సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు చేసేందుకు సమ్మతిని రద్దు చేసిన చంద్రబాబు... దీని పర్యవసానాలేమిటి?

ఫొటో సోర్స్, Nara Chandrababu Naidu/Facebook
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఆంధ్రప్రదేశ్‌లో దాడులు, దర్యాప్తులు చేయడానికి ఉన్న సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నట్లు చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసాధారణ నిర్ణయానికి సంబంధించిన జీవో నంబర్ 176ను నవంబర్ 8న జారీ చేసింది.
దిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946లోని సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఏర్పాటు చేసిందని, దాని పరిధి దిల్లీ భూభాగం వరకే ఉంటుందని ఏపీ ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది.

ఫొటో సోర్స్, AP GOVT
రాష్ట్ర హోం శాఖ ఆగస్టు 30న విడుదల చేసిన జీవోను అనుసరించి దిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946 ప్రకారం ఏర్పడిన సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌లో సమ్మతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ సంతకంతో జీవో 176 విడుదలైంది.
దిల్లీ కాకుండా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన పని నిర్వర్తించాలంటే ఆ రాష్ట్ర సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్) తెలపాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం మీద సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బీబీసీతో మాట్లాడుతూ, "సాంకేతికంగా సమ్మతిని ఉపసంహరించే హక్కు రాష్ట్ర ప్రబుత్వానికి ఉంది. కానీ, ఇలాంటి నిర్ణయం వల్ల చట్ట స్ఫూర్తి దెబ్బతింటుంది" అని అన్నారు.
సిబిఐని అడ్డుకోవడం వల్ల అవినీతి మరింత పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, CBI/FACEBOOK
'రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది'
కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో సోదాలు, విచారణ చేపట్టకుండా సమ్మతిని నిరాకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు.
అయితే, ఇలాంటి చర్యల వల్ల అవినీతి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
'సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకంటే, రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఏసీబీపై పనిభారం మరింత పెరుగుతుంది. ఏసీబీ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు'అని ఆయన అన్నారు.
2001లో కర్నాటక ప్రభుత్వం కూడా ఇలానే ఒకసారి సమ్మతిని ఉపసంహరించుకుందని ఆయన గుర్తు చేశారు.
'సీబీఐ వేధిస్తోన్న తీరు చూశాక...'
సీబీఐని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని న్యాయవాది, విజయవాడ బార్ కౌన్సెల్ సభ్యులు ఎర్నేని వేదవ్యాస్ బీబీసీతో అన్నారు. గత కొన్ని నెలలుగా సీబీఐలో జరుగుతున్న పరిణామాలు... ఆ సంస్థ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పకనే చెబుతున్నాయి.
సిబిఐని అడ్డం పెట్టుకుని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం కూడా పెరిగింది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్) ఉపసంహరించాలని మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి లేఖ ఇచ్చానని ఆయన తెలిపారు.
''అవినీతిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ సమర్థంగా పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఏసీబీ డీజీ ఠాగూర్ నాయకత్వంలో 476 దాడులు జరిగాయి. అవినీతి ఎదుర్కోవడంలో ఏసీబీ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు'' అని వేదవ్యాస్ చెప్పారు..
పరిస్థితులు మారినప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
- తెలంగాణ ఎన్నికలు: ప్రపంచ ఓటర్ల వేలిపై తెలంగాణ సిరా చుక్క
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- లువిస్ హామిల్టన్: ‘‘పూర్ ఇండియా’ వ్యాఖ్యలు భారత్ పట్ల సానుభూతితోనే..’
- ప్రవాసాంధ్రులు ఏపీకి పంపిస్తున్న డబ్బులు ఎంతో తెలుసా?
- బ్రెగ్జిట్: యురోపియన్ యూనియన్‌కు ‘విడాకులిస్తున్న’ బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









