యెమెన్ సంక్షోభం: వేల ఏళ్ళ ఘన చరిత్రను ఆకలికేకలతో వినిపిస్తున్న సనా నగరం

సనా... 2500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నఓ ప్రాచీన నగరం. అయితే, ఆ చరిత్రలో ప్రతి పేజీకీ రక్తపు మరకలంటాయి. ఈ నగరం చాలా యుద్ధాలను చూసింది. వాటిలో తాజా యుద్ధం ఇప్పుడు కోట్లాది మంది యెమెనీల జీవితాల్ని సంక్షోభంలోకి నెట్టింది. అయితే ఈ వార్తలు పతాక శీర్షికలకెక్కడం చాలా అరుదు.
ఇక్కడకు పాత్రికేయులు చేరుకోవడం చాలా కష్టం. హుతీల అధీనంలో ఉన్న ఉత్తర భాగంలో ప్రయాణికుల విమానాల రాకపోకల్ని నిలిపివేశాయి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు.
సనాలోని చాలా మంది మాతృమూర్తుల్లో ఈమె ఒకరు. యుద్ధం తన బిడ్డను మరింత కుంగదీస్తుందేమోనని భయపడుతున్నారు.
మోతీబ్ వయసు రెండేళ్లు. యెమెన్ లో పెరుగుతున్న ఆహార సంక్షోభానికి ప్రత్యక్ష బాధితుడు. ఈ ఆస్పత్రిలో ఇలాంటి చిన్నారులు చాలా మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
కడుదీనంగా కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు బసీమ్. వయసు రెండేళ్లు. ముఖమంతా పీక్కుపోయి ఎముకల గూడులా కనిపిస్తున్న ఈమె నదియా ఆ చిన్నారి నాన్నమ్మ.
నిరుపేద అరబ్ దేశంలో పుట్టాడు బసీమ్. యుద్ధం వారిని మరింత సంక్షోభంలోకి నెట్టేసింది. ఆ దేశ కరెన్సీ కూడా కుప్పకూలింది. నెల రోజుల్లోనే నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి.
కేవలం శాంతి మాత్రమే యెమెన్ చిన్నారులకు ప్రాణం పోయగలదని అంటున్నారు లివర్ పూల్ లో శిక్షణ పొందిన వైద్యురాలు నజ్లా.
''చరిత్రలో ఇథియోపియా , బెంగాల్, సోవియట్ యూనియన్ లోని కొన్ని ప్రాంతాల్లో తలెత్తిన దుర్భిక్ష పరిస్థితులు ఈ 21వ శతాబ్దంలో ఎక్కడొస్తాయిలే .. అని మనలో చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు మళ్లీ ఎన్నటికీ రావనే విశ్వాసంతో ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే...మనం కచ్చితంగా ఇక రావు అనుకుంటున్న దుర్భర పరిస్థితులే యెమన్ లో నెలకొని ఉన్నాయి.'' అని ఐక్యరాజ్యసమితి సమన్వయకర్త లిసె గ్రాండి బీబీసికి తెలిపారు.
యెమెన్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇక ఆహారం విషయానికొస్తే, చాలా మంది యెమెనీలు కొనగలిగే పరిస్థితుల్లో లేరు.
ఇటు రాజధానిని నియంత్రిస్తున్న హుతీ దళాలకు, అటు దానిపై బాంబులు కురిపిస్తున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల నడుమ వాళ్లంతా చిక్కుబడిపోయారు.
ఇప్పుడు ప్రాంతీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధంగా మారిన అంతర్యుద్ధంలో వాళ్లు చిక్కుకుపోయారు.
ఎన్నో ఏళ్ల నుంచి తాము బాధలు పడుతున్నా ప్రపంచం తమను ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో వాళ్లు తాము ఒంటరై పోయినట్టు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- గర్భనిరోధక మాత్రలు వాడితే మహిళకు మగ లక్షణాలు వస్తాయా?
- 'సర్జికల్ స్ట్రయిక్స్'కు రెండేళ్ళు: కశ్మీర్లో హింస ఏమైనా తగ్గిందా?
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యాహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- బాత్ రూంలో హిడెన్ కెమెరా నుంచి తప్పించుకోవడం ఎలా?
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









