రేవంత్‌రెడ్డి : కొడంగల్ అభ్యర్థి రాజకీయ ప్రస్థానం.. ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకు

రేవంత్‌రెడ్డి

ఫొటో సోర్స్, Revanth Reddy Anumula/Facebook

అనుముల రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లలో ముఖ్యమైన నాయకుడు. అంతేకాదు.. కాంగ్రెస్ గెలిస్తే తాను ముఖ్యమంత్రినవుతానంటూ కొద్ది రోజుల కిందట ఎన్నికల ప్రచారంలో సూచించటం ద్వారా కలకలం రేపారు.

కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయాణం ఆది నుంచీ సంచలనాల మయమే.

విద్యార్థిగా ఉన్నపుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్.. అనంతరం టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఎంఎల్‌సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

కొడంగల్ నియోజవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015 ఎంఎల్‌సీ ఎన్నికల్లో లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు.

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గాను, టీటీడీపీ శాసనసభా పక్ష నేతగాను ఉన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ముగ్గురు అధ్యక్షుల్లో ఒకరుగా నియమితులయ్యారు.

ఇప్పుడు కొడంగల్ నియోజవర్గం నుంచి మూడోసారి పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ కీలక అభ్యర్థిగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును నేరుగా సవాల్ చేస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులతో రేవంత్‌రెడ్డి

ఫొటో సోర్స్, Revanth Reddy Anumula/Facebook

రేవంత్‌రెడ్డి ప్రొఫైల్ ఇదీ...

జననం: 1969 నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి

చదువు: ఎ.వి. కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ (బి.ఎ.)

వివాహం: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తెతో 1992లో వివాహం

విద్యార్థిగా: రేవంత్‌రెడ్డి విద్యార్థిగా ఉన్నపుడే.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు.

రేవంత్‌రెడ్డి

ఫొటో సోర్స్, Revanth Reddy Anumula/Facebook

రాజకీయ ప్రవేశం...

2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు రేవంత్‌రెడ్డి.

2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యుయెన్సీ (జడ్‌పీటీసీ) నుంచి పోటీ చేయటానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అలా సంచలన నాయకుడిగా వార్తల్లోకి వచ్చారు.

మళ్లీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా గెలిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి ఆ పార్టీలో చేరారు.

ఆ మరుసటి ఏడాది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు.

రేవంత్‌రెడ్డి

ఫొటో సోర్స్, Revanth Reddy Anumula/Facebook

ఎంఎల్‌సీ ఎన్నికలు - అరెస్ట్...

2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేట్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్‌-ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావటంతో యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) మే నెలాఖరులో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.

ఆయనతో పాటు.. బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహా అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో రేవంత్‌రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు.

రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ

ఫొటో సోర్స్, Revanth Reddy Anumula

కాంగ్రెస్‌లో చేరిక...

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలన్న యోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో.. 2017 అక్టోబర్‌లో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే నెల చివరిలో రేవంత్‌రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా.. దిల్లీలో రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్‌రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు.

క్రీడలు: స్వయంగా క్రీడాకారుడైన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ హాకీ ఫెడరేషన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్)లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)