తెలంగాణ రంగస్థలం: నీళ్లు, నిధులు, నియామకాలపై ఏ పార్టీలు ఏమన్నాయి? - తెలంగాణ ఎన్నికలు 2018

తెలంగాణ రంగస్థలం చర్చ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో బీబీసీ తెలుగు నిర్వహించిన 'తెలంగాణ రంగస్థలం' చర్చా కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు డీజీ నర్సింహారావు(సీపీఎం), బూర నర్సయ్యగౌడ్(టీఆర్‌ఎస్), ఇంద్రసేనారెడ్డి(బీజేపీ), రంగారెడ్డి(కాంగ్రెస్), దుర్గాప్రసాద్(టీడీపీ), విద్యాధర్‌రెడ్డి(టీజేఎస్), సామాజిక విశ్లేషకురాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా పాల్గొన్నారు.

బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో.. గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ సాధించిందేమిటి, సాధించాల్సిందేమిటి, నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో తెలంగాణ ఇప్పుడు ఎక్కడ ఉంది, భవిష్యత్తు చిత్రపటం ఏమిటి- అనే అంశాలపై చర్చించారు.

కోఠి మహిళా కళాశాలలో నిర్వహించిన 'రంగస్థలం'లో చర్చ అనంతరం పలువురు ఆహూతులు వేసిన ప్రశ్నలకు నాయకులు, పద్మజా షా సమాధానాలు ఇచ్చారు. బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వేదికల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.

రంగస్థలం కార్యక్రమం

చర్చలో ఏయే అంశాలపై ఎవరేమన్నారంటే...

గత నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానంగా ఏం సాధించిందనేదానిపై నర్సయ్య గౌడ్ స్పందిస్తూ- ''తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, శాంతిభద్రతల సమస్యలుంటాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వ్యక్తులపై దాడి జరుగుతుందని, తెలంగాణను పాలించే శక్తి తెలంగాణ ప్రలజకు, తెలంగాణ నాయకులకు లేదనే నాలుగు అపవాదులు లోగడ ప్రధానంగా వినిపించాయి. ఇవన్నీ తప్పని మా ప్రభుత్వం నిరూపించింది'' అన్నారు.

సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన- ఇలా అన్నింటిని సమాంతరంగా చేసుకొంటూ వస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఉన్నంతగా శాంతిభద్రతలు పక్క రాష్ట్రాల్లో కూడా లేవన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

నదీజాలల విషయంలో ఆంధ్రప్రదేశ్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, హక్కు ప్రకారం తమకు రావాల్సిన నీటిని తాము వాడుకుంటామని చెప్పారు.

చర్చ అనంతరం ప్రశ్న వేస్తున్న యువతి

వ్యవసాయం, రైతుబంధు, కౌలురైతులు

ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతుబంధు పథకం తీసుకొచ్చారని, ఇది ప్రజల డబ్బు పంచి ఓట్లు పొందే పథకమని విద్యాధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ''పది ఎకరాలు, వంద ఎకరాలు ఉన్నవారికి ఒకే న్యాయమా'' అని ఈ పథకాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.

రైతులే వ్యవసాయం లాభదాయకం కాదని భావిస్తున్నారని, అందుకే భూమి కౌలుకు ఇస్తున్నారని రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. ''నేనే నా భూమిని కౌలుకు ఇచ్చా. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది రైతుకూలీలే. కానీ పరిహారం పొందాల్సిన కౌలు రైతు కుటుంబాలు పొందట్లేదు. రైతుబంధు ఫలితాలు పట్టా భూమి ఉన్న రైతులకే దక్కుతున్నాయి'' అంటూ ప్రభుత్వ విధానాన్ని ఆయన తప్పుబట్టారు.

కౌలురైతుల వివరాలపై స్పష్టత లేదని, వీరి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని నర్సయ్యగౌడ్ కోరారు. ''కౌలు రైతుకు స్పష్టమైన హోదా కల్పించాలి. భూమిదారుడి హక్కు కాపాడాలి. అప్పుడు కౌలురైతులను కూడా రైతుబంధు పథకంలో చేర్చడానికి మేం సిద్ధం'' అని ఆయన తెలిపారు.

ప్రశ్న వేస్తున్న ఒక యువకుడు

నదీజలాలు

తెలంగాణలో వివిధ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖలు రాశారని నర్సయ్యగౌడ్ విమర్శించారు.

రాజకీయ పబ్బం కోసం, ఓట్లు దండుకోవడం కోసం తెలంగాణ-ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురావాలని టీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని దుర్గాప్రసాద్ ఆరోపించారు.

నదీజలాల విషయంపై అనేక దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నదీజలాల విషయాన్ని టీఆర్‌ఎస్ నేతలు రాజకీయాల్లోకి ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు.

ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి చర్చించి ఎందుకు పరిష్కరించుకోలేదని ఆయన ప్రశ్నించారు.

ఇద్దరు యువతులు

విద్య

టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రతి పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో చేస్తామని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో చెప్పారని విద్యాధర్‌రెడ్డి పేర్కొన్నారు. ''ఇప్పుడు దాదాపు నాలుగు వేల స్కూళ్లను మూసేసి, గురుకుల పాఠశాలలను స్థాపించడంలో అర్థం లేదు'' అని ఆయన విమర్శించారు.

ఈ నాలుగేళ్లలో విద్యారంగం పతనమైందని, అనేక ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని పద్మజా షా విమర్శించారు. ఆడపిల్లల చదువుకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు.

ప్రశ్న వేస్తున్న ఒక యువతి

ఉపాధి

అబద్ధాలు, బూతులు తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడరని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదన్నారు.

తెలంగాణలో నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ రంగంలో కల్పించిన ఉద్యోగాలు దాదాపు 22 వేలు కూడా లేవని టీజేఎస్ నేత విద్యాధర్‌రెడ్డి అన్నారు. ''యాపిల్, గూగుల్ లాంటి సంస్థలు వచ్చాయంటారు. కానీ వాటిలో ఉద్యోగాలు కేవలం తెలంగాణ వాళ్లకే ఇవ్వరు. భారీగా ఉపాధి కల్పించే ఆటోమొబైల్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లాంటివి మాత్రం రాష్ట్రానికి రాలేదు'' అని ఆయన విమర్శించారు.

ఉద్యోగాల భర్తీపై నర్సయ్యగౌడ్ స్పందిస్తూ- లక్షకు పైగా ఉద్యోగాల కల్పనకు ప్రక్రియ జరుగుతోందన్నారు. ''32 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. 87,346 ఉద్యోగాల కల్పనకు ప్రక్రియ మొదలైంది'' అని ఆయన చెప్పారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ప్రజల మధ్య కలహాలు పెట్టాలని చూస్తున్నారు

ఓట్ల కోసం నాలుగేళ్ల క్రితం తీసుకొచ్చిన తెలంగాణ-ఆంధ్ర సెంటిమెంటు వాదననే మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తోందని టీడీపీ నేత దుర్గాప్రసాద్ విమర్శించారు. కానీ తెలంగాణ సమాజం ఈ సెంటిమెంటుతో లేదని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకోవాలని కోరుకొంటోందని చెప్పారు.

తెలుగు ప్రజల మధ్య కలహాలు పెట్టి రాజ్యాధికారం తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని, తెలంగాణ సమాజం జాగరూకతతో ఆలోచించుకోవాలని దుర్గాప్రసాద్ సూచించారు.

చర్చ

ప్రజాకూటమి ఏర్పాటుపై..

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను టీఆర్‌ఎస్ నెరవేర్చలేదని, అందువల్ల టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడ్డాయని దుర్గాప్రసాద్ చెప్పారు.

''టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతోంది. కానీ, ఇతర సమస్యల గురించి మాట్లాడట్లేదు. ప్రధానంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన విషయాల గురించి అస్సలు మాట్లాడట్లేదు. సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తున్నాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''తెలంగాణలో మిగిలిన పార్టీలతో టీఆర్‌ఎస్‌కు రాజకీయ వైరుధ్యం ఉంది, లక్ష్యాల విషయంలో కాదు. కానీ తెలుగుదేశంతో లక్ష్యం విషయంలో కూడా వైరుధ్యం ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

రైతు ఆత్మహత్యల సమస్య, గిట్టుబాటు ధరలు తదితర అంశాలు తక్షణం పరిష్కరించాల్సినవని, కానీ ప్రభుత్వం పరిష్కరించట్లేదని నర్సింహారావు విమర్శించారు.

మాట్లాడుతున్న బూర నర్సయ్యగౌడ్
ఫొటో క్యాప్షన్, చర్చలో మాట్లాడుతున్న బూర నర్సయ్యగౌడ్. చిత్రంలో బీఎల్ఎఫ్ నాయకుడు టీజీ నర్సింహారావు(సీపీఎం), బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి, బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్

విద్యుత్

విద్యుత్ సరఫరాపై టీఆర్‌ఎస్ ప్రచారాన్ని కాంగ్రెస్, టీడీపీ ఆక్షేపించాయి.

ముఖ్యమంత్రికి మాట్లాడటానికి కరెంటు తప్ప ఇంకో అంశమే ఉండదా అని రంగారెడ్డి ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందన్నారు. కరెంటు బల్బు తానే కనుగొన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య, ఇతర సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన యత్నిస్తున్నారని చెప్పారు.

''తెలంగాణ మేధస్సును అణచివేసి, వన్ మ్యాన్ షోను ఆయన నడిపిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు సెంటిమెంటు వాదనను తీసుకొచ్చారు'' అని రంగారెడ్డి ఆరోపించారు.

ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మెగావాట్ కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉత్పత్తి చేయలేదని, విద్యుత్ లభ్యత విషయంలో ఈ ప్రభుత్వం ఘనత ఏమీ లేదని దుర్గాప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఆహూతులు

మహిళల ప్రాతినిధ్యం

మహిళలకు టీఆర్ఎస్ తగిన అవకాశాలు కల్పించడం లేదని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి, ఇతర వక్తలు విమర్శించారు.

టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో మహిళ లేకపోవడం లోటేనని, ఈ విషయాన్ని అంగీకరిస్తామని నర్సయ్య గౌడ్ చెప్పారు.

నోటా

నోటాకు 20 లేదా 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు పడితే మళ్లీ ఎన్నిక నిర్వహించాలనే నిబంధనను నోటా నిబంధనల్లో చేర్చాలని పద్మజా షా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)