వాణిజ్య యుద్ధం: అమెరికాపై చైనా ఈ నాలుగు శక్తిమంతమైన ఆయుధాలు ప్రయోగిస్తుందా?

ట్రంప్, జిన్ పింగ్

ఫొటో సోర్స్, AFP

చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా తాజాగా 20,000 కోట్ల డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై కొత్తగా సుంకాలు విధించింది.

వాణిజ్య యుద్ధంలో భాగంగా ఇప్పటికే పలు ఉత్పత్తులపై సుంకాలు పెంచినప్పటికీ మునుపెన్నడూ లేనట్లుగా ఈసారి సుమారు 6 వేల వస్తువులకు ఇది వర్తించనుంది.

దుస్తులు, బియ్యం వంటి ప్రధానమైన ఉత్పత్తులన్నీ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, చాలామంది ఊహించినట్లుగా స్మార్ట్ వాచ్‌లు, ఖరీదైన కుర్చీలను మాత్రం ఇందులో చేర్చలేదు. స్మార్ట్ వాచ్‌లు వంటివి చైనా ముఖ్య ఎగుమతుల్లో ఉండడంతో వాటిని లక్ష్యంగా చేసుకుంటారని అంతా భావించారు.

తాజా పన్నుల వడ్డన ఈ నెల 24 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి 10 శాతం పన్ను విధించగా.. రెండు దేశాల మధ్య పరిస్థితులు సద్దుమణిగి ఒప్పందం కుదరకపోతే 2019 జనవరి 1 నుంచి సుంకం 25 శాతానికి పెరుగుతుంది.

కాగా.. అమెరికా తమపై పన్నుల వడ్డన కొనసాగిస్తే తాము దీటుగా బదులివ్వడం ఖాయమని చైనా ఇంతకుముందే చెప్పింది.

తాజా పరిణామాలతో రెండు దేశాలమధ్య వాణిజ్య పోరు పూర్తిగా రాజుకున్నట్లయింది.

ప్రపంచంలోని రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు వాణిజ్యపరమైన ఆంక్షలను చూపుతూ పరస్పరం హెచ్చరికలకు దిగుతుండడంతో ఈ పోరు కొత్త మలుపులు తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా, చైనాల పోరును ప్రతిబింబించే చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాను ఎదుర్కొనేందుకు చైనా నాలుగు బలమైన అస్త్రాలను ప్రయోగించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అవి...

1. అమెరికా సంస్థలపై ఉక్కుపాదం

చైనా భూభాగం నుంచి కార్యకలాపాలు సాగించే అమెరికా సంస్థలకు కొత్త నిబంధనలు విధించడం, వాటి నిర్వహణ ఖర్చులు పెరిగేలా చేయడం. కస్టమ్స్ విధానాలు కూడా కఠినతరం చేయడం.

''ఇలాంటి విధానాలు చైనాకు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తే అమెరికా వ్యాపారానికి ఇబ్బందులు తప్పవు'' అని న్యూయార్క్‌లోని సిరాక్యూజ్ యూనివర్సిటీ ఆర్థికశాస్ర్త ప్రొఫెసర్ మేరీ లవ్లీ అభిప్రాయపడ్డారు.

''అయితే, ఈ వ్యూహం రెండు దేశాలనూ ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చైనా, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎగుమతిదారులు వెనుకాడుతారు. వినియోగదారులపైనా అనవసర భారం పడుతుంది'' అని ఆమె అన్నారు.

జిన్ పింగ్, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

2. అమెరికాను ఏకాకిని చేసి..

ఇతర ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటూ అమెరికాను ఏకాకిని చేసే పనిలో చైనా ఇప్పటికే ఉంది. దీన్ని మరింత వేగవంతం చేయొచ్చు. ఇప్పటికే పలు ఐరోపా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు చైనా తన వాణిజ్యాన్ని విస్తరిస్తోంది.

పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాలకు చైనా నాయకత్వం వహించొచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా పలు పసిఫిక్ దేశాల మధ్య ప్రతిపాదనల్లో ఉన్న 'ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్‌షిప్' వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం మనుగడలో లేదు. ఈ ఒప్పందానికి అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ ఒప్పందం నీరుగారింది. ఇప్పుడు చైనా దీనికి నేతృత్వం వహించే అవకాశాలున్నాయి.

అమెరికా సుంకాల ప్రభావం చైనాపైనే కాకుండా కెనడా, మెక్సికో వంటి దేశాలు, కొన్ని ఐరోపా దేశాలనైనా పడుతుండడంతో అమెరికా లేకుండా కొత్త కూటములు ఏర్పడొచ్చు.

యువాన్

ఫొటో సోర్స్, Getty Images

3. యువాన్ విలువ తగ్గించి..

అమెరికాను నేరుగా దెబ్బకొట్టాలని చైనా అనుకుంటే తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించేందుకు కూడా వెనుకాడకపోవచ్చు. చైనా కరెన్సీ బలహీనపడితే చైనా ఎగుమతులు చౌకవుతాయి. అదేసమయంలో అమెరికా వస్తువులు ఖరీదుగా మారుతాయి.

''చైనా తన దేశంలోని సంస్థలను బలోపేతం చేసేందుకు ఆర్థిక వ్యవస్థలోకి మరింత కరెన్సీని తీసుకురావొచ్చు. లేదంటే యువాన్ విలువను తగ్గించనూవచ్చు'' అని ఫోర్బ్స్ మ్యాగజీన్, న్యూయార్క్ టైమ్స్‌కు బిజినెస్ కథనాలు రాసే బ్రియాన్ బోర్జికోవ్‌స్కీ అన్నారు.

అయితే... కరెన్సీ అనేది రెండువైపులా పదునున్న కత్తి. వాణిజ్యం యుద్ధంలో దాన్ని వాడడం వల్ల ఇద్దరికీ నష్టం జరగొచ్చు. యువాన్ విలువ తగ్గిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారే ప్రమాదం ఉంది.

డ్రాగన్

ఫొటో సోర్స్, Getty Images

4. అమెరికా బాండ్లను అమ్మేస్తే..

గత రెండు దశాబ్దాలలో చైనా సురక్షిత పెట్టుబడులుగా భావించి అమెరికా ట్రెజరీ బాండ్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. దానికి వడ్డీల రూపంలో వందల కోట్లు ఆర్జించింది. సుమారు 117 లక్షల కోట్ల డాలర్ల విలువైన బాండ్లు ఉన్నాయి. వాటిని కనుక చైనా తిరిగి విక్రయించడం మొదలుపెడితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. ట్రెజరీ బాండ్లు పేరుకుపోతే వాటి విలువ తగ్గడంతో పాటు అమెరికా సంస్థలు, వినియోగదారుల రుణ పరపతీ తగ్గిపోతుంది. ఫలితంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు మందగమనం తప్పదు.

అయితే, సురక్షితమైన అమెరికా బాండ్లను తిరిగి విక్రయిస్తే చైనా సైతం ఆ ప్రభావానికి లోనవ్వాల్సి వస్తుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలా విక్రయించిన బాండ్లకు ప్రత్యామ్నాయంగా చైనా అంతటి సురక్షిత పెట్టుబడులు పెట్టడమూ కష్టమే అవుతుంది.

సరకు రవాణా నౌకలు

ఫొటో సోర్స్, Getty Images

చైనాకూ నష్టమే..

అయితే, చైనా ఇలాంటి చర్యలకు దిగకపోవచ్చన్న వాదనా వినిపిస్తోంది. చైనా కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలమైనది కావడంతో వాణిజ్య యుద్ధం వల్ల చైనాయే దుర్బల స్థితిలో ఉందని వాషింగ్టన్‌లోని 'స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' ఆర్థిక నిపుణుడు స్కాట్ కెనడీ అభిప్రాయపడ్డారు.

''అమెరికా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించేందుకు చైనా ప్రయత్నించకపోవచ్చు. ఎందుకంటే అమెరికా కనుక మరింతగా సుంకాలు పెంచితే అప్పుడు చైనాకే నష్టం'' అని ఆయన అన్నారు.

నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక వేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ దీనిపై స్పందిస్తూ ఈ వాణిజ్య యుద్ధానికి తట్టుకునే స్థితిలో చైనా ఉందని చెప్పారు.

''వాణిజ్య యుద్ధం ప్రభావం నుంచి బయటపడే వనరులు, పద్ధతులు చైనా వద్ద ఉన్నాయి. 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నిల్వలు ఆ దేశానికి ఉన్నాయి'' అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వాణిజ్య యుద్ధం ఈ రెండు దేశాలపైనే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్లను అస్థిరపరిచే ప్రమాదముందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)