అడాల్ఫ్ హిట్లర్: అరవై లక్షల యూదుల హత్యకు కారణమైన ఆ నియంత... ఈ యూదు చిన్నారికి మంచి స్నేహితుడు

హిట్లర్, రోసా

ఫొటో సోర్స్, ALEXANDER HISTORICAL AUCTIONS

తొలిసారి ఈ ఫొటోను చూడగానే ఓ చిన్నారిని అప్యాయంగా కౌగలించుకున్న వ్యక్తి సంతోషమే కళ్లకు కనిపిస్తుంది. కానీ, ఈ ఫొటో వెనుక పైకి కనిపించని కన్నీటి కథ కూడా దాగుంది.

దాదాపు 60 లక్షల మంది యూదుల మరణానికి కారణమైన అడాల్ఫ్ హిట్లర్ ఓ అమ్మాయిని హత్తుకున్నప్పుడు తీసిన ఫొటో ఇది. ఇక్కడ ఉన్న అమ్మాయి కూడా ఓ యూదురాలు కావడం విశేషం. ఈ ఫొటో మీద హిట్లరే స్వయంగా సంతకం చేశారు.

యూదుల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ రోసా బెర్నిల్ నీనావ్ అనే ఈ అమ్మాయితో హిట్లర్ స్నేహం చేశారు. కానీ, అయిదేళ్ల తరువాత అత్యున్నత స్థాయిలో ఉన్న నాజీ అధికారులు కల్పించుకోవడంతో హిట్లర్ ఈ అమ్మాయితో స్నేహాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

1933లో హెన్రిక్ హోఫ్‌మన్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ అరుదైన ఫొటోను ఇటీవలే అమెరికాలో వేలం వేశారు. ఇది దాదాపు 8.2లక్షల రూపాయలకు అమ్ముడైనట్లు మేరిలాండ్‌లోని అలెగ్జాండర్ హిస్టారికల్ యాక్షన్ ఏజెన్సీ తెలిపింది.

హిట్లర్ సంతకం చేసిన ఈ ఫొటోను ఇటీవలే తొలిసారిగా బయటపెట్టారు.

‘ప్రచారం కోసం హిట్లర్ తరచూ పిల్లలతో ఫొటో దిగేవారు. కానీ ఈ ఫొటోలో నిజమైన ఆప్యాయత కనిపించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ అమ్మాయిని హిట్లర్ మనస్పూర్తిగా హత్తుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని చూసి నేను నిజంగా షాకయ్యా’ అని ఫొటోను వేలం వేసిన బిల్ పానాగోపులస్ అనే వ్యక్తి చెప్పారు.

హిట్లర్, రోసా

ఫొటో సోర్స్, ALEXANDER HISTORICAL AUCTIONS

అసలు కథ ఏంటి?

హిట్లర్‌, చిన్నారి రోసా.. వీళ్లిద్దరి పుట్టిన తేదీ ఒక్కటే. ఆ సారూప్యతే వీరిద్దరినీ మరింత దగ్గర చేసిందని చెబుతారు.

ఫొటోను వేలం వేసిన సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1933లో హిట్లర్ పుట్టినరోజు నాడు రోసా తల్లితో కలిసి ఆయన ఉన్న బంగళా దగ్గరకు వెళ్లింది. రోసా పుట్టినరోజు కూడా అదే రోజని తెలుసుకున్న హిట్లర్ ఆ చిన్నారిని దగ్గరకు పిలిచి ఈ ఫొటోలు దిగారు.

ఆ తరువాత కొన్నాళ్లకు రోసా తల్లి యూదు జాతీయురాలని నాజీ అధికారులకు తెలిసింది. అయినా కూడా హిట్లర్ ఆ అమ్మాయితో స్నేహం కొనసాగించారు. కొన్ని రోజుల తరువాత ఆయన తమ ఫొటోపైన సంతకం చేసి ఆమెకు పంపించారు.

తరువాత రోసా ఆ ఫొటోపైన కొన్ని పూల బొమ్మలు వేసింది.

1935-38 మధ్య హిట్లర్‌కు రోసా కనీసం 17 సార్లు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. తరువాత హిట్లర్‌తో సంబంధాలు కొనసాగించొద్దని అతడి వ్యక్తిగత సెక్రటరీ రోసా తల్లికి సూచించడంతో, వారిద్దరి మధ్యా బంధానికి తెరపడింది.

కానీ, హిట్లర్‌కు ఆ పరిణామం నచ్చలేదని, తన చిన్నచిన్న ఆనందాలను కూడా కొందరు దూరం చేస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు ‘హిట్లర్ వాజ్ మై ఫ్రెండ్’ అనే పుస్తకం రాసిన హోఫ్‌మాన్ చెబుతారు.

రోసా స్వచ్ఛమైన ఆర్యురాలు కాదని మొదట ఓ నాజీ అధికారి గుర్తించారు. ఆ తరువాత రోసాను హిట్లర్‌కు దూరం చేసిన ఏడాదికి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అది ముగిసే నాటికి 60లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు.

యుద్ధం ముగిసేప్పటికి రోసా కూడా ప్రాణాలతో లేదు. 1943లో, 17ఏళ్ల వయసులో పోలియో కారణంగా ఆమె మ్యూనిక్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)