుత్వానికి నివేదించింది.

ఏపీ కేబినెట్

ఫొటో సోర్స్, AndhraPradeshCM/FB

విలీనం వైపు ప్ర‌భుత్వం మొగ్గు

నిపుణుల క‌మిటీ చేసిన సిఫార్సుల‌లో ఆర్టీసీ విలీనం వైపు ఏపీ ప్ర‌భుత్వం మొగ్గుచూపింది. గ‌తంలోనే వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా విలీనం గురించి హామీ ఇచ్చారు. అంత‌కుముందు ఆర్టీసీలోని వైఎస్సార్టీయూ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలో నిర్వ‌హించిన స‌భ‌లో కూడా జ‌గ‌న్ విలీనం అంశం మీద స్ప‌ష్ట‌మైన ప్రకటన చేశారు. ఇప్పుడు ఆ హామీల‌కు అనుగుణంగా ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆంజ‌నేయ‌రెడ్డి క‌మిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర మంత్రిమండలి తీర్మానాన్ని ఆమోదించిన‌ట్టు మంత్రి పేర్ని నాని ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఆర్డినెన్స్ జారీ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఆర్టీసీ య‌ధావిధిగా ఉంటుంది... సిబ్బంది మాత్ర‌మే ప్ర‌భుత్వంలోకి!

ఆర్టీసీ విలీనంపై ప్ర‌భుత్వం నియ‌మించిన నిపుణుల క‌మిటీ స‌భ్యుడు సీ. రామ‌చంద్ర‌య్య బీబీసీతో మాట్లాడారు.

"మేము 5 అంశాలు ప్ర‌భుత్వానికి నివేదించాం. అందులో మొద‌టి దానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది. దాంతో మిగిలిన అంశాల‌కు ప్రాధాన్య‌త లేదు. దాని ప్ర‌కారం ఆర్టీసీ య‌ధావిధిగా కొన‌సాగుతుంది. నేరుగా విలీనం చేయ‌డానికి సాంకేతిక స‌మ‌స్య‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్రం నుంచి అనుమ‌తి, ఇత‌ర స‌మ‌స్య‌లు దానికి ప్ర‌ధాన కార‌ణం. సిబ్బంది ప్ర‌భుత్వంలో ఉంటూ, ఆర్టీసీకి ప‌నిచేస్తారు. దానికి త‌గ్గ‌ట్టుగా విధివిధానాల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేయ‌బోతోంది" అని రామచంద్రయ్య వివ‌రించారు.

ఆర్టీసీ బస్సులు

ఫొటో సోర్స్, ysrcpofficial/facebook

సిబ్బంది శ్రేయ‌స్సు కోస‌మే: మంత్రి పేర్ని నాని

ఆర్టీసీని ప్ర‌భుత్వ‌ప‌రం చేయ‌డం ద్వారా సిబ్బంది ప్ర‌యోజ‌నాల‌కు ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు నిరూపించుకుంటోందని రాష్ట్ర ర‌వాణా మంత్రి పేర్ని నాని అన్నారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ... "ఆర్టీసీ విలీనం విషయంలో ఉన్న సాంకేతిక అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నాం. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జార‌వాణా చ‌ట్టం నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి. వాటికి అనుగుణంగానే ప్ర‌త్యేకంగా రాష్ట్ర ప్ర‌భుత్వ విభాగం ఏర్పాటు చేస్తున్నాం. సిబ్బందిని నేరుగా ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తాం. వారికి ఉద్యోగ విరమణ ప్రయోజనాలను కూడా ఇతర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా అందిస్తాం. క్యాడ‌ర్ల విష‌యాల్లో ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. విధివిధానాల ఖ‌రారులో అన్నింటినీ అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుంటాం" అని చెప్పారు.

ఆర్టీసీ న‌ష్టాలను అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

"ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బ‌స్సులు కొనుగోలు చేయ‌బోతోంది. తొలుత విజ‌య‌వాడ‌, కాకినాడ‌, క‌ర్నూలు వంటి న‌గ‌రాల్లో అందుబాటులోకి వ‌స్తాయి. ఆ త‌ర్వాత రాష్ట్ర‌మంతా విస్త‌రించ‌డం ద్వారా డీజిల్ భారం అధిగ‌మించే అవ‌కాశం ఉంటుంది. ఆర్టీసీ ఉద్యోగుల చిర‌కాల ఆకాంక్షను ప్ర‌భుత్వం నెర‌వేరుస్తోంది" అని అన్నారు.

ఆర్టీసీ బస్సులు

ఫొటో సోర్స్, Getty Images

విలీనంతో సిబ్బందికి వచ్చే ప్రయోజనాలు

ఏపీఎస్ ఆర్టీసీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి ఏటా రూ.3,300 కోట్ల నుంచి రూ.3,200 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

ఛార్జీల విష‌యంలో రెగ్యులేట‌రీ క‌మిష‌న్ ఏర్పాటు కోసం ప్ర‌తిపాద‌న చేశారు. డీజిల్ బ‌స్సుల స్థానంలో ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులను పెంచేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఆర్టీసీ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 సం.ల‌కు ఉద్యోగ విరమణ ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ సిబ్బందికి అది 58 ఏళ్లుగా ఉంది.

సిబ్బందికి సంబంధించిన విధివిధానాల రూప‌క‌ల్ప‌న మూడు నెల‌ల్లో పూర్తి చేస్తామ‌ని క్యాబినెట్ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు.

ఇన్నాళ్ళుగా ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ట్రేడ్ యూనియ‌న్ చ‌ట్టాలు అమ‌ల‌వుతున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్నాయి. ఇక విలీనం త‌ర్వాత ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నియమావ‌ళి వేరుగా ఉంటుంది. ఈఎస్ఐ స్థానంలో ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు అందిస్తున్న హెల్త్ కార్డులు కేటాయిస్తారు.

ఈపీఎఫ్ విష‌యంలో ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులకు సీపీఎస్ అమ‌లు చేస్తున్నారు. దానిని ర‌ద్దు చేస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న ఈ విధానం ఇప్పుడు విలీనం కాబోతున్న సిబ్బందికి వ‌ర్తింప‌జేస్తారా, లేక మ‌రో మార్గం అన్వేషిస్తారా అన్న‌ది స్ప‌ష్టం కావాల్సి ఉంటుంది. సిబ్బంది సంక్షేమం విష‌యంలోనూ పలు అంశాలపై స్ప‌ష్ట‌త రావాలి.

విజయవాడలో ఆగిన బస్సులు

సంస్థ భ‌విష్య‌త్తుని కూడా దృష్టిలో పెట్టుకోవాలి

ఆర్టీసీ సిబ్బంది త‌మ ప్ర‌యోజ‌నాల‌తో పాటుగా సంస్థ భ‌విత‌వ్యాన్ని కాపాడేందుకు సుదీర్ఘ‌కాలంగా పోరాడుతున్నామ‌ని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి సీహెచ్ సుంద‌ర‌య్య తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ... "ఆర్టీసీ విలీనం ద్వారా సిబ్బంది వేత‌నాల‌తో పాటు కొత్త బ‌స్సుల కొనుగోలు వ్య‌యం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తాన‌ని చెప్ప‌డం ఆశాజ‌న‌క‌మే. వాటిని అమ‌లు చేయాల్సి ఉంటుంది. ప్ర‌జారవాణా వ్య‌వ‌స్థ‌లో ఆర్టీసీ అత్యంత కీల‌క‌మైన‌ది. ప్ర‌భుత్వ ప‌రిధిలోకి వెళ్లిన త‌ర్వాత అనేక రాష్ట్రాల అనుభ‌వాలు గ‌మ‌నిస్తుంటే సంస్థ‌ల మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. అలా కాకుండా సిబ్బందితో పాటుగా వ్య‌వ‌స్థ ప‌రిర‌క్ష‌ణ‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాల‌ని కార్మికులు కోరుకుంటున్నారు" అని అన్నారు.

విజయవాడలో బోసిపోయిన బస్టాండు
ఫొటో క్యాప్షన్, విజయవాడ బస్టాండు

సాహసోపేత‌మైన నిర్ణ‌యం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల‌ని కార్మికులు చేస్తున్న సుదీర్ఘ‌ పోరాటాల‌ను గుర్తించి జ‌గ‌న్ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని వైఎస్సార్ ఆర్టీసీ మ‌జ్దూర్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ... "ఆర్టీసీని కాపాడేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. చంద్ర‌బాబు పాల‌న‌లో అప్పులమ‌యంగా మారిన ఆర్టీసీని జ‌గ‌న్ ప్ర‌భుత్వం విలీనం చేయ‌డం ద్వారా కార్మికుల చిర‌కాల ఆకాంక్ష నెర‌వేర్చారు. బ‌స్సులన్నీ ఎల‌క్ట్రిక‌ల్ అయితే ప్ర‌భుత్వానికి కూడా భారం త‌గ్గుతుంది. ప్ర‌జ‌ల‌కు ప్ర‌జా రవాణా మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది" అని ఆయన అన్నారు.

ఆర్టీసీలో ప్ర‌స్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియ‌న్‌తో పాటుగా, నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్ కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స్వాగతించింది.

అదే స‌మ‌యంలో సంస్థ భ‌విత‌వ్యం కోసం ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఎదురు చూస్తున్నామ‌ని ఆయా సంఘాల నేత‌లు బీబీసీకి తెలిపారు. ప్ర‌భుత్వం వాటిని వెల్ల‌డించిన త‌ర్వాత స్పందిస్తామంటున్నారు.

ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా మునుపటిలాగే ప్ర‌భుత్వ విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా కొన‌సాగుతార‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. "విలీనం చేయ‌మంటే చంద్ర‌బాబు సాధ్యం కాద‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసి చూపిస్తోంది" అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

'ప్రైవేటు ట్రావెల్స్ కోసమే'

అయితే, ట్రాన్స్‌పోర్టు రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు ప్రజా ప్రయోజనాలకు నష్టదాయకమని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. సుందరయ్య అభిప్రాయపడ్డారు.

"ఇది ఆర్టీసి సంస్ధను కూడా సాధారణ ఆపరేటర్‌గా పరిగణిస్తుంది. ఇది సంస్ధ ప్రయోజనాలకు నష్టం చేస్తుంది. ప్రయాణికులపై రవాణా చార్జీలు పెంచడానికి ఈ రెగ్యులేటింగ్ అథారిటీ పనిచేస్తుంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీలకు చాప్టర్ 6 ప్రకారం వున్న ప్రత్యేక హక్కులకు విఘాతం కల్గిస్తారు. ట్రాన్స్‌పోర్టు రెగ్యులేటింగ్ అథారిటీ ఏర్పాటు ప్రవేటు బస్సులను ప్రోత్సహించడానికే. ఆ అథారిటీ అవసరం లేదు. దాన్ని ఆమోదించరాదు" అని సిహెచ్. సుందరయ్య అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)