జాతీయ ఓటరు దినోత్సవం: ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న శేషతల్పశాయి

ఫొటో సోర్స్, INCTELANGANA/FACEBOOK
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెల్లటి దుస్తులు వేసుకొని చేతిలో కరపత్రాలు పట్టుకొని కనిపించిన వారికల్లా పంచుతుంటారు 77 ఏళ్ల శేషతల్ప సాయి. ఓటరు లిస్టులో ఎవరి పేరైనా లేకపోతే దగ్గరుండి నమోదు చేయిస్తారు.
ఎన్నికల వేళ ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలు సాధారణమే.. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటారు.
కానీ, శేషతల్ప శాయి రాజకీయ నాయకుడు కాదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తన వారికి ఓటు వేయాలని ప్రచారమూ చేయడం లేదు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు ఎంత కీలకమో వివరించడానికి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఓటు విలువను తెలియజేస్తున్నారు.

ఫొటో సోర్స్, Sai
ఐదేళ్ల నుంచి ఇదే పనిలో...
విజయవాడకు చెందిన శేషతల్ప శాయి 35 ఏళ్ల పాటు ఓ ప్రైవేటు కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 20 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు.
నగరంలో ఓటింగ్ శాతం ప్రతి ఎన్నికల్లోనూ తక్కువగా నమోదవడం ఆయన గమనించారు.
ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరగుతోందని భావించారు.
రిటైర్డ్ అయిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఓటర్లను చైతన్యం చేసేందు వినియోగిస్తున్నారు.
'ఎన్నికలను పండగలా జరుపుకోవాలి'
గత ఐదేళ్ల నుంచి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని శేషతల్పసాయి బీబీసీకి చెప్పారు.
''ఎన్నికలను ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే పండగలా జరుపుకోవాలి. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవుతుంది' అని ఆయన పేర్కొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పడమే కాదు, ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన పత్రాలను వెంట తీసుకెళ్తానని, కొన్ని వేల మందిని ఓటరు జాబితాలో చేర్చారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Sai
అన్నిచోట్లా ప్రచారం..
తన ప్రచారంలో భాగంగా నిర్మాణ రంగం చోట్ల, దినసరి కూలీలు ఉండే ప్రాంతాల్లో కూడా పర్యటిస్తుంటానని శేషతల్పసాయి తెలిపారు.
'కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజల కంటే ధనికుల్లోనే ఓటింగ్ పై అవగాహన తక్కువ , ఓటు వేయడానికి వారు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అది తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఎన్నికల అధికారులు నా సహాయం తీసుకుంటారు'
ఎన్నికల సంఘం నిర్వహించే ఓటర్లు అవగాహన కార్యక్రమాలకు వెళ్లి, అక్కడ కూడా కరపత్రాలు పంచుతున్నట్లు శేషతల్ప శాయి తెలిపారు.
'నేను ఉండే ఎస్‌ఆర్ నగర్ మోడల్ కాలనీలో ఓటరు నమోదుకు సంబంధించి ఇబ్బందులు ఉంటే బూత్ లెవల్ అధికారులు మా ఇంటికే వస్తారు. వారికి నా వంతుగా సాయం చేస్తుంటా' అని ఆయన చెప్పారు.
సీనియర్ సిటిజన్ల సంఘాల్లోనూ, కమ్యూనిటీ భవనాల్లోనూ సొంత ఖర్చుతో ఎన్నికల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
'గుర్తింపు కోసమో అవార్డులకో నేను ఈ పనిచేయడం లేదు. నిజాయితీగల వ్యక్తులను ప్రజలు ఎన్నుకోడానికి ఓటు ఒక గొప్ప వరం. దాన్ని వదులుకోకూడదని చెప్పడానికి ఈ వయసులో ప్రయత్నిస్తున్నా' అని శేషతల్ప శాయి చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- తెలంగాణ ఎన్నికలు : ఏ ఎమ్మెల్యేపై ఎన్ని కేసులు?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- అడాల్ఫ్ హిట్లర్ - ఓ యూదు చిన్నారి: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్నేహం
- పెయిడ్ న్యూస్: ఎన్నికల వేళ వార్తల వ్యాపారం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








