అసదుద్దీన్ ఒవైసీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ మేనిఫెస్టోలకు దూరం

ఫొటో సోర్స్, Shashi k
ఎన్నికలంటే ఏ పార్టీ అయినా తమ విధానాలను, పథకాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తుంది. కానీ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) మాత్రం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు.
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరిలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు కూడా మేనిఫెస్టో లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది.
90 ఏళ్ల కిందట 1927లో 'మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్'గా మొదలైన ఈ పార్టీ తదనంతరం 'ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్' గా తెలుగు నేల నుంచి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది. పార్లమెంటులోనూ ఈ పార్టీ నుంచి అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎన్నికల ప్రణాళిక అవసరం లేదని, పనితీరే తమకు కొలమానమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Shashi k
మభ్యపెట్టడానికే మేనిఫెస్టోలు
ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా గుర్తింపు పొందింది.
"ప్రణాళికలు వేయడం కాదు పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం" అంటారు ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.
"ప్రజలను మభ్య పెట్టడానికి రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో ఒక ప్రధాన సాధనం.. అందుకే మేం ఎన్నడూ ఆ ఊసెత్తం" అనేది ఆయన మాట.

ఫొటో సోర్స్, facebook/aimim
ప్రజల మధ్యే ఉంటాం, ఇంకా ప్రణాళికలు ఎందుకు?
"ప్రజలకు ప్రతి రోజూ అందుబాటులో ఉండే ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మళ్లీ మేం మేనిఫెస్టో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది?" అని ఎంఐఎం నేత శరత్ నలిగంటి 'బీబీసీ'తో మాట్లాడుతూ చెప్పారు. అమలు కాని హామీలిచ్చి ఆ తరువాత ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మా పార్టీ పద్ధతి కాదు అని చెప్పారాయన.
శరత్ నలిగంటి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై అంబర్‌పేటలో పోటీ చేశారు.
హైదరాబాద్ నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి ప్రజలకు తమ నేతలు అందుబాటులో ఉంటారని.. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా తమ కార్పొరేటర్‌నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం అక్కడ ఉంటుందని ఆయన చెప్పారు.
"రాజకీయాలు కాదు ప్రజలే ముఖ్యం"
విద్యార్థి నేతగా ఉన్న తనలాంటి వారికి ఎంఐఎం అవకాశాలిచ్చిందని.. ఎంఐఎం నేతలకు రాజకీయాల కంటే ప్రజలే ముఖ్యమని ఆయన చెప్పుకొస్తారు.
ఎంఐఎం అనేది పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర కూడా సరికాదని.. అది బలహీనుల కోసం పనిచేసే పార్టీ అని శరత్ తెలిపారు. తమ పార్టీ వివిధ నియోజకవర్గాల నుంచి హిందువులకు టిక్కెట్లిచ్చిందని.. హైదరబాద్ నగరానికి ఒక దళితుడిని మేయర్ చేసిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘హిందూ వ్యతిరేకులం కాదు’
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో హిందువులను బరిలో నిలపడమే కాకుండా ముగ్గురు హిందువులను తమ పార్టీ నుంచి మేయర్లను చేసింది. కె.ప్రకాశరావు, ఎ.సత్యనారాయణ, ఆలంపల్లి పోచయ్యలు ఎంఐఎం నుంచి హైదరాబాద్ మేయర్లుగా పనిచేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పలు స్థానాల్లో హిందూ అభ్యర్థులను బరిలో దించింది. నవీన్ యాదవ్, శరత్ నలిగంటి, మురళీధర్ రెడ్డి వంటివారు ఈ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించలేనప్పటికీ ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే అధిక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.
2014లోనే అంబర్‌పేట నుంచి పోటీ చేసిన శరత్ నలిగంటి అక్కడ బలమైన అభ్యర్థి కిషన్ రెడ్డిని ఎదుర్కొన్నారు. రెండో స్థానంలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థితో దాదాపు సమాన స్థాయిలో ఓట్లు సాధించారు.
2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం తరఫున ఏనుగు మురళీధర్ రెడ్డి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు.
కాగా ఇటీవల కాలంలో దేశంలోని పలు ఇతర ప్రధాన పార్టీలూ ఎంఐఎం మాదిరిగా మేనిఫెస్టో విడుదల చేయకుండా ఎన్నికలకు వెళ్లాయి. 2017 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ సైతం మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ కూడా మేనిఫెస్టో లేకుండా ప్రజల ముందుకు వెళ్లింది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఈ విధానం అనుసరిస్తున్నాయి.

ఫొటో సోర్స్, facebook
బండారం బయటపడుతుందనే మేనిఫెస్టో ఇవ్వరు: అమ్జాద్ ఉల్లా ఖాన్
అయితే, మేనిఫెస్టోలు విడుదల చేయనప్పటికీ ముస్లింలకు ఇచ్చిన అనేక హామీలను ఎంఐఎం ప్రజాప్రతినిధులు అమలు చేయలేకపోయారన్న ఆరోపణలు ఆ పార్టీపై ఉన్నాయి.
ఎంబీటీ నేత అమ్జాద్ ఉల్లా ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయకపోవడం వెనుక ఆ పార్టీ కుటిల రాజకీయం ఉందని ఆరోపించారు.
‘‘వారు తమ అసత్య హామీలను రాత పూర్వకంగా ప్రజల ముందుకు తెస్తే వాటిని అమలు చేయడంలో విఫలమైనప్పుడు ప్రజలు వారిని నిలదీస్తారు. అందుకే వారు మేనిఫెస్టో అంటే భయపడతారు.
కనీసం ప్రభుత్వాలు ఇచ్చే హామీలు అమలయ్యేలా చూస్తాం అని కూడా చెప్పలేని పరిస్థితి ఆ పార్టీది.
అంతేకాదు.. ఎంఐఎం సభ్యులు నిర్వహించే ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థల ద్వారా ప్రజలకు ఎలాంటి సేవ చేస్తామన్నది కూడా చెప్పరు.
ఇదంతా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకేమీ కాదు’’ అని అమ్జాద్ ఉల్లా ఖాన్ అన్నారు.
‘ఎంఐఎం చేసిందేమీ లేదు’
ఎంఐఎం పార్టీ కానీ, ఒవైసీలు కానీ పాత నగరానికి చేసిందేమీ లేదన్నారు సియాసత్ పత్రిక న్యూస్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్. సాధారణంగా అన్ని చోట్లా జరుగుతున్న పనులే ఇక్కడ కూడా జరుగుతున్నాయనీ, వెనకబడ్డ పాత బస్తీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నదేమీ లేదనీ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, స్థానిక సంస్థలు కనీసంగా చేయాల్సిన పనులను చేయడం కూడా గొప్ప ఘనకార్యంగా చూసే పరిస్థితి ఉందని ఆయన వివరించారు.
ఒవైసీలు వ్యక్తిగతంగా ట్రస్టు పేరుతో పాఠశాలలు కడుతున్నారనీ, కానీ విద్య ముఖ్యమనే విషయం వారికి 60 ఏళ్ళ తరువాత గుర్తొచ్చిందా అని ఆమిర్ ప్రశ్నించారు.
ఎంఐఎం పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వారితో అంటకాగి, అవినీతి చేస్తుందనీ, ముస్లింల అభివృద్ధి వారికి పట్టదన్న ఆయన, ముస్లిం రిజర్వేషన్ ఇవ్వని టిఆర్ఎస్ తో ఎంఐఎం స్నేహమే అందుకు ఉదాహరణ అన్నారు.
కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వలేనప్పుడు టిఆర్‌ఎస్‌తో ఎంఐఎంకి స్నేహం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
వారు ఎప్పుడూ మానిఫెస్టోలు రిలీజ్ చేయరన్న ఆమిర్, వాళ్లు చేసేదేమీ ఉండదనీ, అసలు పాత నగరానికి వారేం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
1980 లలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటింగ్ 90 శాతం ఉండేదనీ ఇప్పుడు 40 నుంచి 50 శాతానికి పడిపోయిందనీ, అందులో ఎంఐఎం అనుకూల ఓట్లు ఇంకా తక్కువనీ ఆయన విశ్లేషించారు. ఎంఐఎంపై విరక్తితోనే జనం ఓటింగుకు రావడం లేదని ఆయన అన్నారు. మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసే ఓవైసీలు, తెలంగాణలో మాత్రం ఎందుకు హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ప్రశ్నించారాయన.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









