ప్రణయ్ హత్య: ‘నా శంకర్‌ను చంపినట్లే ప్రణయ్‌నూ చంపేశారు’

''తెలంగాణలో ప్రణయ్ అనే యువకుడిని కుల దురహంకారంతో హతమార్చారన్న వార్త చూసిన తరువాత నాకు నా శంకర్ గుర్తొచ్చాడు. ఆయన్ను కూడా ప్రణయ్‌లాగే మెడపై కత్తితో నరికి చంపేశారు. శంకర్ జ్ఞాపకాలు, ఆ ఘటన గుర్తొచ్చి నా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి''
- ప్రణయ్ హత్య సంగతి తెలుసుకున్న తమిళనాడులోని ఉడుమలైపేటకు చెందిన కౌసల్య అనే యువతి స్పందన ఇది.
...కౌసల్య ఇంతగా చలించిపోవడానికి కారణం ఉంది. ఆమెదీ ఇలాంటి కథే.. ప్రణయ్‌ను పోగొట్టుకున్న అమృతవర్షిణిలాగే కౌసల్య కూడా తన భర్త శంకర్‌ను కూడా పోగొట్టుకుంది. కుల అహంకారం ఇంతే కిరాతకంగా శంకర్‌ను పొట్టన పెట్టుకుంది.
ఎస్సీ వర్గానికి చెందిన శంకర్‌ను కౌసల్య తండ్రి కుట్రతో హత్య చేశాడు. 2016లో జరిగిన ఈ ఘటనపై విచారించిన న్యాయస్థానం గత ఏడాది కౌసల్య తండ్రి సహా ఆరుగురికి శిక్ష విధించింది.
ప్రణయ్ హత్య నేపథ్యంలో స్పందించిన కౌసల్య.. అమృతలో తనను తాను చూసుకుంది. తనకూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకుంది. ఆ ఘాతుకానికి పాల్పడిన తన తండ్రికి శిక్ష పడేవరకు చేసిన పోరాటం గుర్తుతెచ్చుకుంది. అమృత కూడా తనలాగే కులరహిత సమాజం కోసం పోరాడాలని ఆకాంక్షిస్తోంది. ఈ సందర్భంగా కౌసల్య ఏమందో ఆమె మాటల్లోనే...

ఫొటో సోర్స్, kausalya shankar
అమృతకు అండగా ఉంటా..
ఓదార్చితే పోయే బాధ కాదిది. ఎవరు ఎంతగా ఓదార్చినా అమృత హృదయానికైన ఈ గాయాన్ని మాన్పలేం. అయితే, ఆమె తొందరలోనే గుండె దిటవు చేసుకోగలుగుతుందని నేను నమ్ముతున్నాను.
ప్రణయ్‌పై ఆమెకున్న ప్రేమే ఆమెను ధైర్యవంతురాలిగా మార్చుతుంది. కులానికి వ్యతిరేకంగా తాను పోరాడుతానని ఆమె చెప్తోంది.. ఈ విషయంలో ఆమెకు అండగా ఉందాం.
ఆమె పెరియార్, అంబేడ్కర్ పుస్తకాలను ఎక్కువగా చదవాలని నేను కోరుకుంటున్నాను. అవి ఆమెకు ధైర్యం, బలం అందిస్తాయి.

ఫొటో సోర్స్, facebook
అందుకే ఈ క్రూరత్వం
తాను గర్భందాల్చడం వల్ల కూడా తన తల్లిదండ్రులు మరింత పగ పెంచుకున్నారని, ప్రణయ్‌ను వారు చంపడానికి అది కూడా ఒక కారణమని అమృత ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.. ఈ ఒక్కటి చాలు ఆమె తల్లిదండ్రులకు కులపిచ్చి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. అమృతకు బిడ్డ పుడితే తమ కులగర్వానికి భంగం కలుగుతుందని వారు అనుకున్నారు. అందుకే వారు ఇలాంటి క్రూరత్వానికి పాల్పడ్డారు.
వాళ్ల మాట వినలేదన్న కోపంతో మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే బాధపెట్టారు.
భారతదేశ సామాజిక వ్యవస్థలోనే కులం అంతర్లీనంగా పాతుకుపోయింది. నేను కానీ, అమృత కానీ బయటకొచ్చి పోరాడితే ఇది అంతమవుతుందా అన్నదే నా ప్రశ్న. అయినాకూడా మాకు న్యాయం జరగాలి. అంతకుమించి మాకు మార్గం లేదు.

ఫొటో సోర్స్, facebook
పరువు హత్యలపై భారత్‌లో చట్టం రావాలి..
భారత్‌లో ఇలాంటి పరువు హత్యలకు సంబంధించి కఠిన చట్టాలు లేవు. వీటిని నివారించాలంటే తప్పనిసరిగా కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అమృత తల్లిదండ్రులు పత్రికల్లో చదివే ఉంటారు.. శంకర్‌ను చంపిన నా తల్లిదండ్రులకు కోర్టు మరణశిక్ష విధించింది. అమృత తల్లిదండ్రులకు ఈ సంగతి తెలిసే ఉంటుంది. అయినా వారు ఇలాంటి పని చేయడానికి సాహసించారు.
ప్రణయ్, అమృతలు తమ జీవితం గురించి ఎన్నో కలలు కనే ఉంటారు. ఇప్పుడు అమృత గర్భిణి. తాము కనబోయే బిడ్డ గురించీ వారు ఎన్నో అనుకుని ఉంటారు. కానీ, ఇప్పుడు ప్రణయ్ లేడు.. ఆ వాస్తవాన్ని జీర్ణించుకుని ఆమె ధైర్యంగా ముందడుగు వేసి కులానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఆమె ప్రేమే ఆమెకు కొండంత ధైర్యాన్నిస్తుంది.
మరిన్ని కథనాలు
- వేధించారంటే ఉద్యోగాల్లోంచి ఊస్టే!
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- మిమ్నల్ని ఇష్టపడేదెవరో తెలుసుకోండి
- ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టూ వేధింపేనా?
- ఈ ఏడాది ఎక్కువ మంది వాడిన పదమేంటో తెలుసా?
- #MeToo: ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాను
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- శరీరం వెలుపల చిట్టి గుండె: క్షేమంగా ఇంటికి చేరిన చిన్నారి
- రూపాయి: ఈ పతనం దేనికి ఆరంభం?
- చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్: 'ఇదో చిన్న కేసు.. మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది'
- లైంగికానందం కోసం మహిళలు సెక్స్ చేయటం సరికాదని మహాత్మా గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








