కేటీఆర్: ఉద్యోగం నుంచి ఉద్యమం దాకా

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTR

కల్వకుంట్ల తారకరామారావు... కేటీఆర్ అంటూ అందరూ పిలిచే ఈ నేత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయుడైన కేటీఆర్ ప్రభుత్వం, పార్టీలోనూ కీలకంగా వ్యవహరిస్తూ నాయకుడిగా ఎదిగారు.

చేనేతకు చిరునామా అయిన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తన ఎన్నికల ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన వరుసగా అక్కడి నుంచే గెలుస్తూ ఈసారీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, Facebook/KTR

ఉద్యోగం నుంచి ఉద్యమంలోకి

తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేటీఆర్ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేసి తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు.

టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగి రాజీనామాలు చేయడంతో వచ్చిన ఉపఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అనంతరం 2009లో తొలిసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన అతి కష్టమ్మీద గట్టెక్కారు.

కేవలం 171 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ తిరుబాటు అభ్యర్థి కె.కె.మహేందర్‌రెడ్డిపై విజయం సాధించగలిగారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTR

తొలి ప్రభుత్వంలో మంత్రిగా..

అనంతరం తెలంగాణ సాధన కోసమంటూ రాజీనామాలు చేయడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పుంజుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన 68,220 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.కె.మహేందర్‌రెడ్డిపై గెలిచారు.

ఆ తరువాత 2014 ఎన్నికల్లో కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచే బరిలో దిగి 53 వేలకు పైగా మెజార్టీ సాధించారు.

కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేటీఆర్‌ మంత్రి పదవి చేపట్టారు.

సమాచార సాంకేతిక(ఐటీ), మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌, టెక్సైల్స్‌ మరియు ఎన్నారై ఎఫైర్స్‌ మంత్రిగా ఆయన పనిచేశారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/ktr

సోషల్ మీడియాలో యాక్టివ్

గుంటూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన కేటీఆర్ నిజాం కాలేజీలో బీఎస్సీ మైక్రోబయాలజీ, పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు.

అనంతరం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ నుంచి మార్కెటింగ్, ఈ-కామర్స్ లో ఎంబీఏ చదివిన ఆయన అమెరికాలోనే ఉద్యోగ జీవితం సాగించారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ట్విటర్ వేదికగా తన దృష్టికొచ్చే సమస్యలను పరిష్కరించిన సందర్భాలున్నాయి.

సిరిసిల్ల నియోజకవర్గం మొత్తం ఓటర్లు: 2,16,056

ప్రధాన అభ్యర్థులు: కాంగ్రెస్ నుంచి కె.కె. మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి నల్లగారి నర్సారెడ్డి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)