గజ తుపాను: ఆ విలయం మాటల్లో చెప్పలేనిది

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల గజ తుపాను సృష్టించిన విధ్వంసానికి తమిళనాడులోని నాగపట్నం జిల్లా తీవ్రంగా నష్టపోయింది. వేలాది మంది ప్రజలు జీవనాధారం కోల్పోయారు.
నాగపట్నం, వేదారణ్యం పట్టణాల మధ్య సుమారు యాభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. పచ్చని ప్రకృతితో కళకళలాడుతుండేది. తమిళనాడు రాష్ట్రంలో చక్కని రహదారులు ఉన్న ప్రాంతాల్లో ఇదొకటి.
అయితే, శుక్రవారం వేకువజామున విరుచుకుపడ్డ గజ తుపాను ధాటికి ఈ ప్రాంతం చిన్నాభిన్నమైంది. ఇక్కడే ఆ తుపాను తీరం దాటింది.
ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలేవీ లేవు. వ్యవసాయం, చేపలు వేట, కొబ్బరి తోటలే ఇక్కడి ప్రజలకు జీవనాధారం. ఇన్నాళ్లూ సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితాలు గజ తుపాను వల్ల ఒక్కసారిగా కుదేలయ్యాయి.
అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దాంతో వేలాది కుటుంబాలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
తమిళనాడులోని తంజావూరు, పుదుకొట్టై, నాగపట్నం జిల్లాల మీద ఈ తుపాను ఎక్కువగా ప్రభావం చూపింది. అందులోనూ నాగపట్నం జిల్లాలోని వెలంకన్ని, కొడియక్కరై ప్రాంతాలు ఇంకా తీవ్రంగా నష్టపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
తరతరాలుగా కష్టపడి నిర్మించుకున్న వనరులన్నీ కళ్లముందే చేతికందకుండా పోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
"నా దుకాణం చూడండి''.. అంటూ తన కుటుంబానికి జీవనాధారమైన చిన్న కిరాణా కొట్టు శిథిలాలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు వెట్టయ్‌కారన్ ఇరుప్పు గ్రామానికి చెందిన ఇలాంచెడియన్.
"ఈ దుకాణం మీద ఆధారపడే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. శుక్రవారం మూసివేశాను. శనివారం వచ్చి చూసేవరకు సగం ధ్వంసమైపోయింది. మా వీధిలోని ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. గజ తుపాను ఎంతటి విధ్వంసం సృష్టించిందో చెప్పడానికి మా వీధి పరిస్థితి చూస్తే చాలు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి మాది" అని ఆయన అన్నారు.
తుపాను ధాటికి ఇళ్లు, చెట్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సెల్ టవర్లు కూలిపోయాయి. మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి.
ఈ తుపాను వల్ల 46 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 12 జిల్లాల్లో 2 లక్షల 17 వేల ఎకరాల పంటలపై ప్రభావం పడింది. వృక్షాలు నేలకూలడంతో వన్యప్రాణులు ఆవాసం కోల్పోయాయి.

నాగపట్నం జిల్లాలోని గ్రామాల్లో కొబ్బరి చెట్లు, చేపల వేటే ప్రధాన ఆధాయ వనరు. కొంతమంది చింతచెట్ల మీద ఆధారపడి బతుకుతున్నారు. తుపాను ధాటికి చాలావరకు కొబ్బరి చెట్లు, చింత చెట్లు కుప్పకూలిపోయాయి.
"మేము ఏనాడూ కొబ్బరి కాయలను, చింత పండును దుకాణంలో కొనలేదు. అనుకోకుండా ఖర్చులు ఎదురైతే అలా వెళ్లి చింతపండునో, కొబ్బరి కాయలనో అమ్ముకునే వాళ్లం. ఇప్పుడు ఆ చెట్లన్నీ పోయాయి. ఎనిమిది మంది సభ్యులున్న మా కుటుంబం కోలుకునేదెలా..'' అంటూ తన గోడును వివరించారు కామేశ్వరం గ్రామానికి చెందిన ఉదయ కుమార్.
కూలిపోయిన చెట్లకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కానీ, ఆ డబ్బు కూలిన చెట్లను పొలం నుంచి తొలగించేందుకు కూడా సరిపోదని ఉదయ్ కుమార్ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గజ తుపాను విరుచుకుపడిన తర్వాత శనివారం మధ్యాహ్నం వరకూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో ఇక్కడి ప్రజలకు సంబంధాలు లేకుండాపోయాయి.
శనివారం సాయంత్రానికి వెలంకన్ని, వెదారణ్యం, కొడియక్కరై ప్రాంతాలకు రహదారులను కొంతమేర పునరుద్ధరించారు.
రహదారులను, విద్యుత్ సరఫరాను ప్రభుత్వం కొంతవరకు పునరుద్ధరించింది. కానీ, కూడూ... గూడూ కోల్పోయిన తమకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు ఇవ్వడం లేదంటూ ఇక్కడి ప్రజలు అంటున్నారు.

నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ నాగపట్నం- వేదారణ్యం రహదారిపై స్థానికులు పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. కామేశ్వరంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
పరిస్థితి అంతా బాగానే ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఓఎస్ మణియన్ కారుపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన మరో కారులో తప్పించుకుని వెళ్లారు. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ పలుచోట్ల నిరసనలు జరిగాయి.
అయితే, ఈ రాస్తారోకోలు, ధర్నాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు అంటున్నారు.
"నాగపట్నం జిల్లాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక చెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లను నేల కూలాయి. నష్టం భారీగా జరిగింది. సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నాం. ప్రజలు మాకు సహకరించాలి" అని జిల్లా ఉప కలెక్టర్ కమల్ కిశోర్ బీబీసీతో అన్నారు.

గజ తుపాను వల్ల ఈ జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 84,500 ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోయాయి. 42,200 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు తెగిపోయాయి. 200కు పైగా సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి.
మరో మూడు రోజుల్లో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఆ శాఖ మంత్రి తంగమణి చెప్పారు.
తుపాను బాధితుల కోసం ప్రభుత్వం 493 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే, వాటిలో కనీస సదుపాయాలు కూడా లేవని బాధితులు బీబీసీకి చెప్పారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వం ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంతో తుపాను వచ్చినప్పుడు చాలామంది మత్స్యకారులు ఇళ్లల్లో ఉన్నారు. దాంతో ప్రాణనష్టం తగ్గింది. కానీ, పెను గాలులకు సముద్ర తీరంలో ఉన్న అనేక బోట్లు తిరగబడి ధ్వంసమయ్యాయి.
ఇక్కడి అన్ని మత్స్యకార గ్రామాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. తీరానికి సమీపంలో ఉన్న అనేక ఇళ్లలోకి నీరు చేరింది.
నాగపట్నం జిల్లాలో 1977 నవంబర్ 12న కూడా ఇలాంటి తుపానే బీభత్సం సృష్టించిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. అప్పుడు 650 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈసారి ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేయడంతో ప్రాణనష్టం భారీగా తగ్గించగలిగారు.
ఇవి కూడా చదవండి:
- మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడు దఫాలుగా బీజేపీ ఎలా గెలిచింది?
- తొంభయ్యేళ్ల ఆ పార్టీ మేనిఫెస్టోలకి దూరం
- 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- అనంత్‌కుమార్‌కు సిగరెట్లు, మద్యం అలవాటు లేదు.. మరి ఆయనకు లంగ్ క్యాన్సర్ ఎలా వచ్చింది?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








