యెమెన్ యుద్ధం: నడుస్తున్న చరిత్రలో రక్త కన్నీటి అధ్యాయం... ఈ పోరుతో ఏం ఒరిగింది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఫ్రాంక్ గార్డెనర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ వేసవిలో యెమెన్ నుంచి ఎమిరేట్స్ తన దళాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటుంది. అయితే, యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో అనివార్యంగా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఇన్నాళ్ల ఈ యుద్ధంలో ఎవరైనా ఏదైనా సాధించారా?
యెమెన్ యుద్ధం ప్రారంభమై ఐదేళ్లు కావొస్తుంది. నడుస్తున్న చరిత్రలో ఇదే అతిపెద్ద మానవీయ సంక్షోభం అని చెబుతున్నారు. ఈ యుద్ధంలో 10 వేల నుంచి 70 వేల మంది చనిపోయారని అంచనా. బాధితుల్లో ఎక్కువ మంది యెమనీలే. సౌదీ సంకీర్ణ దళాల దాడుల్లోనే 2/3 వంతు చనిపోయారని ఒక అంచనా.
ఐక్యరాజ్యసమితి మానవ వ్యవహారాల సెక్రటరీ జనరల్ మార్క్ లౌకాక్క్ ప్రకారం 30పైకి జరిగిన ఆర్మీ దాడుల వల్ల 33 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇందులో 80 శాతం మందికి రక్షణ, సహాయం అవసరం. ఇప్పటికీ కోటీ మందికి సరైన తిండి దొరకడం లేదు.
ఇప్పటికే, అరబ్‌లోని అతిపేద దేశంగా యెమెన్‌కు పేరుంది. ఈ యుద్ధం కారణంగా అది మరింత పేదరికంలోకి వెళ్లిపోయింది. దేశం ఆర్థికంగా కుదేలైంది.
ఈయేడాది హుతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్ల దాడులు చేయడం వల్ల యెమెన్ యుద్ధం ఇప్పటికే దాని సరిహద్దులు దాటి సౌదీ పట్టణాలవైపు వ్యాపించింది.
హుతీ దళాలు ఇరాన్‌ను స్వాధీనం చేసుకోకుండా నిరోధించేందుకే ఈ యుద్ధం చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన సౌదీ మద్దతిస్తున్న ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో తాము విజయం సాధించామని అంటోంది.
కానీ, యుద్ధం వల్ల యెమెన్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

ఫొటో సోర్స్, EPA
2015 మార్చిలో సౌదీ చేపట్టిన వైమానిక దాడులతో ఈ యుద్ధం ప్రారంభం కాలేదు. దానికంటే ఆరునెలల ముందు యెమెన్‌లోని గిరిజన జాతికి చెందిన హుతీ దళాలు రాజధాని సనాను ఆక్రమించి చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కూలదోయడంతో ప్రారంభమైంది.
హుతీలు యెమెన్‌లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తమకు అనుకూలంగా ఉన్న యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సల్హేహ్‌కు మద్దతుగా సంకీర్ణ దళాలు హుతీలపై దాడులకు దిగాయి.
ఇది దక్షిణ సరిహద్దులో ఇరాన్-మద్దతున్న తిరుగుబాటుగా సౌదీ అరేబియా భావించింది. దీంతో ఆ దేశ యువరాజు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
పాలనలో పెద్దగా అనుభవం లేని సౌదీ అరేబియా యువరాజు, ఆ దేశ రక్షణ మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంకీర్ణ దళాలను ఏర్పాటు చేసి, హూతీ స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
2015 ఏప్రిల్‌లో సౌదీ యుద్ధ సన్నాహక క్షేత్రం రియాద్‌లో నేను పర్యటించినప్పుడు, కొన్ని రోజుల్లోనే హుతీ దళాలను అణచివేస్తామని అక్కడి అధికారి ప్రతినిధి చెప్పారు. కానీ, నాలుగేళ్లు దాటినా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి చర్చలు జరిగాయి. కానీ, శాంతి మాత్రం చేకూరలేదు.
యుద్ధం వల్ల ఏం ఒరిగింది? మిగిలిన ప్రపంచంపైనా దీని ప్రభావం పడింది.
ఈ యుద్ధానికి సంబంధించి రాయల్ సౌదీ ఏయిర్ ఫోర్స్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందించిందని ఆ దేశాన్ని మానవ హక్కుల సంఘాలు కోర్టులకీడ్చాయి. విమర్శలు చేశాయి. గడిచిన నాలుగేళ్లలో యెమెన్‌లో అనేకసార్లు పాఠశాలలపై, ఆస్పత్రులపై, మార్కెట్ ప్రాంతాలపై వైమానిక దాడులు జరగడం వల్ల వేలాది మంది పౌరులు చనిపోయారు.
హుతీలు కూడా యుద్ధ నేరాలకు పాల్పడ్డారు. కానీ, బ్రిటన్ వారికి ఆయుధాలు సరఫరా చేయలేదు.
యూఏఈ ఒకానొక సమయంలో దాదాపు 7000 మంది సైనికులను యెమెన్‌లో మోహరించింది. ఇప్పుడు కొంత సైనాన్ని తగ్గించి యెమెన్ దళాలతో కలిసి హూతీలపై పోరాడుతోంది.
ఈ యుద్ధంలో పాల్గొనడం వల్ల అనేక విధాలుగా తమకు లబ్ధి చేకూరుతుందని యూఏఈ భావిస్తోంది. యెమెన్‌ను హుతీలు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకోవచ్చు. ఆఫ్రికా, అరేబియా మధ్య వ్యూహాత్మక బాబ్ ఎల్-మండేబ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ రాకుండా చేయోచ్చన్నది సౌదీ వ్యూహం.

ఫొటో సోర్స్, Reuters
సౌదీ సేనలు ఇప్పటికే యెమెన్‌లో ఎక్కువ భాగాన్ని హూతీ దళాల నుంచి విముక్తి చేశాయి. అరేబియా ద్వీపకల్ప సమూహంలోని అల్-ఖైదాను కూడా బలహీనపరిచాయి.
ఈ యుద్ధం కోసం సౌదీ కోట్ల రూపాయిలు ఖర్చు చేసింది. కానీ, ఈ యుద్ధంతో ఆ దేశం పెద్దగా సాధించింది ఏమీ లేదు.
''యుద్ధం సౌదీ అరేబియా, యెమెన్‌లను ధ్వంసం చేసింది'' అని రాయల్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన గల్ఫ్ నిపుణుడు మైఖెల్ స్టెఫెన్స్ అభిప్రాయపడ్డారు.
''ఈ యుద్ధం సౌదీ అరేబియాకు పెద్దగా ప్రయోజనం కలిగించలేదు. 2015 లో కంటే ఇప్పుడే ఆ దేశం బలహీనమైన స్థితిలో ఉన్నదని చెప్పొచ్చు'' అని ఆయన అన్నారు.
మరోవైపు, గత డిసెంబరులో స్టాక్‌హోమ్‌లో జరిగిన శాంతి చర్చలు శాశ్వత శాంతి ఒప్పందంగా, కాల్పుల విరమణగా మర్చడంలో వైఫల్యం ఎదురైంది. యెమెన్ యుద్ధం వల్ల తాము సాధించింది, కోల్పోయింది ఏమిటో అందరూ చర్చించుకుంటుంటే, ఆ దేశం మాత్రం వేదనలోనే ఉంది.
ఇవి కూడా చూడండి:
- నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?
- అంతరిక్షంలోకి కొత్త జంటల ప్రేమ సందేశాలు
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ఆ 132 గ్రామాల్లో అసలు ఆడపిల్లలే పుట్టలేదా...
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- ‘రాజకీయ నేతల ప్రేమ వ్యవహారాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎందుకు మాట్లాడరు?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








