బస్సెక్కుతుంటే పట్టు చీర చిరిగిందని.. ఆర్టీసీపై న్యాయపోరాటం చేసిన మహిళ

నరసింహారావు

ఫొటో సోర్స్, నరసింహారావు

    • రచయిత, సంగీతం ప్రభాకర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సుకు తగులుకోవడంతో ఓ మహిళ పట్టు చీర చిరిగిపోయింది.

సాధారణంగా ఎక్కువ మంది అయితే.. అయ్యో నా పట్టుచీర.. అనుకుని ముందుకెళ్తారు.

కానీ ఓ మహిళ మాత్రం అలా చేయలేదు. తన పట్టుచీర చిరగడానికి కారణమైన ఆర్టీసీపై తన భర్తతో కలిసి న్యాయపోరాటం చేశారు.

చివరకు వినియోగదారుల ఫోరం ఆర్టీసీకి మూడు వేలు జరిమానా విధించింది.

బస్సు

ఫొటో సోర్స్, నరసింహరావు

ఎవరీ మహిళ.. ఏంటీ కేసు?

2018 ఆగష్టు 26న వివాహ వేడుకలకు కట్టెకోల నరసింహరావు, వాణిశ్రీ దంపతులు నల్గొండ నుంచి హైదరాబాద్ ప్రయాణమయ్యారు.

TS 05Z 0188 సూపర్ లగ్జరీ బస్సు ఎక్కేప్పుడు మెట్టుపైన ఉన్న ఇనుప రేకు తగిలి వాణిశ్రీ పట్టుచీర చిరిగింది.

వెంటనే ఈ విషయాన్ని బస్సు డ్రైవర్‌కి చెప్పారు. "మా డిపో వాళ్ళు చూసుకుంటారు లెండి సర్, మనకెందుకు కూర్చోండి సర్" అన్న సమాధానం వచ్చింది.

బస్సు

ఫొటో సోర్స్, నరసింహరావు

తర్వాత ఏం జరిగిందో.. నరసింహారావు మాటల్లోనే..

"దాన్ని మరింత పెద్దదిగా చేయడం ఇష్టం లేక కూర్చున్నాం. బస్సు బయలుదేరిన కొద్ది దూరంలోనే మరో మహిళ బస్సు ఎక్కుతున్నప్పుడు ఆమె చీర కూడా ఇలానే చిరిగింది. దీంతో బస్సు ఫోటోలు తీసాను. వేడుక నుండి తిరిగి వచ్చిన తర్వాత వారం రోజుల్లో మీ నుంచి సమాధానం రాకపోతే వినియోగదారుల ఫోరంని ఆశ్రయిస్తానని డిపోకి నోటీసు ఇచ్చాను.

వారి నుండి సమాధానం రాలేదు. తర్వాత డిపో మేనేజెర్‌ని సంప్రదించాను. 'చిన్న విషయమే కదా వదిలేయండి లేదా మీరే నిర్ణయం తీసుకోండి అన్నారు.' సమాధానం దొరక పోవడంతో కన్స్యూమర్ ఫోరమ్ ని సంప్రదించాను".

విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా వినియోగదారుల ఫోరం ఆర్టీసీకి నోటీసులు పంపింది.

అతి తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చింది.

ఆర్టీసీ నిర్లక్ష్యానికీ, ప్రయాణికుడిని ఇబ్బంది పెట్టినందుకూ, ప్రయాణికురాలి చీరకీ, ప్రయాణికుడు పొందిన మానసిక వ్యధకి పరిహారంగా 3 వేల రూపాయల జరిమానా చెల్లించాలని జనవరి 18న తీర్పు చెప్పింది.

తీర్పు వెలువడిన 30 రోజుల్లో సదరు ప్రయాణికునికి జరిమానా అందించాలని లేని పక్షంలో జరిమానా చెల్లించే రోజు వరకు 9 శాతం వడ్డీ చొప్పున ప్రయాణికుడి అదనంగా చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

నరసింహారావు

ఫొటో సోర్స్, నరసింహారావు

మన హక్కులు తెలియాలి

నరసింహారావు ఇలా కేసులు వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పోస్టల్ డిపార్టుమెంటుపై కేసు వేశారాయన. ఇప్పటి వరకూ 6 వినియోగదారుల కేసులు గెలిచారు.

"నేను 1988లో మొదటిసారి పోస్టల్ డిపార్ట్మెంట్ మీద, టెలిగ్రామ్ ఆలస్యంపై కేసు వేశా. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి టెలిగ్రాం ఇస్తే, నేను సూర్యాపేట వెళ్లాక ఆ టెలిగ్రాం వచ్చింది. దానిపై కేసు వేశా. మరోసారి ఒక ఫోటో స్టూడియో యజమాని ఫోటో ఇచ్చి, నెగిటివ్ ఇవ్వనందుకు కేసు వేశా. ఇలా ఇప్పటి వరకూ 6 కేసులు వేసి, అన్నీ గెలిచాను."

"వినియోగదారుడిగా మన హక్కులు మనకు తెలియాలి. చిన్నదే కదా అని పట్టించుకోవడం మానేయకూడదు. వినియోగదారుడిగా మన హక్కులను అందరు తెలుసుకోవాలని ఈ కేసు వేశా." అని నరసింహారావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)