హైదరాబాద్: మరో యువ జంటపై ‘కుల అహంకార’ దాడి

మరో యువ జంటపై కుల అహంకార దాడి జరిగింది. వాళ్లిద్దరూ పెద్దలకు తెలీకుండా వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
బుధవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ ప్రధాన రహదారిపైన ఈ దాడి జరిగింది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
యువతి తండ్రి వేటకోడవలితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో యువతి చెవి, దవడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘ఎర్రగడ్డకు చెందిన సందీప్ డిడ్ల(24), బోరబండకు చెందిన మాధవి(20) ఈ నెల 12న పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి మనోహరాచారి ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం’ అని వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్. శ్రీనివాస్ చెప్పారు.
ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని సమాచారం.
‘మేము మా కార్ల షోరూం బయట డ్యూటీ చేస్తున్నాం. ఓ జంట షోరూం బయట బైక్ పైన ఆగడం కనిపించింది. ఇంతలో మరో వ్యక్తి వెనక నుంచి వచ్చి కొడవలితో వారిపైన దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ యువకుడు పరుగెత్తాడు. యువతి మాత్రం కింద పడిపోయింది. మేం వెళ్లి ఆపడానికి ప్రయత్నించాం. కానీ, ఆ వ్యక్తి కొడవలితో అందరినీ బెదిరించాడు.
తరువాత ఆ వ్యక్తి రోడ్డు దాటి పారిపోయాడు. దాంతో చుట్టుపక్కలవారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంతలో యువకుడు తిరిగిరావడంతో, యువతిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పాం. ఆ వ్యక్తి అమ్మాయి తండ్రేనని ఆ కుర్రాడు చెప్పాడు’, అంటూ ఆ ఘటనను చూసిన రమేశ్ అనే వ్యక్తి తెలిపారు.
‘2013 నుంచి వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో తెలీకుండా ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత రెండు కుటుంబాలను పిలిచి రెండు సార్లు కౌన్సెలింగ్ నిర్వహించాం. మాధవి తండ్రి తమను ఈరోజు మాట్లాడటానికి పిలిచినట్లు సందీప్ చెప్పాడు. వాళ్లు వచ్చిన వెంటనే అతడు వెంట తెచ్చుకున్న కొడవలితో దాడి చేయడం మొదలుపెట్టాడు’ అని సనత్ నగర్ సీఐ ఇ.వెంకట్ రెడ్డి వివరించారు.

‘వాళ్లిద్దరికీ కాలేజీ రోజుల్నుంచే పరిచయం. సందీప్ మా హోటల్‌లోనే పనిచేస్తాడు. సందీప్ ఎస్సీ. మాధవిది విశ్వ బ్రాహ్మణ కులం. వాళ్లిద్దరూ పెద్దలకు తెలీకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత ఇరు పక్షాల వాళ్లు మాట్లాడుకొని సయోధ్య కుదుర్చుకున్నారు. మాధవి బాధ్యతలు సందీప్ చూసుకుంటాడని అతడి కుటుంబ సభ్యులు భరోసానిచ్చారు.
కానీ, మాధవి కుటుంబ సభ్యులు వాళ్ల మాటలతో సంతృప్తి చెందకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ దాడి ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ల నాన్నకు అబ్బాయి కులం అంటే ఇష్టం లేదని మాత్రం తెలుసు’ అని సందీప్ కజిన్ రామ్ వివరించారు.

‘దాడి జరిగిన వెంటనే మా తమ్ముడు సందీప్ నుంచి నాకు ఫోనొచ్చింది. అతడు మాట్లాడలేకపోయాడు. తనపైన దాడి జరిగిందని, వెంటనే రమ్మని తడబడుతూ చెప్పాడు. నేను పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లా. అతడి దవడ భాగంలో తీవ్రగాయమైంది. అమ్మాయి తండ్రికి ఈ పెళ్లి ఇష్టంలేదు. మిర్యాలగూడ ప్రణయ్, అమృత ఉదంతంతో ఆ తండ్రి స్ఫూర్తి పొందినట్లు ఉన్నారు’, అని సందీప్ కజిన్ సతీష్ తెలిపారు.
ప్రస్తుతం సందీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మాధవిని యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

‘మాధవికి శస్త్రచికిత్స జరుగుతోంది. దాడికి పాల్పడిన ఆమె తండ్రి మనోహరాచారిని అరెస్టు చేశాం. అతడు మద్యం మత్తులో ఉన్నాడు. కూతురు తన అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం తనకు నచ్చలేదని అతడు చెప్పాడు. అతడి రక్తపోటు చాలా ఎక్కువగా ఉంది. కూతురి ప్రస్తుత పరిస్థితి గురించి కూడా ఆలోచించే పరిస్థితిలో అతడు లేడు’ అని పశ్చిమ జోన్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్ తెలిపారు.
మాధవి, సందీప్‌ల పెళ్లి జరిగిన మరుసటి రోజు నుంచే మనోహరాచారి వాళ్లను చంపేస్తానని బెదిరించేవాడని, తరువాత మళ్లీ వచ్చి క్షమాపణలు చెప్పేవాడని సందీప్ బాబాయి వేణు చెప్పారు. మిర్యాలగూడ ఘటన తరువాత వాళ్లిద్దరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్లు ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









