మమతా బెనర్జీ వర్సెస్ సీబీఐ: కోల్‌కతాలో హైడ్రామా... ధర్నాకు దిగిన పశ్చిమ బెంగాల్ సీఎం

మమత

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ బెంగాల్‌లో శారద చిట్ ఫండ్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు సీబీఐ, కోల్‌కతా పోలీసులు మధ్య హైడ్రామాకు దారి తీసిన నేపథ్యంలో కేంద్ర తీరును నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నాకు దిగారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీలపై విమర్శలు చేశారు.

ఏమిటి వివాదం...

శారదా స్కాంపై విచారణ జరుపుతున్న సీబీఐ బృందం ఆ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి వెళ్లింది. అయితే, పోలీసులు వారిని అడ్డుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కి తరలించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ''సీబీఐని నా ఇంటికి కూడా పంపించారు. చిట్ ఫండ్ కుంభకోణంపై 2011లో మా ప్రభుత్వమే విచారణ ప్రారంభించింది. పేదల డబ్బును వెనక్కి రప్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. దోషులను పట్టుకునేందుకు మేం కమిటీని కూడా ఏర్పాటు చేశాం. అసలు ఈ కుంభకోణం సీపీఐ హయాంలో వెలుగు చూసింది. కానీ, వారిపై ఎందుకు విచారణ జరపడం లేదు'' అని ప్రశ్నించారు.

''మా పార్టీ నేతలను జైలులో పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను రక్షించే బాధ్యత నాపై ఉంది. వారెంట్ లేకుండా పోలీస్ కమిషనర్ ఇంటికి సీబీఐ ఎలా వెళుతుంది. అలా చేయడానికి వారికి ఎంత ధైర్యం? దీనిపై అన్ని పార్టీలతో మాట్లాడుతా'' అని అన్నారు.

బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని, ప్రతీకారం తీర్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని ట్విటర్‌లో విమర్శించారు. ప్రపంచంలోనే ఉత్తమ అధికారుల్లో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్ ఒకరని అన్నారు. అతని నిజాయితీ, ధైర్యాన్ని ఎవరూ ప్రశ్నించజాలరని పేర్కొన్నారు.

కో‌ల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కో‌ల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్

ఈ ఘటనపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బబుల్ సుప్రియో బీబీసీతో మాట్లాడుతూ, '' రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. బీజేపీ ఎంపీగా, పౌరుడిగా పశ్చిమ బంగాలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నా. ఇది రాజకీయం కాదు. అవినీతిపై తీసుకునే చర్య మాత్రమే'' అని అన్నారు.

కోల్‌కతా పోలీస్ యంత్రాంగం ఈ వివాదంపై ట్వీట్ చేసింది.

''కోల్‌కతా పోలీస్ కమిషనర్ మూడు రోజుల నుంచి ఆఫీసుకు రావడం లేదని సీబీఐ అధికారులు వివిధ మాధ్యమాల్లో ప్రకటించారు. మేం ఈ వార్తలను ఖండిస్తున్నాం. ఇవి నిరాధార వార్తలు. కేవలం జనవరి 31న మాత్రమే కమిషనర్ ఆఫీసుకు రాలేదు. ఒక్క రోజు ఆయనే సెలవు పెట్టారు. ఎలాంటి విచారణ లేకుండా వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం'' అని కోల్‌కతా పోలీస్ యంత్రాంగం ట్విటర్‌లో పేర్కొంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగ ప్రభుత్వాలు సీబీఐ తమ రాష్ట్రాల్లో విచారణ చేపట్టకుండా అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని విమర్శించాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)