ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’కు జవాబుగా మోదీ ‘ఇండియా ఫస్ట్’

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం, అమెరికాలు రెండూ తమను తాము సహజమైన భాగస్వామ్య దేశాలుగా చెప్పుకుంటుంటాయి. ప్రపంచంలోని అతి పెద్ద, అతి పురాతన ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన సంబంధాలు అవసరమని అవి అంటాయి.
కానీ ఆర్థిక సంబంధాల ముందు ఏవీ నిలబడవు అని చెప్పడానికి తాజాగా రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలే సాక్ష్యం.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 29 వస్తువులపై భారత్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. వాటిలో ఆహారదినుసులు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి. కానీ భారత్ ఎందుకు ఈ చర్య తీసుకుంది?
నిజానికి మోదీ ప్రభుత్వానిది ప్రతీకార చర్య. మొదట అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాన్ని పెంచింది.
భారత్ ఈ రెండూ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీని వల్ల అమెరికాపై సుమారు రూ.162 కోట్ల భారం పడనుంది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం నడుస్తోంది. అమెరికా రక్షణాత్మక విధానాలను అనుసరిస్తూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని పెంచింది.
దీనికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పలు ఉత్పత్తులపై సుంకాన్ని పెంచింది. చైనా కూడా ఇదే బాటలో ఉంది.

ఫొటో సోర్స్, JOHNNY GREIG/SCIENCE PHOTO LIBRAR
ఈయూ-చైనాల బాటలోనే భారత్
రాయిటర్స్ వార్తాసంస్థ ప్రకారం, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి, భారత్-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైంది.
ప్రపంచంలోనే బాదంపప్పును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారతదేశానిది మొదటి స్థానం. ఈ నేపథ్యంలో బాదం దిగుమతిపై 20 శాతం, ఆక్రోట్‌లపై 120 శాతం సుంకాన్ని పెంచడం చూస్తే, భారతదేశం కూడా ఈయూ మరియు చైనా తరహాలోనే అమెరికాపై బదులు తీర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది.
నిజానికి సుంకం విషయంలో కొంచెం మినహాయింపు ఇవ్వాలని భారత్ అమెరికాను కోరింది. అమెరికాకు ఉక్కు, అల్యూమినియం ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయనేది భారత్ వాదన. అవి పెరగాలంటే సుంకం తగ్గాలి.
కానీ భారత్ విజ్ఞప్తిని అమెరికా తోసిపుచ్చింది. దాంతో భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయించింది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ
నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో ఇటీవలి కాలంలో ట్రంప్ చాలా దూకుడుగా ఉన్నారు.
2016లో రెండు దేశాల మధ్య వాణిజ్యం విలువ రూ.7.8 లక్షల కోట్లు ఉండగా, అందులో రూ.2.1 లక్షల కోట్లు తగ్గించాలని ట్రంప్ యోచిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ హార్లే-డేవిడ్ సన్ మోటర్ బైకులపై పెంచిన సుంకాన్ని తొలగించాలని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు మోదీ ప్రభుత్వం వాటిపై సుంకాన్ని 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది.
కానీ ట్రంప్ ఆ విషయంలో కూడా అసంతృప్తిగా ఉన్నారు. భారత్‌లో తయారైన బైకులపై అమెరికాలో సుంకం లేదని, అందువల్ల అమెరికా బైకులపై భారత్‌లో సుంకం ఉండకూడదని ట్రంప్ వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ విధానం ఏంటి?
'అమెరికా ఫస్ట్' అన్న తన విధానానికి అనుగుణంగా ట్రంప్ వాణిజ్యంలో చాలా కఠినమైన విధానాలను అనుసరిస్తున్నారు. అందులో భాగంగానే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాన్ని పెంచారు.
భారతదేశం అమెరికాకు చేసే ఉక్కు, అల్యూమినియం ఎగుమతులు కెనడా, మెక్సికో, చైనా అంత లేకున్నా, ఆ సుంకం భారం భారత్‌పై కూడా పడుతోంది.
భారతదేశం 29 వస్తువులపై పెంచిన సుంకం కారణంగా, అమెరికాపై సుమారు దాదాపు రూ.162 కోట్ల భారం పడనుంది. ఇవి ఆగస్టు 4 నుంచి అమలులోకి వస్తాయి.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అమెరికాతో వాణిజ్య వివాదాలపై భారత్ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థను కూడా ఆశ్రయించింది.
ముందు ముందు ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








