సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

సౌదీ అరేబియాలో రెండు భారీ చమురు కేంద్రాల మీద శనివారం డ్రోన్ దాడులు జరిగాయి.

అరామ్‌కో అనే ప్రభుత్వం సంస్థకు చెందిన ఈ చమురు కేంద్రాల్లో డ్రోన్ దాడులతో మంటలు ఎగసిపడుతున్నాయని ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.

అరామ్‌కో కంపెనీకి చెందిన అతిపెద్ద చమురు శుద్ధి ప్లాంటు ఉన్న అబ్కాయిక్‌లో భారీ మంటలు ఎగసిపడుతుండటం వీడియో దృశ్యాల్లో కనిపించింది.

రెండో డ్రోన్ దాడితో ఖురైస్‌ చమురు క్షేత్రంలో మంటలు వ్యాపించాయి.

రెండు చోట్లా మంటలు అదుపులో ఉన్నాయని ప్రభుత్వ మీడియా పేర్కొంది.

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

సౌదీ చమురు క్షేత్రాల మీద దాడులకు పది డ్రోన్లను మోహరించామని హౌతీ గ్రూప్ సైనిక ప్రతినిధి యాహ్యా సారియా ప్రకటించాడు. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇరాన్ అనుకూలంగా ఉంది.

భవిష్యత్‌లో మరిన్ని దాడులు ఉంటాయని కూడా ఆయన అల్-మసీరా టీవీ చానల్‌తో చెప్పాడు. బీరుట్ కేంద్రంగా నడుస్తున్న ఈ టీవీ చానల్ కూడా హౌతీ గ్రూప్ వాళ్లదే.

చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియా లోపల హౌతీ దళాలు నిర్వహించిన అతిపెద్ద ఆపరేషన్ అని అతడు పేర్కొన్నాడు. సౌదీ రాజ్యం లోపలి ప్రజలతో సమన్వయంతో ఈ దాడులు చేశామన్నాడు.

అయితే.. ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారని తాము భావిస్తున్నామనే విషయం మీద సౌదీ అధికారులు ఇంకా స్పందించలేదు.

ఈ దాడుల్లో ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియలేదు. అయితే ఎవరూ చనిపోలేదని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్సూర్ అల్-టర్కి చెప్పినట్లు ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్ తెలిపింది.

సౌదీ అరేబియా ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ధహ్రాన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో అబ్కాక్ ఉంటే.. దేశంలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఖురైస్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

2006లో అబ్కాక్ మీద దాడిచేయటానికి అల్-ఖైదా ఆత్మాహుతి బాంబర్లు చేసిన ప్రయత్నాన్ని సౌదీ భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హౌతీలకు సాయుధ డ్రోన్ల టెక్నాలజీ ఎక్కడిది?

ఇప్పుడు జరిగిన దాడి.. సౌదీ అరేబియా చమురు కేంద్రాలకు హౌతీల నుంచి పొంచివున్న వ్యూహాత్మక ముప్పు ఎంత తీవ్రంగా ఉందనేది చెప్తోందని బీబీసీ రక్షణ రంగ, దౌత్య రంగ ప్రతినిధి జొనాథన్ మార్కస్ విశ్లేషించారు.

హౌతీల డ్రోన్ అపరేషన్లు పెరుగుతుండటం.. అసలు ఈ సామర్థ్యాలు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయనే చర్చను మళ్లీ తెరపైకి తెస్తాయన్నారు.

పౌరవినియోగానికి ఉద్దేశించిన వాణిజ్య డ్రోన్లనే ఆయుధాలుగా మలచుకున్నారా? లేక ఇరాన్ నుంచి వారికి గణనీయమైన సాయం అందిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

''అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌నే వేలెత్తు చూపే అవకాశముంది. కానీ ఈ డ్రోన్ దాడులకు ఇరాన్ ఎంత వరకూ తోడ్పాటునిస్తోందనే దాని మీద నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి'' అని మార్కస్ తెలిపారు.

''యెమెన్‌లోని హౌతీ లక్ష్యాల మీద సౌదీ వైమానిక దళాలు చాలా ఏళ్లుగా దాడులు చేస్తున్నాయి. ఇప్పుడు పరిమితంగానే అయినా హౌతీలకూ ఎదురు దాడులు చేసే సామర్థ్యం ఉంది. సాయుధ డ్రోన్ ఆపరేషన్లు.. ఏవో పిడికెడు పెద్ద దేశాలకు పరిమితమైన శకం ముగిసిందని తాజా దాడులతో స్పష్టమైంది'' అని ఆయన విశ్లేషించారు.

అమెరికా నుంచి చైనా వరకూ, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వరకూ, హౌతీల నుంచి హిజ్బుల్లా వరకూ అందరికీ డ్రోన్ టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు.

వీడియో క్యాప్షన్, యెమెన్‌లో యుద్ధం ప్రళయాన్ని సృష్టిస్తోంది. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

అసలు హౌతీలు ఎవరు?

ఇరాన్‌తో అనుబంధంగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు.. యెమెన్ ప్రభుత్వం మీద, సౌదీ సారథ్యంలోని సంకీర్ణం మీద పోరాడుతున్నారు.

2015 హౌతీల దాడులతో యెమెన్ అధ్యక్షుడు అబ్ద్రాబ్బు మన్సూర్ హాదీ దేశం విడిచి పరారైనప్పటి నుంచీ.. ఈ దేశంలో అంతర్యుద్ధం సాగుతోంది.

అధ్యక్షుడు హాదీకి సౌదీ అరేబియా మద్దతు ఇస్తోంది. హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ఈ ప్రాంత దేశాలతో సంకీర్ణంగా ఏర్పడి దాడులు చేస్తోంది.

హౌతీ లక్ష్యాలపై సౌదీ సంకీర్ణం దాదాపు ప్రతి రోజూ వైమానిక దాడులు చేస్తుంటే.. హౌతీలు తరచుగా సౌదీ అరేబియాలోకి క్షిపణులు సంధిస్తున్నారు.

''మా మీద దాడులు, దిగ్బంధం కొనసాగినంత కాలం సౌదీ లక్ష్యాల మీద మా ఆపరేషన్లు మరింతగా పెరుగుతూనే ఉంటాయి.. ఇంతకుముందుకన్నా మరింత భీకరంగానూ ఉంటాయి'' అని హౌతీ గ్రూప్ సైనిక ప్రతినిధి పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)