కిలోగ్రాములో మార్పులు: నేటి కిలోకి.. 2019లో కిలోకి తేడా ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడున్న ‘కిలో’లకు 2019లో మనమంతా గుడ్‌బై చెప్పబోతున్నాం. కానీ.. దానివల్ల ఎవరూ ఏమాత్రం బరువు తగ్గబోరు.
కిలోగ్రాము ద్రవ్యరాశి కచ్చితంగా నిర్ధారించటం కోసం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త విధానానికి ప్రభుత్వాలు శుక్రవారం ఆమోదించాయి.
ఈ మార్పుల వల్ల మన రోజువారీ జీవితాల్లో తేడాలేమీ ఉండబోవు. పరిశ్రమలు, శాస్త్ర పరిశోధనల్లో ద్రవ్యరాశిని అత్యంత కచ్చితంగా లెక్కించాల్సిన అవసరమున్న చోట మార్పులు ఉండొచ్చు.
అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రాథమిక యూనిట్లలో కిలో అనేది ఒకటి.
ఈ కొలమానాల్లో నాలుగింటిని - కిలో, యాంపియర్ (విద్యుత్ యూనిట్), కెల్విన్ (వేడి), మోల్ (అణువుల సంఖ్య) లను - పారిస్‌లోని వెర్సైల్స్‌లో జరుగుతున్న బరువులు, కొలతల మీద సర్వసభ్య సమావేశం (జనరల్ కాన్ఫరెన్స్ ఆన్ వెయిట్స్ అండ్ మెజర్స్ - సీజీపీఎం)లో నవీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కిలోగ్రామ్ అంటే?
కిలోగ్రామ్ అనేది.. ఒక భౌతిక వస్తువు ద్వారా కొలిచే ప్రాథమిక యూనిట్.
‘గ్రాండ్ కె’ అని వ్యవహరించే అసలు కిలో రాయి.. 90 శాతం ప్లాటినం, 10 శాతం ఇరీడియంతో తయారు చేసిన 4 సెంటీమీటర్ల సిలిండర్. దీనిని లండన్‌లో తయారు చేశారు. ఈ రాయిని 1889 నుంచీ పారిస్‌లోని సెవర్స్‌లో ఉన్న ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ (బీఐపీఎం) లాకర్లలో భద్రపరిచారు.
అయితే, భౌతిక వస్తువులు సులభంగా అణువులను కోల్పోవటం, లేదా గాలి నుంచి అణువులను సంలీనం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి, గత శతాబ్ద కాలంలో దీని ద్రవ్యరాశి కొన్ని పదుల మైక్రోగ్రాముల మేర మారింది.
దీనర్థం... ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న కిలోగ్రాములు, తూకపు రాళ్లు.. నిర్దిష్టంగా చెప్పాలంటే కచ్చితమైనవి కావు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటువంటి సూక్ష్మ తేడాలను సాధారణ జీవితంలో గుర్తించలేం. కానీ.. అత్యంత కచ్చితమైన శాస్త్రీయ లెక్కల్లో అవి సమస్య అవుతాయి.
కొత్త కిలో
భవిష్యత్తులో కిలోగ్రాముని.. ఒక కిబుల్ లేదా వ్యాట్ బాలన్స్ ఉపయోగించి కొలుస్తారు. ఇది యాంత్రిక, విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించి కచ్చితంగా లెక్కించే ఒక సాధనం.
కిలోని భౌతిక వస్తువుతో కాకుండా ఒక యూనిట్‌తో కొలవటం అంటే.. ఆ కొలమానం మారిపోవటం, చెడిపోవడం వంటివి ఉండవు.
దీనివల్ల శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఎక్కడైనా నిర్దిష్టమైన కిలో లెక్కలు తీసుకోగలరు.
‘‘శాస్త్రీయంగా కొలవటంలో ఈ పునర్నిర్వచనం ఒక మైలురాయి’’ అని బ్రిటన్ నేషన్ ఫిజికల్ లేబరేటరీ రీసెర్చ్ డైరెక్టర్ థియొడూర్ జాన్సన్ పేర్కొన్నారు.
‘‘ఇది మరింత కచ్చితమైన కొలతలకు మార్గం వేస్తుంది. సైన్స్‌కి మరింత స్థిరమైన పునాదిని ఏర్పరుస్తుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఇతర మార్పులు
ఈ కొత్త కిలోగ్రాము 2019 మే 20 నుంచి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు.
విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే కొలమానం (యాంపియర్) విషయంలోనూ కొత్త పద్ధతిని కూడా ఖరారు చేశారు.
విద్యుత్‌ను ఇకపై.. ఎలక్ట్రాన్లకు ఒక్కొక్కటిగా కదిలిస్తూ వాటిని గణించే ఎలక్ట్రాన్ పంపుల సాయంతో కొలుస్తారు.
ఇక కెల్విన్ (వేడి యూనిట్)ను కూడా అకోస్టిక్ థెర్మోమెట్రీ ద్వారా లెక్కిస్తారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద గ్యాస్ నిండిన ప్రాంతంలో ధ్వని వేగాన్ని గణించటం ద్వారా దీనిని కొలుస్తారు.
పదార్థాన్ని లెక్కించటానికి ఉపయోగించే యూనిట్ మోల్‌ను.. ఇకపై స్వచ్ఛమైన సిలికాన్-22లో ఖచ్చితమైన అణువుల సంఖ్యను లెక్కించే ఒక పరికరం ద్వారా గణిస్తారు.
ఇవి కూడా చదవండి:
- కేరళ వరదలు: ఫేక్‌న్యూస్ ప్రవాహం
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
- ఈదీ అమీన్: మనిషి రక్తం తాగిన నియంత
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్‌పై ఎలా గెలిచానంటే'
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








