సూపర్ ఎర్త్: సమీప నక్షత్రం పరిధిలో మరో భూగ్రహం

బర్నార్డ్స్ స్టార్ బి ఊహాచిత్రం

ఫొటో సోర్స్, ESO/M. KORNMESSER

ఫొటో క్యాప్షన్, బర్నార్డ్స్ స్టార్ బి (ఊహాచిత్రం) గ్రహం మీద వాతావరణం అతి శీతలంగా ఉంటుందని భావిస్తున్నారు

మన సూర్యుడికి అతి సమీపంగా ఉన్న ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

మనకి దగ్గరగా ఉన్న ఇటువంటి గ్రహాలే.. జీవం ఆనవాళ్ల అన్వేషణకు ప్రధాన లక్ష్యాలు అవుతుంటాయి. కొత్త తరం టెలిస్కోపులను ఉపయోగించి ఈ పరిశోధనలు చేస్తుంటారు.

భూమికి కేవలం ఆరు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ ఈ కొత్త గ్రహం తిరుగుతోంది.

అమెరికా ఖగోళ శాస్త్రవేత్త ఇ.ఇ. బెర్నార్డ్ 1916లో ఈ నక్షత్రం కదలికలను లెక్కించారు. ఆయన గౌరవార్థం ఈ నక్షత్రానికి ఆయన పేరు పెట్టారు.

ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లు కొత్త గ్రహం గురించి గిలెమ్ ఆంగ్లాదా ఎస్క్యూడ్, ఆయన సహచరులు 'నేచర్' జర్నల్‌లో రాస్తూ, దాని ద్రవ్యరాశి.. భూగ్రహం ద్రవ్యరాశి కన్నా 3.2 రెట్లు ఎక్కువగా ఉందని చెప్పారు.

అందువల్ల ఆ గ్రహాన్ని ''సూపర్-ఎర్త్'' అనే వర్గీకరణలో చేర్చారు.

సూర్యుడి సమీపంలోని నక్షత్రాలు

ఫొటో సోర్స్, IEEC/SCIENCE-WAVE - GUILLEM RAMISA

సూర్యుడి సమీపంలోని నక్షత్రాలు

''అది రాళ్లమయంగా.. భారీ వాతావరణంతో ఉండొచ్చు. నీరు, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటివి అపారంగా ఉండొచ్చు. అందులో చాలా వరకూ ఉపరితలం మీద ఘనీభవించి ఉన్నాయి'' అని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఖగోళ పరిశోధకుడు గిలెమ్ బీబీసీతో పేర్కొన్నారు.

''సౌర వ్యవస్థకు అతి సమీపంలో భూమిని పోలిన గ్రహంగా.. శని గ్రహపు ఉపగ్రహం టైటన్ కావచ్చు. అది కూడా రాతిమయమైనదే. హైడ్రోకార్బన్లతో తయారైంది. దానిమీద మీథేన్ సరస్సులు, వర్షాలు ఉన్నాయి'' అని గిలెమ్ చెప్పారు.

కొత్తగా గుర్తించిన గ్రహాన్ని 'బర్నార్డ్స్ స్టార్ బి'గా వ్యవహరిస్తున్నారు. మన సౌర కుటుంబంలో సూర్యుడి నుంచి బుధగ్రహం ఎంత దూరంలో ఉందో.. ఆ గ్రహం ఆ సౌర కుటుంబంలోని సూర్యుడి నుంచి దాదాపు అంతే దూరంలో ఉంది.

మనకు సమీపంలో ఉన్న భూమిని పోలిన గ్రహంగా 2016లో ప్రకటించిన 'ప్రాక్జిమా సెంటారై బి' తర్వాత మనకు దగ్గరగా ఉన్న ఆ తరహా గ్రహం 'బర్డ్నార్డ్స్ స్టార్ బి' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బర్నార్డ్స్ స్టార్ బి ఉపరితలం ఊహాచిత్రం

ఫొటో సోర్స్, ESO/M. KORNMESSER

ఫొటో క్యాప్షన్, బర్నార్డ్స్ స్టార్ బి ఉపరితలం (ఊహాచిత్రం) రాతిమయంగానూ, భారీ వాతావరణంతో నిండి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా

బర్నార్డ్స్ స్టార్ నిజానికి 'రెడ్ డ్వార్ఫ్' అని వ్యవహరించే కాంతిహీనమైన నక్షత్రం. మన సూర్యుడి ప్రకాశంతో పోలిస్తే దాని వెలుగు మూడు శాతమే ఉంటుంది. అందువల్ల దాని నుంచి విడుదలయ్యే సౌరశక్తి చాలా చాలా తక్కువ.

బర్నార్డ్స్ స్టార్‌ నుంచి 'స్నో లైన్' (హిమ రేఖ) అని వ్యవహరించే ఒక పరిధికి ఆవలి కక్ష్యలో ఈ కొత్త గ్రహం తిరుగుతోంది. అంటే, ద్రవ రూపంలోనే నీరు ఉన్న నివాసయోగ్యమైన వాతావరణానికి ఈ గ్రహం చాలా దూరంగా ఉంది.

కేవలం ఈ దూరాన్ని బట్టే.. ఆ గ్రహం ఉపరితలం మీద ఉష్ణోగ్రత -150 సెంటీగ్రేడ్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే, దానిమీదున్న భారీ వాతావరణానికి.. ఆ గ్రహంలో వేడి పుట్టించగల సామర్థ్యం ఉందని.. తద్వారా జీవ నివాసానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్తున్నారు.

ఈ గ్రహం తన సూర్యుడి చుట్టూ తిరగటానికి 233 రోజులు పడుతుందని, అయితే అలా మళ్లీ మళ్లీ జరుగుతోందా లేదా అని నిర్ధారించుకోవటానికి చాలా ఏళ్లపాటు పరిశోధించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అన్నారు.

సూర్యుడు, బర్నార్డ్స్ స్టార్ బి పోలిక (ఊహాచిత్రం)

ఫొటో సోర్స్, NATURE

ఫొటో క్యాప్షన్, సూర్యడికి బుధగ్రహం ఎంత దూరంలో ఉందో.. బర్డ్నార్డ్స్ స్టార్ బికి కూడా కొత్త గ్రహం అంతే దూరంలో ఉంది

నక్షత్రానికి ఇంతటి దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని గుర్తించటానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా రేడియల్ వెలాసిటీ టెక్నిక్‌ను ఉపయోగించారు.

కొత్త తరం టెలిస్కోపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని మరింత లోతుగా పరిశోధించనున్నారు. గ్రహం వాతావరణంలో జీవం మనుగడకు ఆనవాళ్ళయిన ఆక్సిజన్, మీథేన్ వంటి వాయువులు ఉన్నాయేమో పరిశీలిస్తారు.

బర్నార్డ్స్ స్టార్ చుట్టూ తిరుగుతున్న గ్రహం గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. 1960లలో డచ్ ఖగోళ శాస్త్రవేత్త పీటర్ వాన్ దె కాంప్ అమెరికాలో పరిశోధన సాగిస్తూ... ఆ స్టార్ చుట్టూ తిరిగే భూమి వంటి గ్రహం ఒకటి ఉండి వచ్చునని సూత్రీకరించారు.

డబ్ల్యూఫస్ట్ టెలిస్కోప్ (ఊహాచిత్రం)

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, కొత్త తరం టెలిస్కోప్ డబ్ల్యూఫస్ట్ (ఊహాచిత్రం) ద్వారా కొత్త గ్రహాన్ని నేరుగా ఫొటోలు తీయవచ్చునని ఆశిస్తున్నారు

ఆ నక్షత్రపు కదలికల్లోని మార్పుల ఆధారంగా ఆయన ఈ సూత్రీకరణకు వచ్చారు.

అయితే.. ఆయన గుర్తించిన దానిని ఇతర శాస్త్రవేత్తలు గుర్తించలేకపోవటంతో అది వివాదాస్పదంగా మారింది.

''ఈ కొత్త గ్రహాన్ని పీటర్ వాన్ దె కాంప్ కనిపెట్టగలగటం అసాధ్యం. ఆయన ఉపయోగించిన సిగ్నల్ చాలా చిన్నది'' అని గులెమ్ పేర్కొన్నారు.

అయితే, కొత్తగా చేసిన పరిశోధనల్లో.. బెర్నార్డ్ స్టార్ చుట్టూ ఈ సూపర్-ఎర్త్ కన్నా దూరంగా మరొక గ్రహం కూడా ఉన్నట్లు సంకేతాలు కనిపించాయి.

''అది వాన్ దె కాంప్ గుర్తించిన గ్రహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయినా, ఆ అవకాశం చాలా తక్కువ'' అని గులెమ్ అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ష్.. సూర్యుడు శబ్దం చేస్తున్నాడు!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)