తెలంగాణ ఎన్నికలు 2018: నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా? సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?

- రచయిత, దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
- హోదా, షూట్: నవీన్ కుమార్ కె, శివకుమార్.. ప్రొడ్యూసర్, ఎడిట్: సంగీతం ప్రభాకర్
'ఆడపిల్ల అంటే ఇష్టం లేదు.. ఏడికేల్లి కట్నం తేవాలి' అని నిర్మొహమాటంగా చెప్పారు నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లంబాడీ మహిళ లాలీ.
'మగపిల్లాడు పుట్టేవరకు మా అత్తమామలు మాతో మాట్లాడలేదు' అని కన్నీటి పర్యంతమయ్యారు అదే ప్రాంతానికి చెందిన హేము.
నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు, పుట్టిన బిడ్డను పురిట్లోనే వదిలేసే పరిస్థితి ఇంకా కొనసాగుతోందా? ప్రత్యేక రాష్ట్రం వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ సమస్య పరిష్కారమైందా?
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మీ, అమ్మఒడి, కేసీఆర్ కిట్ తదితర పథకాలతో పరిస్థితి ఏమైనా మారిందా..?
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో పర్యటించిన బీబీసీ బృందం ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతం రెండు దశాబ్దాలుగా ఆడపిల్లల అమ్మకాల వార్తలతో చర్చల్లో ఉంటోంది.
బీబీసీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు చాలా మంది మహిళలు ఆడపిల్ల పుడితే సమాజంలో తమ పరిస్థితి దారుణంగా ఉంటోందని చెప్పారు.
గతేడు గొట్టిముక్కల గ్రామం తెల్లావుల తండాకు చెందిన కవిత తన బిడ్డను రూ.వెయ్యికి అమ్మేశారు. కానీ, అధికారులు రంగంలోకి దిగి ఆ పాపను తిరిగి కవితకే అప్పగించారు.
'మగపిల్లాడు పుట్టిన తరవాతే మా వాళ్లు నాతో మాట్లాడటం మొదలు పెట్టారు' అని కవిత బీబీసీకి చెప్పారు.

'ఆడపిల్ల పుడితే పురిట్లోనే వదిలేస్తా'
పార్శీతండాకు చెందిన హేమీకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో అత్తమామలు ఆమెతో మాట్లాడలేదు. 'ఈసారి మగపిల్లాడు పుడితే ఇంటికి తీసుకొస్తా... ఆడపిల్ల పుడితే పురిట్లోనే వదిలేస్తా' అని ప్రసవ సమయంలో అనుకున్నానని హేమీ బీబీసీకి చెప్పారు. నాలుగో కాన్పులో హేమీకి మగ పిల్లాడు పుట్టాడు.
లలితది కూడా గతంలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.
'నాకు వరసగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నా. కానీ, మా వాళ్లు నాతో మాట్లాడటం మానేశారు. దీంతో మరోసారి గర్భం దాల్చాను. దేవుడి దయవల్ల మగ పిల్లవాడు పుట్టాడు. ఇప్పుడు అందరు నాతో మాట్లాడుతున్నారు' అని లలిత తెలిపారు.

నాలుగేళ్లలో 40కి పైగా కేసులు
దేవరకొండ, చందంపేట మండలాల్లో ఆడపిల్లల అమ్మకాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. లంబాడా తండాలలోనే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆడపిల్లలను అమ్మేవారు, కొనేవారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నట్లు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ కృష్ణవేణి బీబీసీకి తెలిపారు.
నాలుగేళ్లలో దాదాపు 42 కేసులు నమోదయ్యాయని చెప్పారు.
'రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రమే రెండు శిశు సంరక్షణ గృహాలున్నాయి. నాలుగేళ్లలో ఇక్కడ 170 మంది ఆడపిల్లలను వదిలేసి వెళ్లారు. వీరిని దత్తత తీసుకోడానికి దరఖాస్తులు కూడా ఎక్కువే వస్తుంటాయి' అని ఆమె వివరించారు.

'వరకట్నమే అసలు సమస్య'
ఆడపిల్లలను అమ్మేయడం, పురిటిలోనే వారిని వదిలేయడం ఒక సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.
'లంబాడి తెగలు మైదాన ప్రాంతానికి వచ్చి సమాజంతో సంబంధాలు ఏర్పరుచుకోవడంతో వారిలో వరకట్న సమస్య మరింత ఎక్కువైంది. వీరి కుటుంబాల్లో మగపిల్లలను చదివిస్తుంటే ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. చదువకున్న అబ్బాయిలకు భారీ కట్నం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆడపిల్ల అంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది' అని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కృష్ణవేణి విశ్లేషించారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిపి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
'అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి గర్భిణీల వివరాలను సేకరిస్తున్నాం. ప్రసవాల సంఖ్యను కూడా నమోదు చేస్తున్నాం. నిఘా పెరగడంతో 2017 నుంచి ఆడపిల్లల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి' అని తెలిపారు.
అయితే, ఈ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉందని గ్రామ రిసోర్స్ సెంటర్ అధికారి డాక్టర్ రుక్మిణి రావు బీబీసీకి చెప్పారు.
‘ముఖ్యంగా ఈ సమస్యను మహిళల కోణంలోనే అందరూ చూస్తున్నారు. మగాళ్లలో చైతన్యం తీసుకొస్తేనే పరిస్థితి మారుతుంది. ఆడపిల్లలు మగవారితో సమానంగా పెంచేలా వారిని చైతన్యపరచాలి. ఆడపిల్లల స్వయంసమృద్ధికి ఉపయోగపడేలా ప్రభుత్వ పథకాలు తీసుకరావాలి’ అని చెప్పారు.
ఎన్ని చర్యలు చేప్టటినా, అంతర్గతంగా ఆడపిల్లల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయిని, ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి అని రుక్మిణి రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- నల్లగొండ శిశుగృహలో అంతుచిక్కని మరణాలు
- నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య: ‘‘తగ్గుతోంది, కానీ చేయాల్సింది చాలా ఉంది’’
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- 'ఓటు ఒక గొప్ప వరం. దాన్ని వదులుకోకూడదు' అంటూ ఇంటింటికీ ప్రచారం
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్పై ఎలా గెలిచానంటే'
- సింగర్ బేబీ: రెహమాన్ మెచ్చిన ఈ కోయిల పాట ఇలా మొదలైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








