యెమెన్ సంక్షోభం: 'నాకూ మిగతా అమ్మాయిల్లా బతకాలనుంది'

యెమెన్ సంక్షోభం

యెమెన్‌లో దాదాపు 80 శాతం మంది ప్రజలకు సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అయితే కొన్ని సుదూర ప్రాంతాలకు ఇప్పటికీ ఎలాంటి సహాయం అందలేదు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఈ నాలుగేళ్లలో రేమాహ్ అనే గ్రామానికి అయితే ఇప్పటి వరకూ ఏ విధమైన సహాయం అందలేదు.

యెమెన్ పర్వత ప్రాంతంలోని రేమాహ్ గ్రామ ప్రజలకు యుద్ధంలో నష్టపోకుండా తల దాచుకోవడానికి నీడ అయితే లభించింది, కానీ యుద్ధం దుష్ఫలితాలు మాత్రం వారిని వదల్లేదు.

ఈ సుదూర ప్రాంతానికి సహాయ సంస్థలు చేరుకోలేవు. ప్రభుత్వ నిధులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.

ఏదో ఓ పని చేసి పొట్ట నింపుకోవడం కోసం పదహారేళ్ల సమర్ చదువు మానేయాల్సి వచ్చింది. ఆమెలా మరెందరో ఇలాగే స్కూలు మానేశారు.

పక్కనున్న ఓ గ్రామానికి ఆమె బియ్యం, పిండి తీసుకెళ్తున్నారు. "నాకూ ఇతర అమ్మాయిల్లా బతకాలనుంది. కానీ నాకా అవకాశం లేదు." అని ఆమె అంటున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: 'మా బతుకులు ఇంతకు ముందు ఇలా లేవు...'

సమర్ ఈరోజు సంపాదించిన డబ్బు కేవలం ఒక బ్రెడ్డు ముక్క, టీ కొనుక్కోవడానికే సరిపోతాయి. మూడింట రెండొంతుల యెమెనీల్లానే, తినడానికి నాలుగు మెతుకులు మళ్లీ ఎప్పుడు లభిస్తాయో ఆమెకు కూడా తెలియదు. ఒకప్పుడు తమ బతుకులు ఇలా ఉండేవి కాదని ఆమె తల్లి వాపోతున్నారు.

"గతంలో సుఖసంతోషాలతో బతికేవాళ్లం. ఇప్పుడు పూటపూటకూ ఇబ్బందే. సమర్ జబ్బు పడితే ఆమెకు ఎప్పుడు నయమవుతుందా అని ఎదురుచూస్తూ మేమంతా పస్తులుండాల్సిందే. ఈ జీవితం ఎంతో కష్టంగా ఉంది. ఇంతకన్నా చావే నయం." అని ఆమె వారి పరిస్థితిని తెలియజేశారు.

యెమెన్ సంక్షోభం

ఏడు నెలల క్రితం లామ్యా అనే పాపకు జన్మనిచ్చింది ఫాతిమా. కానీ ఆ చిట్టి పొట్టను నింపడం కూడా ఆమెకు కష్టమవుతోంది. బిడ్డ తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

"నా బిడ్డ కోలుకోవాలి. ఇతర పిల్లల్లా పెరగాలి. నా పాప ఇలా ఉండిపోవద్దు. తప్పటడుగులు వేస్తూ నడక మొదలుపెట్టాలి. కానీ యుద్ధం వల్ల పాపకు వైద్యం అందించలేకపోతున్నాం. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు." అని ఆమె అంటున్నారు.

యెమెన్

దాదాపు నాలుగు వేల కుటుంబాలకు దావూద్ ముహమ్మద్ క్లినికే ఆధారం.

పౌష్టికాహారలోపంతో బాధపడే పిల్లలకు మేం చికిత్స అందించేవాళ్లం. అవసరమైన మందులు ఇచ్చేవాళ్లం. కానీ మాకు ఎలాంటి సహాయం అందకపోవడంతో క్లినిక్‌ను మూసెయ్యాల్సి వచ్చింది.

ఒక వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అతన్ని వెంటనే దగ్గరలోని క్లినిక్‌కు తీసుకువెళ్లాలి. ఇంధనం ధరలు ఎక్కువ కాబట్టి వాహనంలో తీసుకెళ్లలేని పరిస్థితి. దాంతో కొండదారుల్లో కాలి నడకన ప్రమాదమైన ప్రయాణం చేయాలి. అబ్దుల్లా అనే వ్యక్తి తన మనవడిని ఒక బుట్టలో మోస్తూ మూడు గంటలుగా నడుస్తున్నాడు.

"వాహనాలు ఉపయోగించాలంటే మా శక్తికి మించిన పని. అందుకే జబ్బుపడ్డ పిల్లవాణ్ని వీపుపై ఎత్తుకొని గంటల తరబడి నడుస్తున్నా. వాణ్ని డాక్టరుకు చూపించాలి." అని ఆయనంటున్నారు.

రోగులకు టీకాలు వేయడానికి, ఇతర వైద్య సహాయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.

స్కూళ్ల పరిస్థితి కూడా వైద్య కేంద్రాల పరిస్థితి లాగానే ఉంది. కొన్ని స్కూళ్లు ఇప్పటికీ పని చేస్తున్నాయి. టీచర్లకు గత రెండేళ్లుగా వేతనాలు లేవు. అయినప్పటికీ... కనీసం పిల్లలకైనా మెరుగైన భవిష్యత్తు లభించాలనే ఆశతో వారు స్కూళ్లకు వచ్చి పాఠాలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)