కోదండరాం: రాజనీతి పాఠాల నుంచి రాజకీయాలకు.. వయా ఉద్యమం

కోదండరాం

ఫొటో సోర్స్, kodandaram/fb

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ.. జేఏసీ కన్వీనర్‌గా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు.

వృత్తిరీత్యా ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు అయిన కోదండరాం పౌరహక్కుల నేతగాను మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాడారు.

ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (ఏపీసీఎల్‌సీ) రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పౌరహక్కుల ఉద్యమంలోనూ కోదండరాం పని చేశారు. ఆహార భద్రత చట్టం కేసు విషయంలో సుప్రీంకోర్టు కమిషనర్‌కు సలహాదారుగా సేవలు అందించారు.

1996 నుంచే తెలంగాణ సమస్యలపై అనేక సెమినార్లు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ స్థాపించిన తెలంగాణ విద్య వంతుల వేదిక (టీవీవీ)కు 2004 లో రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

తెలంగాణ జేఏసీ కన్వీనర్‌గా

2009 డిసెంబర్ 24న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) ఏర్పాటైంది. దీనికి కోదండరాం కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు తీసుకెళ్ళడంలో, సబ్బండ వర్ణాలను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తన వంతు పాత్ర పోషించారు.

టీజాక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్‌లకు పిలుపునిచ్చారు. రాజకీయపార్టీలు తెలంగాణకు మద్దతిచ్చేలా ఒత్తిడి తీసుకొచ్చారు.

కోదండరాం

ఫొటో సోర్స్, kodanram/fb

రాజకీయ పార్టీ ఏర్పాటు

తెలంగాణ ఏర్పాటు తర్వాత టీజాక్‌ను కొనసాగిస్తూనే తెలంగాణ పునర్‌నిర్మాణానికి టీజాక్ కృషి చేస్తుందని ప్రకటించారు. భౌగోళికంగా తెలంగాణ మాత్రమే సాధించుకున్నామని సామాజిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

టీజాక్‌ను ఇటీవల తెలంగాణ జనసమితి పేరుతో రాజకీయ పార్టీ‌గా మార్చిన కోదండరాం కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికల బరిలో దిగారు.

కోదండరాం ఎన్నికల్లో పోటీకి దిగనప్పటికీ ప్రజాకూటమి తరఫున తన పార్టీ నుంచి 8 మంది అభ్యర్థులను నిలబెట్టారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)