తెలంగాణ ఎన్నికలు 2018: ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోవటం ఎలా? ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana
ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డులను మీసేవా కేంద్రాల నుంచి పొందవచ్చు.
ఇంటర్నెట్‌లో జాతీయ ఓటరు సర్వీసుల పోర్టల్ https://electoralsearch.in/ లో ఓటును చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైటును ఓపెన్ చేసి, అందులో పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత కాలమ్‌లలో ఎంటర్ చేయాలి.
ఆ కింద.. రాష్ట్రం, జిల్లా, శాసనసభ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన బాక్సులో అక్కడ చూపిన కోడ్ ఎంటర్ చేసి వివరాలు పొందవచ్చు.

ఫొటో సోర్స్, electoralsearch screen
అలాగే.. తెలంగాణ ఎన్నికల సంఘం ఓటరు జాబితా వెబ్‌సైట్ http://ceoaperms.ap.gov.in/ts_search/search.aspx లో కూడా మీ ఓటు వివరాలను చూసుకోవచ్చు.
ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో.. మీ జిల్లాని, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి.
ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబరు కానీ, పేరు కానీ సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు.
మొబైల్‌లో 'నా ఓటు' యాప్ ద్వారా
ఓటర్లు తమ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, నియోజకవర్గం వివరాలను మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవటానికి ఎన్నికల సంఘం 'నా ఓటు' అనే యాప్‌ను ప్రారంభించింది.
దీనిద్వారా.. ఓటర్లు తమ ఓటు వివరాలు, నియోజకవర్గం సమాచారం, పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితా, వలంటీర్ల సమాచారం, తెలుసుకోవచ్చు. వికలాంగులు, వృద్ధులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి అవసరమైన సాయమూ కోరవచ్చు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి సులవైన మార్గం కూడా తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana
అలాగే.. 9223166166 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించటం ద్వారా కూడా పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవచ్చు. TS <స్పేస్> VOTE <స్పేస్> ఓటరు నంబరు టైప్ చేసి మెసేజ్ పంపించాలి.
అలాగే.. 51969 నంబరుకు కూడా TS <స్పేస్> VOTE <స్పేస్> ఓటరు నంబరు టైప్ చేసి మెసేజ్ పంపటం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.
ఓటర్లు ఫిర్యాదు చేయాలనుకుంటే.. భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ ఓటర్లు 1800-599-2999 లేదా 1800-11-1950 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

ఫొటో సోర్స్, Chief Electoral Officer Telangana
జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకుని, ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.
- ఆధార్ కార్డు
- పాస్‌పోర్ట్
- పాన్ కార్డు
- డ్రైవింగ్ లెసెన్స్
- బ్యాంక్ పాస్‌బుక్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు
- ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు
- జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు
- కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
- ఎన్నికల యంత్రాంగం జారీచేసిన అధీకృత ఫొటో ఓటరు స్లిప్
ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
కానీ.. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు వంటి పత్రాలను ఓటు వేయటానికి గుర్తింపు పత్రాలుగా అంగీకరించరు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









