అమెరికా - చైనా ట్రేడ్ వార్: ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి చైనాకు ఉద్వాసన పలికే యోచనలో అమెరికా

జిన్‌పింగ్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆండ్రూ వాకర్
    • హోదా, ఎకానమిక్స్ కరెస్పాండెంట్ - బీబీసీ వరల్డ్ సర్వీస్

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నుంచి చైనాను తొలగించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారుల మండలి చైర్మన్ కెవిన్ హాసెట్ సూచనప్రాయంగా చెప్పారు.

డబ్ల్యూటీఓ సభ్యదేశంగా చైనా ‘‘తప్పుగా ప్రవర్తిస్తోంద’’ని ఆయన బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

డబ్ల్యూటీఓ వల్ల అమెరికా నష్టపోతోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠిన విధానం పనిచేస్తోందన్నారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. అస్థిరపరచేదిగా ఉందని చాలా మంది భావిస్తున్నారు.

డబ్ల్యూటీఓ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో సభ్య దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించటంలో ఆ సంస్థ సామర్థ్యానికి ట్రంప్ విధానం సవాలుగా మారిందని అంటున్నారు.

వివాద పరిష్కారాల ప్యానళ్లు మొదట ఇచ్చే ఆదేశాలపై అప్పీళ్లను పరిశీలించే బోర్డు.. డబ్ల్యూటీఓ వివాదాల వ్యవస్థలో ఒక కీలకమైన భాగం. ఆ బోర్డు సభ్యుల కాలపరిమితి పూర్తయిన తర్వాత.. కొత్త సభ్యుల నియామకానికి అమెరికా అడ్డుపడింది. దీనివల్ల ఆ బోర్డు పనిచేయటం రోజు రోజుకూ దుర్లభమవుతోంది.

కెవిన్ హాసెట్
ఫొటో క్యాప్షన్, ట్రంప్ ఆర్థిక సలహాదారుల మండలి అధ్యక్షుడు కెవిన్ హాసెట్

అమెరికా నష్టపోతోంది...

ప్రపంచాన్ని ఆధునీకరించటంలో డబ్ల్యూటీఓ చాలా ముఖ్యమైన చరిత్రాత్మక పాత్ర పోషించిందని డాక్టర్ హాసెట్ కితాబునిచ్చారు. అయితే.. ఆ సంస్థ అమెరికాకు చాలా రకాలుగా నష్టం కలిగించిందని చెప్పారు.

అమెరికా డబ్ల్యూటీఓలో వేసే కేసుల్లో సాధారణంగా తానే గెలుస్తుంది. కానీ ‘‘అందుకు ఐదారేళ్లు పడుతుంది.. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది’’ అని పేర్కొన్నారు.

నిబంధనలను పాటించకుండా.. శిక్షలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్ల్యూటీఓలో ఓడిపోవటానికి కూడా సంసిద్ధంగా ఉండే దేశాలపై చర్యలు తీసుకునే విషయంలో డబ్ల్యూటీఓ ఇంకా మెరుగైన సామర్థ్యం అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య అజెండాలో ఒక దేశం ప్రధానంగా ఉంది. ‘‘చైనా వంటి ఒక దేశం డబ్ల్యూటీఓలో చేరి.. ఇంతగా ఇష్టానుసారం ప్రవర్తిస్తుండటం డబ్ల్యూటీఓకు కొత్త’’ అని కెవిన్ హాసెట్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ - షి జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా, చైనాల అధ్యక్షులు ట్రంప్, జిన్‌పింగ్‌లు గత ఏడాది సమావేశమయ్యారు.. కానీ ఇద్దరి మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది

చైనాను తొలగించటం...

ఈ సమస్యని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించవచ్చా లేక డబ్ల్యూటీఓను సంస్కరించాలా లేక డబ్ల్యూటీఓ నుంచి చైనాను తొలగించటమా అన్నది ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.

వీటిలో మూడో మార్గం.. అమెరికా అధికారిక విధానం కాదు. అది చిట్టచివరి మార్గం అవుతుందని డాక్టర్ హాసెట్ చెప్పారు. ‘‘డబ్ల్యూటీఓ నుంచి చైనాను తొలగించే మార్గాన్ని అనుసరించాలా?’’ అని వ్యాఖ్యానించారు.

అది సాధ్యం కూడా కాకపోవచ్చు. అయినా అమెరికా ప్రభుత్వంలో ఒక సీనియర్ వ్యక్తి నుంచి ఇటువంటి సంకేతం రావటం కీలకమైన అంశం.

అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన విధానానికి.. చాలా మంది అది ఘర్షణాత్మక విధానమని అంటారు - అనుగుణంగానే ఈ ఆలోచన ఉంది.

డబ్ల్యూటీఓ

ఫొటో సోర్స్, Getty Images

రక్షణాత్మకత...

స్టీలు, అల్యూమినియం సహఆ చైనాకు చెందిన అనేక వస్తువులపై ట్రంప్ మొదటి రెండేళ్లలో దిగుమతి సుంకాలు విధించారు. మరో వాణిజ్య ఒప్పందమైన ట్రాన్స్‌పసిఫిక్ భాగస్వామ్యం నుంచి వైదొలగి.. గత ఏడాది కొత్తగా నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్టా) ఒప్పందాన్ని రూపొందించి కుదుర్చుకున్నారు.

ఈ వాణిజ్య విధానాలు చాలా వరకూ రక్షణాత్మకంగా ఉన్నాయని ట్రంప్ విమర్శకులు చాలా మంది భావిస్తారు.

అయితే.. భూమి మీద ఉన్న ప్రతి దేశంతోనూ అవరోధాలు లేని వాణిజ్యం ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు డాక్టర్ హాసెట్ చెప్తారు.

కఠినమైన వ్యూహం...

ట్రంప్ అధ్యక్షుడు అయినపుడు.. అమెరికా ఇతర దేశాలకు ‘‘బేషరతుగా’’ తలుపులు తెరిచింది. అయితే.. తన భాగస్వామ్య దేశాలకన్నా తనకే తక్కువ అవరోధాలు ఉన్నాయని అమెరికా గుర్తించిందని డాక్టర్ హాసెట్ పేర్కొన్నారు.

జిన్‌పింగ్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరిస్థితిని మెరుగుపరచటానికి ఇంతకుముందు అధ్యక్షులుగా పనిచేసిన క్లింటన్, ఒబామా, ఇద్దరు బుష్‌లూ ప్రయత్నించారని.. కానీ విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్ చాలా కఠినమైన వ్యూహంతో అధ్యక్ష పదవి చేపట్టారన్నారు. అది ‘‘బాగా పనిచేస్తోంద’’ని అభిప్రాయపడ్డారు.

నాఫ్టా స్థానంలో కొత్త ఒప్పందం చేసుకోవటంతో పాటు.. అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాలతోనూ అమెరికా చర్చలు జరుపుతుండటాన్ని ఆయన ఉదహరించారు. ‘‘ఇది చాలా భారీ పురోగతి’’ అన్నారు.

కొత్త సుంకాలు విధించటం అమెరికన్లకు అవరోధాలు అవుతాయన్న వాదనను ఆయనను తిరస్కరించారు. అయితే.. అధ్యక్షుడి మరో ఆర్థిక సలహాదారు గ్యారీ కోన్.. అది వినియోగదారులపై పన్ను అని అభివర్ణించారు.

ప్రత్యేకించి చైనా మీద విధించిన సుంకాలు.. స్వదేశంలో కనిష్ట హాని కలిగించేలా, చైనా మీద గరిష్ట ఒత్తిడి పెట్టేలా రూపొందించినవని డాక్టర్ హాసెట్ చెప్పారు.

అది చాలా ప్రభావవంతంగా ఉందని.. ఇప్పుడు చైనా వాళ్లు చర్చలకు దిగివస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య ఫలదాయకమైన చర్చలు జరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

వీడియో క్యాప్షన్, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: మీపై చూపే ప్రభావం ఇదీ...

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)