చైనా నిర్ణయంతో పేపర్ కష్టాలు తీరినట్లేనా

పేపర్లు

ఫొటో సోర్స్, Getty Images

కాగితాలు, ప్లాస్టిక్.. వంటి పునర్వినియోగ చెత్త దిగుమతులపై చైనా నిషేధం విధించడం భారత్‌లోని కాగిత పరిశ్రమలకు ఊతమివ్వనుందని నిపుణులు చెబుతున్నారు.

చైనా నిషేధంతో, కోట్ల టన్నుల కాగితపు చెత్త పేరుకుపోయి, పశ్చిమ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

విదేశాల నుంచి చౌకగా వస్తున్న చెత్తకాగితాల్లో భారత్‌లోని ‘పేపర్ రీసైక్లింగ్ పరిశ్రమ’ మళ్లీ కళను సంతరించుకుంటోంది. పేపర్ రీసైక్లింగ్‌లో కీలకంగా ఉన్న గుజరాత్ నుంచి బీబీసీ ప్రతినిధి నవీన్ సింగ్ ఖాడ్కా అందిస్తున్న కథనం..

పశ్చిమ దేశాల నుంచి చిత్తు కాగితాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. భారత్‌లోని అతిపెద్ద పేపర్ రీసైక్లింగ్ ప్లాంటుల్లో గుజరాత్‌లోని ప్లాంటు కూడా ఒకటి.

ఈ వీడియో చూడండి

వీడియో క్యాప్షన్, వీడియో: ‘దేశంలో కాగితానికి చాలా గిరాకీ ఉంది. అందువల్ల చెత్తకాగితాల దిగుమతులు ఇప్పుడిప్పుడే ఆగవు. ’

ఏడాదికి 1.8 కోట్ల టన్నుల పేపర్లు..

పశ్చిమదేశాల నుంచి ఇక్కడకు కాగితపు వ్యర్థాలు భారీగా వస్తున్నాయి. భారత్‌లో ఏడాదికి 1.8 కోట్ల టన్నుల కాగితాన్ని వినియోగిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో 60 శాతానికి పైగా చిత్తు కాగితాలను రీసైక్లింగ్ చేయడం వల్లే వస్తోంది. కానీ సరఫరా మాత్రం గిరాకీకి తగినట్లుగా లేదు.

''చైనా నిర్ణయం భారత్‌కు బాగా కలిసొస్తుంది. చెత్త కాగితాల దిగుమతులను చైనా నిషేధించడం వల్ల ఇక్కడ గిరాకీకి తగినట్లుగా సరఫరా మెరుగుపడుతుంది'' అని ఎస్.ఆర్.అగర్వాల్ ఇండస్ట్రీస్‌కు చెందిన అశోక్ బన్సల్ బీబీసీతో అన్నారు.

భారత్‌లో ఏడాదికి 8% చొప్పున కాగితానికి గిరాకీ పెరుగుతోంది. పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజీన్స్‌లతోపాటు ప్యాకింగ్‌కు ఉపయోగించే అట్ట పెట్టెలకు సైతం కాగితం ఎంతో అవసరం.

పేపర్లు మోసుకొస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఒకప్పుడు సరఫరా తగినతంగా లేకపోవడంతో కాగితపు వ్యర్థాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కాగితపు పరిశ్రమల్లో నాలుగోవంతు మూతపడ్డాయి. ఇప్పుడు విదేశాల నుంచి కాగితపు చెత్త ఎక్కువగా వస్తుండటంతో వ్యర్థాల ధరలు తగ్గి, మూతపడిన ప్లాంట్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి.

2018 తొలి 6 నెలల్లో యురోపియన్ యూనియన్ నుంచి ఒకటిన్నర టన్నుల చెత్త కాగితాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. 2017 తొలి ఆరు నెలలతో పోలిస్తే, ఇది 200% ఎక్కువ. ఈ పరిణామాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.

''దేశంలో కాగితానికి చాలా గిరాకీ ఉంది. అందువల్ల చెత్తకాగితాల దిగుమతులు ఇప్పుడిప్పుడే ఆగవు. ఎగుమతి చేయాలనుకునే ఏ దేశమైనా భారత్ చట్టాలకు లోబడి ఉండాలి. అవి కాస్త కఠినంగా ఉన్నాయని నేను భావిస్తున్నా'' అని రీసైక్లింగ్ నిపుణులు సుచీత్ సముద్దార్ అన్నారు.

ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. భారత కాగితపు పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నకొద్దీ ముడిసరకు అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. ఈ కొరతను తీర్చడంలో విదేశీ దిగుమతులు కీలకం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)