అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, NASA/Getty Pictures

వాతావరణం కొద్దీగా బాగా లేకున్నా మనం కంగారు పడుతుంటాం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, చలి పెరిగినా, భారీ వర్షం పడినా ఆందోళన చెందుతాం.

అయితే, గంటకు 8 వేల కిలోమీటర్ల వేగంతో గాలు వీచే చోట, ఇనుము సైతం కరిగిపోయేంత తీవ్రంగా ఎండలున్న చోట ఉంటే? ఆ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమే కదూ!

కానీ, ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులున్న గ్రహాలు మన సౌర కుటుంబంలో ఉన్నాయి.

అవేంటో ఒకసారి చూద్దాం.

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

శుక్రుడు మీద అడుగుపెడితే

మొదట శుక్ర గ్రహానికి వెళ్దాం. సౌరకుటుంబంలోనే అత్యంత నివాసయోగ్యంకాని గ్రహంలో ఇది మొదటివరసలో ఉంటుంది.

ఈ గ్రహంపై ఒక పొరలా కార్బన్ డయాక్సైడ్ కప్పి ఉంటుంది. వాతావరణ పీడనం భూమి మీద కంటే 90 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేడి ఒక్కోసారి 460 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు వెళుతుంది. ఈ గ్రహం మీద కాలు పెట్టగానే మీ కాలు ఎండకు కరిగిపోయేంత వేడి వాతావరణంలో ఉంటుందన్నమాట.

ఈ గ్రహంలో వర్షం పడుతుంది. కానీ, అదంతా సల్ఫర్ ఆసిడ్‌తో ఉంటుంది. ఇలాంటి వర్షంలో తడిస్తే మన చర్మం పూర్తిగా కాలిపోతుంది.

అయితే, విపరీత ఉష్ణోగ్రతల కారణంగా వర్షం కిందికిపడేలోపే ఆవిరైపోతుంది. ఇంత తీవ్రస్థాయిలో ఊష్ణోగ్రత ఉన్నప్పటికీ ఇక్కడ మంచు కూడా ఉంది.

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెఫ్ట్యూన్ గ్రహంపై మీథేన్ వాయువులు అధికంగా ఉన్నాయి.

నెఫ్ట్యూన్... గజగజ

సౌర కుటుంబంలో చివర్లో వాయువులతో నిండిన యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాలు ఉంటాయి. భూ గ్రహానికి సుదూరంలో ఉన్న ఈ గ్రహాలు మిథేన్‌తో నిండిన మేఘాలతో నిండి ఉంటాయి.

సౌర కుటుంబంలోని గ్రహాలలో ఇక్కడే అంత్యంత తీవ్రమైన గాలులు వీస్తాయి.

గ్రహ ఆకృతి కారణంగా ఇది చాలా చదునుగా ఉంటుంది. దీనిపైనున్న మీథేన్ వాయువులు గంటకు 2,400 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి.

ఇక్కడి వాతావరణంలో కార్బన్ సంపీడనం చెందడం వల్ల వజ్రాల వర్షం కురుస్తుంది.

ఇక్కడ సగటు ఉష్ణోగ్రత మైనస్ 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది.

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనకు 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒకానొక గ్రహానికి హెచ్‌డీ 189733బీగా పేరు పెట్టారు.

ఇంగ్లండ్‌లోని వార్‌విక్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న టామ్ లౌడెన్‌కు నక్షత్రమండలాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలుసుకోవడమంటే ఇష్టం.

వివిధ గ్రహాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉందో తెలుసుకోవడం ఆయన ఉద్యోగంలో భాగం కూడా.

మనకు 63 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒకానొక గ్రహానికి హెచ్‌డీ 189733బీగా పేరు పెట్టారు.

చిక్కటి నీలిరంగులో ఉండే ఈ గ్రహంలో అంత్యంత తీవ్రమైన వాతావరణం ఉంది.

ఇది చూడటానికి అందంగా ఉండొచ్చు. కానీ, వాతావరణ పరిస్థితులు భయంకరంగా ఉంటాయి.

గంటకు 8 వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రత 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.

''ఈ గ్రహంపై ఉన్న రాళ్లు తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల కరిగి ఆవిరికావడమో లేదా ద్రవ, వాయు రూపంలో ఉండటమో జరుగుతుంది'' అని లౌడెన్ తెలిపారు.

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భూమి పరిణామం, ద్రవ్యరాశితో ఉన్న గ్రహాలు పాలపుంతలో అనేక ఉన్నాయి.

ఎక్కడైన నివాసయోగ్యమైన గ్రహాలు ఉన్నాయా?

భూమి పరిమాణంలోనూ, ద్రవ్యరాశిలోనూ సమానమైన ఇతర గ్రహాలు, నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయని లౌడెన్ చెప్పారు.

''పాలపుంతలో సర్వసాధారణమైన నక్షత్రాలు అవి. నీడలో ఉండే వాటిని భూమి నుంచి చూస్తే కనిపించవు. అవి నివాసానికి అనువైనవా కావా అనేది ఇంకా తెలియదు'' అని ఆయన పేర్కొన్నారు.

కొత్తగా కనిపెట్టిన గ్రహాలు చాలా వరకు గోల్డీలాక్స్ జోన్‌(సూర్యుడికి సుదూరంలోనూ, సమీపంలోనూ కానివి)లో ఉన్నాయి. వాటిలో చాలా వాటిపై ఒక అర్ధభాగంలో పూర్తిగా పగలు, మరో అర్థభాగంలో పూర్తిగా చీకటి ఉంటుంది.

''పగలు ఉండే ప్రాంతంలో ద్రవరూపంలో ఉండే నీరు మేఘాలలోకి ఆవిరైపోతుంది. చీకటిగా ఉండే అర్ధభాగంలో వర్షంగా కురుస్తుంది. అంటే ఒక వైపు ఏడారిగానూ, మరోవైపు మంచుప్రాంతంగానూ అక్కడి వాతావరణం ఉంటుంది'' అని లౌడెన్ తెలిపారు.

ఇతర గ్రహాల్లో వాతావరణం

ఫొటో సోర్స్, Getty Images

యూసీఎల్‌లోని 'ఎక్స్‌ట్రాసోలార్ ప్లానెట్స్‌'లో లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఇంగో వాల్డ్‌మన్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఇలాంటి గ్రహాలలో తగినంత మందపాటి వాతావరణం ఉంటే, పగటి నుంచి చీకటి ప్రాంతానికి ప్రసరణ జరిగి వాతావరణం పూర్తిగా గడ్డకట్టకుండా మారుతుంది'' అని చెప్పారు.

అయితే, ఇప్పటి వరకు భూమిలాంటి నివాస నివాసయోగ్యమైన గ్రహాలను మనం ఇంకా గుర్తించలేదు.

(జాసన్ రిలే రాసిన ఈ కథనాన్ని బీబీసీ ఎర్త్‌లోంచి తీసుకొని ప్రచురించాం. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)