యెమెన్ సంక్షోభం: కోటి మంది చిన్నారుల ఆకలి కేకలు

వీడియో క్యాప్షన్, వీడియో: ఆపదలో 1.1 కోట్ల మంది చిన్నారులు

ఏళ్ల తరబడి అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌ దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోంది. తినడానికి తిండి దొరకడమే కష్టంగా మారింది, ప్రమాదకర వ్యాధులు విజృంభిస్తున్నాయి. దాంతో కోట్లాది మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

మానవీయ సంక్షోభంలో యెమెన్ కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఈ దేశంలో రెండు కోట్ల మంది అత్యవసర సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో 1.1కోట్ల మంది చిన్నారులే.

70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.

ప్రమాదకర స్థితిలో కలరా వ్యాధి విజృంభించింది. 9,45,000 మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

యెమెన్

ఫొటో సోర్స్, EPA

2015 మార్చి నుంచి ఇప్పటి వరకు యెమెన్‌లో 8,600 మంది చనిపోయారు. 49 వేల మంది గాయపడ్డారు.

ఈ మరణాలు కేవలం యుద్ధం కారణంగా సంభవించినవి మాత్రమే.

వ్యాధులు సోకి , పోషకాహార లోపంతో, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంటే చాలా ఎక్కువే ఉంటుంది.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న యుద్ధం కారణంగా 20 లక్షల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి ప్రాణాలు అరచేతపట్టుకుని వెళ్లాల్సి వచ్చింది.

గతంలో యెమెన్ రాజధాని నగరం సనాలో పరిస్థితి కాస్త ప్రశాంతంగానే ఉండేది. కానీ, ఇటీవల ఈ నగరంలోనూ యుద్ధం మొదలైంది.

యెమెన్‌లో సాయుధులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

యెమెన్ యుద్ధం వెనకున్న ప్రధాన అంశాలు:

1. పరోక్ష యుద్ధం

ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, ఇరాన్‌లు యెమెన్‌ను యుద్ధభూమిగా వాడుకుంటున్నాయి.

1979 నుంచి ఈ ప్రాంతంలోని ఆ రెండు శక్తిమంతమైన దేశాలు ఆధిపత్యం కోసం పోటీపడుతున్నాయి.

ఆ రెండు దేశాలూ యెమెన్‌లోని వేర్వేరు పక్షాలకు మద్దతిస్తున్నాయి.

సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తున్న సంకీర్ణ కూటమి అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మద్దతిచ్చింది.

యెమెన్ వేర్పాటువాదులైన హూతీలకు ఇరాన్ మద్దతిస్తోంది.

వేర్పాటువాదులకు ఇరాన్ ఆయుధాలు సమకూరుస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది.

అయితే, హూతీలకు నైతికంగా మద్దతు ఇస్తున్నామే కానీ, ఆయుధాలు అందించడంలేదని ఇరాన్ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, Exclusive: యెమెన్‌లో తిరుగుబాటు ద‌‌‌ృశ్యాలు (పాత వీడియో)

2. మతం

హూతీలు- షియా ముస్లింలు.

సున్నీ ముస్లింల చేతుల్లోని యెమెన్ ప్రభుత్వానికి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి మద్దతిస్తోంది.

ఈ రెండు ముస్లిం వర్గాలకు యెమెన్ యుద్ధభూమిగా మారింది.

ఐఎస్, అల్-ఖైదాతో సంబంధాలున్న సున్నీ తీవ్రవాద గ్రూపులు ఆ రెండు వర్గాల ముస్లింలనూ టార్గెట్ చేస్తున్నాయి. దాంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

యెమెన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అలీ అబ్దుల్లా సలేహ్(కుడి), మన్సూర్ హాది(ఎడమ)

3. పదవి కోసం ఇద్దరి మధ్య పోరు

యెమెన్‌లో అలీ అబ్దుల్లా సలేహ్, అబ్‌ద్రబ్బూ మన్సూర్ హాది కలిసి పనిచేసేవారు.

అబ్దుల్లా సలేహ్ యెమెన్‌ను 3 దశాబ్దాలపాటు పాలించారు. ఉపాధ్యక్షుడిగా హాది దాదాపు 20 ఏళ్లు పనిచేశారు.

కానీ, 2011 అరబ్ విప్లవం సమయంలో ఆ ఇద్దరూ విరోధులుగా మారారు.

అబ్దుల్లా తన పదవిని బలవంతంగా హాదికి అప్పగించాల్సి వచ్చింది.

అంతర్జాతీయ సమాజం హాదికి మద్దతిచ్చింది. దాంతో అబ్దుల్లా సలేహ్ తన పాత శత్రువులతో జతకట్టారు. హూతీలతో కలిసి హాది ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు.

యుద్ధం మొదలైంది, తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు సౌదీ అరేబియా పారిపోయాడు హాది.

యెమెన్‌లో సాయుధులు

ఫొటో సోర్స్, AFP

2015లో హూతీ స్థావరాలపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి వైమానిక దాడులు ప్రారంభించింది.

కానీ, యెమెన్ రాజధాని సనా నుంచి హూతీలను తరిమేయలేకపోయారు.

ఆ తర్వాత హూతీలకు, అబ్దుల్లా సలేహ్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. నమ్మకద్రోహం చేస్తున్నాడంటూ అతన్ని హూతీలు హతమార్చారు.

ఒప్పందాలు కుదర్చడంలో అబ్దుల్లా సలేహ్‌కు గుర్తింపు ఉంది. అతను ఉంటే ఈ ప్రతిష్టంభన తొలగించేవాడన్న అభిప్రాయం ఉంది. కానీ, ఆయన మరణంతో ఆ చిన్నపాటి ఆశ కూడా కరిగిపోయింది.

అనంతరం కొత్తగా అనిశ్చిత పరిస్థితులు మొదలయ్యాయి. పరిస్థితి మరింత దిగజారిపోతోంది.

గణాంకాలకు ఆధారం: ఐక్యరాజ్య సమితి, రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)