మనుషుల శవాలను ఎరువుగా మార్చేస్తారా?

ఫొటో సోర్స్, UNIVERSALIMAGESGROUP
వర్మీ కంపోస్ట్ ఎరువు గురించి చాలామంది తెలిసే ఉంటుంది. చెత్త, గడ్డి, ఆకులను కుళ్లబెట్టడం ద్వారా కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. మరి, మనుషుల శవాలతోనూ సేంద్రీయ ఎరువు తయారు చేస్తారా?
ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా! కానీ, అది సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. కాలుష్యాన్ని తగ్గించేందుకు అదో మంచి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.
శవాలను కంపోస్టుగా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగించడాన్ని చట్టబద్ధం చేసేందుకు అమెరికాలోని వాషింగ్టన్‌లో చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించిన బిల్లు పాసైతే, అమెరికాలో మానవ కంపోస్టును అనుమతించిన తొలి రాష్ట్రంగా వాషింగ్టన్ చరిత్రలో నిలిచిపోనుంది.
ఈ కంపోస్టు తయారీకి మద్దతిచ్చేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.
అమెరికాలోని సియాటెల్‌కు చెందిన 48 ఏళ్ల నీనా.. 'పర్యావరణ హితంగా చనిపోయే మార్గం' కోసం అనుమతులు కోరుతున్న వారిలో ఒకరు.
"చనిపోయిన తర్వాత మనం ఈ ప్రకృతికి ఏం ఇస్తున్నాం? అన్న ప్రశ్నే నేను ఇలా ఆలోచించేలా చేసింది.
మేము ప్రతిపాదిస్తున్న విధానం ద్వారా చనిపోయిన తర్వాత మరో ప్రాణికి కొత్త జీవితం ఇచ్చినట్లు అవుతుంది.
అంటే, మరణానంతరం కూడా ఈ ప్రకృతికి మనం ఉపయోగపడుతాం అన్నమాట" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"మన శరీరాలను మట్టిలో ఎలా కలిపేసుకోవాలో ప్రకృతికి బాగా తెలుసు. బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉంటే.. ఓ నెల రోజుల్లోనే మనిషి శరీరం పూర్తిగా కుళ్లిపోతుంది. కానీ, అలా జరగడంలేదు. ఎందుకంటే.. చాలా శవాలను దహనం చేస్తున్నారు. గాజుపెట్టెల్లో.. చెక్క డబ్బాల్లో పెట్టి ఖననం చేస్తున్నారు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా అందులోకి వెళ్లక, శవం మట్టిలో కలిసిపోవడంలేదు" అని ఫోరెన్సిక్ రీసెర్చ్ కేంద్రంలో పరిశోధన చేస్తున్న టెక్సాస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వెస్కాట్ వివరించారు.
"సహజంగా కుళ్లిపోయే ప్రక్రియను వేగవంతం చేసి, 30 రోజుల్లోనే శవం ఎరువుగా మారేలా చేయాలన్నదే మా ఆలోచన" అని సియాటెల్‌లోని 'పీపుల్స్ మెమోరియల్' అనే స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోరా మెంకిన్ అంటున్నారు.
ప్రస్తుతం పలు చోట్ల జంతువుల కళేబరాలతో ఎరువు తయారు చేస్తున్నారు.
అదే పద్ధతిలో కొద్దిగా మార్పులు చేసి, మానవ కంపోస్టును తయారు చేయొచ్చని రీకంపోస్ అనే సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, RECOMPOSE/MOLT STUDIOS
చెక్క పొట్టులో..
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొ. లిన్నే కార్పెంటర్ బోఘ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరిశోధన ప్రకారం, శవాన్ని సులువుగా కుళ్లిపోయే చెక్క పొట్టుతో పాటు, ఇతర పదార్థాల మధ్య ఉంచుతారు.
అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉష్ణ వ్యామోహ బ్యాక్టీరియా (థర్మోఫోలిక్ జాతి బ్యాక్టీరియా)తో పాటు, ఇతర బ్యాక్టీరియా క్రియాశీలంగా పనిచేసేందుకు అనువైన పరిస్థితి ఉండేలా చూస్తారు.
దాంతో కొన్ని రోజుల్లోనే శవం మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారుతుంది. అయితే, ఆ మట్టిని అలాగే మొక్కలకు వినియోగిస్తే.. అంటురోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, దానిని 55 డిగ్రీల సెంటీగ్రేడ్ (131 డిగ్రీల ఫారెన్ హీట్) ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అలా చేస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా చేయడాన్ని 'కంపోస్ట్ ఖననం' అంటారు. ఈ ప్రక్రియకు మద్దతు తెలుపుతున్న కొందరు తాము చనిపోయిన తర్వాత తమ ఇంటి పెరటిలో మొక్కలకు ఎరువుగా మారాలని కోరుకుంటున్నారు.

ఫొటో సోర్స్, EDUCATION IMAGES
కాలుష్యాన్ని తగ్గిస్తుందా?
శవాలను దహనం చేయడం ద్వారా పెద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ ( CO2) వాతావరణంలో కలుస్తోందని.. 'కంపోస్ట్ ఖననం'తో ఒక్కో వ్యక్తికి మెట్రిక్ టన్ను CO2 ఉద్గారాలను తగ్గించవచ్చని రీకంపోస్ సంస్థ అంటోంది.
"నగరాల్లో ఖననం చేసేందుకు స్థలం కూడా దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా దహనం చేయడం పెరిగింది. అయితే, దహనం వల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతోంది. అందుకే, భవిష్యత్తులో నగరాల్లో కంపోస్ట్ ఖననం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది" అని పరిశోధకులు చెబుతున్నారు.
"ఏదో ఒకరోజు కంపోస్ట్ ఖననానికి చట్టబద్ధమైన అనుమతులు వస్తాయి. వాషింగ్టన్‌లోని గిడ్డంగులను ఇండోర్ గార్డెన్లుగా మార్చుతాం. ఆ గార్డెన్లలో ప్రజలు తమ ఆప్తుల శవాలను ఖననం చేస్తారు. దాంతో, ఆ మట్టిలో పెరిగే మొక్కల రూపంలో చనిపోయిన వారు మళ్లీ తన బంధుమిత్రులకు కనిపిస్తారు" అని రీకంపోజ్ సంస్థ వ్యవస్థాపకులు కత్రినా స్పాడె పసిఫిక్ స్టాండర్ మేగజీన్‌తో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ జైలు నుంచి సిక్కోలు మత్స్యకారులు రాసిన లేఖ
- ఇండియన్‌గా ఉండటంపై BBCతో తన అభిప్రాయం పంచుకున్నందుకు కౌసల్య విధుల నుంచి తొలగింపు
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ‘ఎక్స్‌క్లూజివ్ డీల్స్’ బంద్
- అమెరికాలో అరెస్టైన విద్యార్థులు విడుదలయ్యేది ఎప్పుడు
- ఆడియన్స్ కళ్లలో ఆనందం కోసం.. ఒత్తిడిలోకి యూట్యూబ్ స్టార్స్
- జార్జి ఫెర్నాండెజ్: ఖాదీ సోషలిస్ట్ పార్లమెంటరీ రెబల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








