తెలంగాణ ఎన్నికలు 2018: ఏ మేనిఫెస్టోలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ఎన్నికల్లో పార్టీలన్నీ ఆకర్షణ మంత్రాలు పఠిస్తున్నాయి. ప్రచార సభల్లో హామీలు గుప్పించడమే కాకుండా మేనిఫెస్టోల్లోనూ వివిధ వర్గాలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాయి.
ముఖ్యంగా యువత, ఉద్యోగులు, రైతులను లక్ష్యంగా చేసుకుని వివిధ పథకాలకు రూపకల్పన చేయడంతో పాటు ఉన్నవాటికి మార్పులు చేసి మేనిఫెస్టోల్లో పొందుపరిచారు. వీరే లక్ష్యంగా ఉచిత హామీలనూ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో విడుదలతో ప్రధాన పక్షాల ఎన్నికల ప్రణాళికలన్నీ ప్రజల ముందుకు వచ్చినట్లయింది.
నిరుద్యోగ భృతి, రుణ మాఫీ, పింఛన్ల మొత్తం పెంపు, రిటైర్మెంట్ వయసు పెంచడం వంటివి కామన్‌గా ఉన్నాయి.
దీర్ఘకాలిక అవసరాలు నెరవేర్చే కార్యక్రమాలతో పాటు అప్పటికప్పుడు ఓటర్లను ఆకట్టుకునే అంశాలనూ పార్టీలు ఈ మేనిఫెస్టోల్లో పొందుపరిచాయి.
ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఉచితంగా బోర్లు వేయించడం వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
ఈ నేపథ్యంలో పార్టీలు ఎలాంటి హామీలిచ్చాయి.. ప్రధానంగా యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులకు ఎలాంటి వరాలు ప్రకటించాయో చూద్దాం.

ఫొటో సోర్స్, facebook/KCR
టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఏముంది?
రైతులు:
* రైతు బంధు పథకంలో సాయం రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలలో ప్రకటించింది.
* రూ.లక్ష లోపు పంట రుణాల మాఫీ
* రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి
యువత:
* ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి మరో మూడేళ్లు పెంపు
* నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి
మహిళలు:
* చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంతో పోరాటం
* వితంతు పింఛన్ల మొత్తం పెంపు
* బీడీ కార్మికులకు పీఎఫ్ కటాఫ్ 2018 వరకు పొడిగింపు
వృద్ధులు:
* పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్
* వృద్ధాప్య పింఛను అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్ చెప్పింది. ప్రస్తుతం ఇది 65 ఏళ్లు దాటినివారికి ఇస్తున్నారు.
ఉద్యోగులు:
* ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది.
* సముచిత రీతిలో వేతన సవరణ

ఫొటో సోర్స్, Getty Images
మహాకూటమి మేనిఫెస్టో మాటేమిటి?
కనీస ఉమ్మడి కార్యక్రమం పేరుతో మహాకూటమి నవంబరు 26న విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో
రైతులు:
* రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ. కౌలురైతులు, వాస్తవ సాగుదారులకు పంట రుణాలు.
* రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10 వేలు.
* పంటలను మద్దతు ధరకు కొనేందుకు రూ.10 వేల కోట్లతో నిధి.
* ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు సాయం కోసం రూ.2000 కోట్లతో నిధి.
* సన్న, చిన్నకారు రైతులకు పంట బీమా ప్రీమియం చెల్లింపు.
* ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్.
* విత్తనం వేసే సమయంలోనే పంటలకు మద్దతు ధరల ప్రకటన. ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం.
యువత:
* అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. కొలువుల భర్తీకి వార్షిక ప్రణాళికలు.
* పాలిటెక్నిక్, డిగ్రీ చదివిన అభ్యర్థులకు నెలనెలా నిరుద్యోగ భృతి.
* పోటీ పరీక్షలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు.
* ఐటీఐలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలల ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. వీటి కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు.
* ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ, జూనియర్ కాలేజీలు. నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు. జిల్లాకో ఇంజినీరింగ్, పీజీ కళాశాల ఏర్పాటు
* పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వహణకు ప్రత్యేక కమిషనరేట్.
* ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్.
* మహిళా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు.
మహిళలు:
* పాలనలో మహిళలకు భాగస్వామ్యం
* అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం.
వృద్ధులు:
* పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్
* వృద్ధులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ. ఉచిత వైద్యం.
* ఆసరా పథకంలో పింఛన్లకు వయో పరిమితి 65 నుంచి 58కి తగ్గింపు.
ఉద్యోగులు:
* సీపీఎస్ స్థానంలో ఉద్యోగులు కోరుకుంటున్న పాత పింఛను విధానం అమలు చేయడం.
* ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయం. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం.
* సింగరేణి, ఆర్టీసీ లాంటి సంస్థల్లో పదవీ విరమణ పొందిన వారికి బీపీఎల్ కుటుంబాలకిచ్చే పింఛన్ల చెల్లింపు.

ఫొటో సోర్స్, facebook/TelanganaBJP
భారతీయ జనతా పార్టీ ఉచితాల ఎర
రైతులు:
* రూ.2 లక్షల వరకు రుణ మాఫీ
* ప్రతి రైతుకూ ఉచితంగా బోరు లేదా బావి, దానికి పంప్ సెట్
* ఉచితంగా విత్తనాలు
* రైతులు, రైతు కూలీలకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య, జీవిత బీమా
* మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపు. ఇందుకోసం రూ.10 వేల కోట్లతో నిధి
యువత:
* మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
* అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ
* డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
* 7 నుంచి 10 తరగతుల బాలికలకు ఉచితంగా సైకిళ్లు
* నిరుద్యోగులకు రూ.3,116 నెలవారీ నిరుద్యోగ భృతి
* అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత
* రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజు ఎత్తివేత
* ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్
* కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రాధికార సంస్థ ఏర్పాటు
* 5 లక్షల మంది నిరుద్యోగులకు ఎలాంటి పూచీ లేకుండానే రుణాలు
మహిళలు:
* పేద యువతుల పెళ్లికి సహాయంగా సౌభాగ్య లక్ష్మి పథకం. తులం బంగారం, రూ.లక్ష నగదు
* డ్వాక్రా గ్రూపులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, ఉచితంగా స్మార్టు ఫోన్లు, రూ. లక్ష గ్రాంట్
వృద్ధులు:
* ఇల్లు లేని పింఛనర్లకు 50 రాయితీతో ఇళ్ల మంజూరు
* దారిద్ర్య రేఖకు దిగువనున్నకుటంబాల్లోని 55 ఏళ్లు దాటినవారికి నెలకు రూ.2 వేల పెన్షన్.
* ప్రతి జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం అన్ని సౌకర్యాలతో వెల్‌నెస్ సెంటర్లు
ఉద్యోగులు:
* సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు
* ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం
* కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులను సర్వీస్ ఆధారంగా క్రమబద్దీకరణ, వేతనాల పెంపు
* హోంగార్డులకు సర్వీస్ క్రమబద్ధీకరణ, ఇళ్లు మంజూరు
* సింగరేణి ఉద్యోగులకు కారుణ్య నియామకాల అమలు. ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల అడ్వాన్స్.
ఇవి కూడా చదవండి
- ఎన్టీఆర్ తరువాత నందమూరి సుహాసినే
- BBC Quiz: టీఆర్ఎస్ మొదటి ఎన్నికల గుర్తు కారు కాదు - మరేంటి
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








