యెమెన్ సంక్షోభం: ఆహార లోపం వల్ల 85,000 మంది చిన్నారుల మృతి

ఫొటో సోర్స్, AFP
తీవ్ర పోషకాహార లోపం వల్ల యెమెన్‌లో గత మూడేళ్లలో 85,000 మంది చిన్నారులు చనిపోయారని ‘సేవ్ ద చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. వీరంతా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలే.
యెమెన్‌లో దాదాపు 1.40 కోట్ల మంది కరవు ముంగిట ఉన్నారని ఐక్యరాజ్యసమితి గత నెలలో హెచ్చరించింది.
దేశంలో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలో అత్యంత దారుణమైన మానవ సంక్షోభానికి కారణమైంది. ఆ యుద్ధానికి ముగింపు పలకటం కోసం చర్చలను పునరుద్ధరించటానికి ఐరాస ప్రయత్నిస్తోంది.
సౌదీ అరేబియా సారథ్యంలోని సంకీర్ణం.. 2015లో హౌతీ తిరుగుబాటు ఉద్యమంపై వైమానిక దాడులు ప్రారంభించటంతో యెమెన్‌లో సంఘర్షణ మొదలైంది. ఆ దాడుల వల్ల దేశాధ్యక్షుడు అబ్ద్రాబు మాన్సోర్ హాదీ విదేశాలకు పారిపోయారు.
ఈ యుద్ధంలో ఇప్పటివరకూ 6,800 మంది పౌరులు చనిపోగా.. 10,700 మంది క్షతగాత్రులయ్యారని ఐరాస గణాంకాలు చెప్తున్నాయి. ఈ యుద్ధంతో పాటు.. సౌదీ సంకీర్ణం అడ్డుకోవటం వల్ల.. దేశంలో 2.2 కోట్ల మందికి అవసరమైన మానవతా సాయం అందటం లేదు.
ఫలితంగా ప్రపంచంలో అతి పెద్ద ఆహార సంక్షోభం తలెత్తింది. కలరా విజృంభించి 12 లక్షల మందికి సోకింది.

ఫొటో సోర్స్, AFP
చిన్నారుల మరణాలపై ఎలా అంచనా వేశారు?
పోషకాహార లోపం వల్ల మరణాల సంఖ్యను కచ్చితంగా సంపాదించటం కష్టం. చాలా మరణాలు అసలు యంత్రాంగం దృష్టికి రావటం లేదు. కారణం.. దేశంలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సగం పని చేయటం లేదు. పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స కోసం వెళ్లలేనంత పేదరికంలో చాలా మంది ప్రజలున్నారు.
ఐక్యరాజ్యసమితి నమోదు చేసిన సమాచారం నుంచి అయిదేళ్ల లోపు చిన్నారుల్లో తీవ్ర పోషకాహార లోపం ఉన్న కేసుల్లో చికిత్స పొందని వారిలో మరణ రేటు సంఖ్య ప్రాతిపదికగా తాము అంచనా వేశామని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తెలిపింది.
ఆ అంచనాల ప్రకారం 2015 ఏప్రిల్ నుంచి 2018 అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు 84,700 మంది చనిపోయి ఉంటారని లెక్కించినట్లు తెలిపింది.
అంతర్యుద్ధం ఫలితంగా ఆహార ధరలు పెరుగుతుండటం, దేశ కరెన్సీ విలువ పతనమవుతుండటం వల్ల దేశంలో మరిన్ని కుటుంబాలకు కనీస ఆహారం అందకుండా పోతోంది.
మరింత ఎక్కువ మంది జనం కరవు కోరల్లో చిక్కుకోవటానికి కారణం సహాయ చర్యలను సౌదీ సంకీర్ణం అడ్డుకోవటమేనని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘సేవ్ ది చిల్డ్రన్’ తప్పుపడుతోంది.
దేశంలోకి దిగుమతులకు జీవనాడి వండి హుదాయదా ఓడరేవు పరిసరాల్లో భారీ సంఘర్షణ జరుగుతుండటం కూడా పరిస్థితిని దిగజారుస్తోందని చెప్పింది.
ప్రస్తుతం తిరుగుబాటుల ఆధీనంలో ఉన్నీ ఈ నౌకాశ్రయం ద్వారానే యెమెన్ 90 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకునేది. ఇప్పుడిక్కడ వాణిజ్య దిగుమతులు నెలకు 55,000 మెట్రిక్ టన్నులకు పైగా పడిపోయాయని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ మొత్తం.. 22 లక్షల మంది చిన్నారులు సహా 44 లక్షల మంది జనానికి సరిపోయే ఆహారమని వివరించింది.

ఫొటో సోర్స్, MOHAMMED AWADH/SAVE THE CHILDREN
పోషకాహారలోపం చిన్నారులకు ఏమవుతుంది?
చారిత్రక అధ్యయనాలను బట్టి చూస్తే.. తీవ్ర పోషకాహార లోపానికి చికిత్స అందించకపోతే, ప్రతి ఏటా 20-30 శాతం మంది చిన్నారులు చనిపోతారని ‘సేవ్ ద చిల్డ్రన్’ చెప్తోంది.
‘‘బాంబులు, బుల్లెట్ల వల్ల చనిపోయే ప్రతి చిన్నారికీ తోడుగా.. ఆకలి వల్ల డజన్ల మంది పిల్లలు చనిపోతున్నారు. సంపూర్ణంగా నివారించగల మరణాలివి’’ అని ఆ సంస్థ యెమెన్ డైరెక్టర్ తామర్ కిరోలోస్ పేర్కొన్నారు.
‘‘ఈ విధంగా చనిపోయే వారు చాలా బాధపడతారు. వారి శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయటం నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తూ చివరికి ఆగిపోతాయి. వారి వ్యాధినిరోధక వ్యవస్థ చాలా బలహీనమైపోతుంది. సులభంగా అంటువ్యాధులకు గురవుతారు. కొందరు కనీసం ఏడవలేనంత నిస్సహాయులుగా మారి ప్రాణాలు కోల్పోతారు’’ అని ఆయన వివరించారు.
‘‘తల్లిదండ్రులు తమ పిల్లలు క్షీణించి క్షీణించి చనిపోవతున్నా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు’’ అని చెప్పారు.
హుదాయదా నగరంపై ఇటీవలి కాలంలో వైమానిక దాడులు నాటకీయంగా పెరగటంతో.. అక్కడ దాదాపు 1,50,000 మంది చిన్నారుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని కూడా ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Image copyrightMOHAMMED AWADH/SAVE THE CHILDREN
ఒక తల్లి ఆవేదన...
నుసాయిర్ ఒక 13 ఏళ్ల బాలుడు. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో ఒకడు. అతడిని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ పర్యవేక్షిస్తోంది.
ఆగస్టులో అతడికి చికిత్స చేశారు. కానీ అక్టోబర్ నాటికి అతడి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.
ఆ సమయానికి వారి ఇంటి వద్ద యుద్ధం తీవ్రమవటంతో.. అతడి తల్లి ఆ ఊరు వదిలి మారుమూల ప్రాంతానికి వలస వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల అతడిని దూరంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి తీసుకురావటం సాధ్యపడలేదు.
‘‘నాకు నిద్ర రాదు. అది చిత్రహింస. నా పిల్లల గురించే ఆందోళన. వారికి ఏదైనా జరిగితే నేను బతకలేను’’ అని అతడి తల్లి సౌద్ ఈ స్వచ్ఛంద సంస్థతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
యెమెన్ ఇప్పటికే కరవు బారిన పడలేదా?
ఇంకా లేదు. కానీ కరవు ముంగిట్లో ఉంది.
యుద్ధంతో ఛిద్రమైన ఈ దేశంలో సగం జనాభా ‘కరవు ముందరి పరిస్థితుల’ను ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి గత నెలలోనే హెచ్చరించింది.
ఈ కింది అంశాల ఆధారంగా ఏ దేశంలోనైనా కరవు నెలకొందని ప్రకటిస్తారు:
- ప్రతి అయిదు కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబానికి ఆహార కొరత తీవ్రంగా ఉన్నపుడు
- అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 30 శాతం మందికి పైగా తీవ్ర పోషకాహర లోపంతో బాధపడుతున్నపుడు
- రోజూ ప్రతి 10,000 మందిలో కనీసం ఇద్దరు చనిపోతున్నపుడు
ఏడాది కిందటి అంచనాల ఆధారంగా, యెమెన్‌లోని 333 జిల్లాలకు గాను 107 జిల్లాల్లో మొదటి రెండు అంశాలూ ఇప్పటికే నెలకొనటమో లేకపోతే ఆ దరిదాపుల్లోకి రావటమో జరిగిందని ఐక్యరాజ్య సమితి చెప్పింది.
కానీ, మరణాల సంఖ్యకు సంబంధించిన మూడో అంశాన్ని నిర్ధరించుకోవటం చాలా కష్టం. ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం ఈ అంచనాలను మళ్లీ వేస్తోంది.
ఇవి కూడా చదవండి
- 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు
- గజ తుపాను: ఆ విలయం మాటల్లో చెప్పలేనిది
- ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి చైనాకు ఉద్వాసన?
- ఇందిరను ఫిరోజ్ మోసం చేశారా? ఇందులో నిజమెంత?
- తెలంగాణలో 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









