తెలుగు దేశం పార్టీకి రేవంత్‌రెడ్డి రాజీనామా

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రోజు విజయవాడకు వచ్చిన రేవంత్ అక్కడే పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయంలో తన రాజీనామా లేఖను అందజేశారు.
అలాగే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి మరో లేఖ పంపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపిన నాలుగు పేజీల లేఖలో తానెందుకు పార్టీ వీడాల్సివచ్చిందో వివరించారు. తనను సొంత మనిషిగా గుర్తించి ప్రోత్సహించారని లేఖలో చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

''మీరిచ్చిన ప్రోత్సాహంతోనే 40 నెలలుగా కేసీఆర్ అరాచకాలపై పోరాటం సాగించాను. కేసీఆర్ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలనుకున్నాను.
మీ అండతోనే ఆ దిశగా పోరాటం చేశాను. నాపై పాలకులు కక్షగట్టి అక్రమ కేసులతో వేధించిన విషయం తెలిసిందే. అరెస్టు చేసి జైళ్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు.
నా బిడ్డ నిశ్చితార్ధానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండె నిబ్బరం కోల్పోలేదు. ఆ సందర్భంలో నాకు, నా కుటుంబానికి మీరు, భువనేశ్వరి మేడమ్ కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు.
కష్టాలొచ్చినప్పుడు మీరిచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. '' అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
ఇతర కథనాలు
అలాగే, ''తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది. నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి.'' అంటూ పార్టీ వీడటంపై ఆ లేఖలో చంద్రబాబుకు వివరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








