యెమెన్ యుద్ధం: స్వీడన్‌లో 'కీలక' శాంతి చర్చలు ప్రారంభం.. ఐక్యరాజ్యసమితి ప్రయత్నం ఫలిస్తుందా?

యెమెన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ సంక్షోభానికి కారణమైన యెమెన్ అంతర్యుద్ధానికి తెరదించేందుకు స్వీడన్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.

"యెమెన్ భవిష్యత్తు ఇప్పుడు ఆ గదిలో ఉన్న వారి చేతుల్లోనే ఉంది" అని ఆదేశ ఐక్యరాజ్యసమితి రాయబారి మార్టిన్ గ్రిఫిన్స్ అన్నారు.

వేలాది కుటుంబాలను తిరిగి కలిపేలా ఖైదీల మార్పిడి ఒప్పందంపై కూడా సంతకం చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

యెమెన్ ప్రభుత్వ ప్రతినిధులు, హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఈ అనధికారిక చర్చల కోసం ఆయన బృందం గత వారం రోజులుగా పనిచేస్తోంది.

గత కొన్నేళ్లుగా యెమెన్‌లో జరుగుతున్న యుద్ధం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ సంక్షోభానికి కారణమైంది.

ఈ యుద్ధంలో వేల మంది చనిపోయారు, లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు.

2016 తర్వాత రెండు పక్షాలూ ఇప్పుడు మొదటిసారి చర్చలకు సిద్ధం అవుతున్నాయి.

"యెమెన్ భవిష్యత్తు ఈ గదిలో ఉన్న వారి చేతుల్లో ఉంది"- మార్టిన్ గ్రిఫిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "యెమెన్ భవిష్యత్తు ఈ గదిలో ఉన్న వారి చేతుల్లో ఉంది"- మార్టిన్ గ్రిఫిన్స్

ఈ చర్చల నుంచి ఏం ఆశించవచ్చు?

"యెమెన్ భవిష్యత్తుపై మనం పట్టు కోల్పోకముందే ఇప్పుడే చర్యలు చేపట్టాలి" అని మార్టిన్ గ్రిఫిన్స్ అన్నారు.

ఇప్పుడు జరిగే చర్చలు ఫలిస్తాయనే ఆశ లేకపోయినా, "రెండు పక్షాలూ క్రమక్రమంగా తమ చర్యలు తగ్గించడానికి పిలుపునిచ్చాయి. ఆ నేపథ్యం ఈ చర్చలకు చాలా ముఖ్యం. ఇది వారి ఉద్దేశాన్ని చెబుతోంది" అని గ్రిఫిన్స్ అన్నారు.

తిరుగుబాటు దారుల పట్టున్న హుదైదా పోర్ట్ కోసం జరుగుతున్న ఈ యుద్ధాన్ని పూర్తిగా ఆపాలనే ప్రధాన లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వేల మంది పౌరులు చిక్కుకుపోయి ఉన్నారు.

యెమెన్ భవిష్యత్ రాజకీయ పరిష్కారం ఎలా ఉండాలి అనే ఒక ప్రణాళికతో చర్చలకు రావాలని ఐక్యరాజ్యసమితి కూడా ఆశిస్తోంది.

గత వారమే జరుగుతాయని భావించిన ఈ చర్చలు ఇప్పుడు రెండు పక్షాల ప్రతినిధుల మధ్య అనధికారికంగా జరగబోతున్నాయని అధికారులు చెప్పారు.

"కొన్ని అంశాలపై రెండు పక్షాలూ కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంది. మిగతావాటిపై వాళ్లు వేరువేరు గ్రూపులతో మాట్లాడుకోవచ్చు" అని ఒకరు బీబీసీతో అన్నారు.

యెమెన్ ప్రధాన రేవు పట్టణం అల్ హుదైదాకు వెళ్లే రహదారి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యెమెన్ ప్రధాన రేవు పట్టణం అల్ హుదైదాకు వెళ్లే రహదారి

ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు

చర్చలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు "తిరుగుబాటుదారులు హుదైదా నగరం వదిలి వెళ్లిపోవాలని, దానిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలని" యెమెన్ అధికారులు ట్విటర్‌ ద్వారా కోరారు.

ఇటు, ఐక్యరాజ్యసమితి విమానాలను సనా ప్రధాన విమానాశ్రయానంలోకి రాకుండా అడ్డుకుంటామని ఒక టాప్ హూతీ రెబల్ బెదిరించాడు.

యుద్ధం వల్ల ఇది రెండేళ్లుగా మూతపడి ఉంది. ఈ చర్చలు విజయవంతం అయితే తప్ప దీనిని ప్రయాణికుల కోసం పూర్తిగా తెరవడం జరగదు.

ప్రస్తుతం రాజధాని సనాలోని చాలా ప్రాంతాలను హూతీస్ అదుపులో ఉన్నాయి. ఇటు బహిష్కరణకు గురైన ప్రభుత్వం మాత్రం దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన అడెన్‌ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

చర్చల కోసం ఇరు పక్షాల ప్రతినిధులు స్టాక్‌హామ్‌లోని జొహన్నెస్‌బర్గ్ కాసిల్ చేరుకున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చర్చల కోసం ఇరు పక్షాల ప్రతినిధులు స్టాక్‌హామ్‌లోని జొహన్నెస్‌బర్గ్ కాసిల్ చేరుకున్నారు

ఎవరెవరు హాజరవుతారు?

యెమెన్‌లో యుద్ధం చేస్తున్న పక్షాలన్నీ దీనికి హాజరు కానున్నాయి.

ఇరాన్ మద్దతున్న హూతీ ప్రతినిధులతో గ్రిఫిన్ మంగళవారం స్టాక్‌హామ్ చేరుకున్నారు.

సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న యెమెన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా బుధవారమే స్వీడన్ చేరుకున్నారు.

అంతకు ముందు, ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా అల్-అలిమి ట్విటర్‌లో "ఈ చర్చలు శాంతికి నిజమైన అవకాశం"గా వర్ణించారు.

హూతీ ప్రతినిధుల నేత మహమ్మద్ అబ్దెల్ సలామ్ "చర్చలు సఫలం కావడానికి, ఏ ప్రయత్నాన్నీ విడిచిపెట్టం" అన్నారు.

కానీ సైనిక దాడులకు ఎలాంటి ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టాలని ఆయన తిరుగుబాటుదారులను హెచ్చరించారు.

దేశంలోని పౌరులపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలోని పౌరులపై యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉంది

యెమెన్‌లో యుద్ధం ఎందుకు జరుగుతోంది?

హూతీ తిరుగుబాటుదారులు, యెమెన్ ప్రభుత్వం మధ్య 2004 నుంచి యుద్ధం జరుగుతోంది.

పేదరికం తీవ్రంగా ఉన్న సాదా ఉత్తర ప్రావిన్సులోని ఎక్కువ ప్రాంతాల్లో హూతీలకు పట్టుంది.

2015లో హూతీ తిరుగుబాటుదారులు రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ యుద్ధం తీవ్రమైంది. అది అధ్యక్షుడు అబ్దరబ్బుహ్ మన్సూర్ హదీ విదేశాలకు పారిపోయేలా చేసింది.

యెమెన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న సౌదీ అరేబియా ఇరాన్‌ మద్దతున్న తిరుగబాటుదారుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరిచింది.

వీడియో క్యాప్షన్, వీడియో: 42 మంది యెమెన్ చిన్నారుల్ని చంపేసిన వైమానిక దాడి యుద్ధ నేరం కాదా?

యూఏఈ, మిగతా ఏడు అరబ్ దేశాలతో కలిసి యెమెన్‌లో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సైనిక చర్యలు కూడా ప్రారంభించాయి.

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ఇప్పటివరకూ యెమెన్‌లో జరిగిన ఘర్షణల్లో 6,660 మంది మృతి చెందారు, 10,650 మంది గాయపడ్డారు.

సరైన ఆహారం లేక, వ్యాధులతో వేలాది మంది మరణించారు.

యెమెన్‌లో ప్రతి వారం దాదాపు 10 వేల అనుమానిత కలరా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్‌లో హెచ్చరించింది.

Presentational grey line

శాంతి దిశగా కీలక అడుగు

చర్చల దగ్గరినుంచి బీబీసీ ప్రతినిధి లీస్ డౌసెట్

యుద్ధం చేస్తున్న పక్షాల మధ్య చాలా అప నమ్మకం ఉన్నా.. రెండేళ్లలో మొదటిసారి వారు చర్చలకు రావడం అనేది ఐక్యరాజ్యసమితి రాయబారి మార్టిన్ గ్రిఫిన్స్ సాధించిన కీలక పురోగతి.

రెండు పక్షాల దగ్గర బంధీలుగా ఉన్న వందలాది ఖైదీల విడుదల ఒప్పదంతోపాటు, ఈ చర్చలు జరిగేలా వారిలో నమ్మకం ఏర్పడడానికి తీసుకున్న చర్యలను ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)