గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు విడుదల.. మేట్ 30 ప్రో ఫోన్లో సినీ కెమెరా సహా నాలుగు కెమెరాలు

ఫొటో సోర్స్, HUAWEI
చైనా ప్రముఖ మొబైల్ తయారీదారు 'హువావే' గూగుల్ యాప్‌లు లేకుండానే తన తాజా స్మార్ట్‌ఫోన్లు 'మేట్ 30', 'మేట్ 30 ప్రో'లను ఆవిష్కరించింది. జాతీయ భద్రతకు ప్రమాదకరమంటూ, హువావేతో లావాదేవీలు జరపకుండా అమెరికా కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిషేధించిన తర్వాత హువావే విడుదల చేసిన తొలి ఫోన్లు ఇవే.
వీటిలో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, ఇతర అప్లికేషన్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సాధారణంగా ముందే ఇన్‌స్టాల్ చేసి ఉండే చాలా అప్లికేషన్లు ఈ ఫోన్లలో లేవు. గూగుల్ ప్లే స్టోర్ కూడా లేదు.
గూగుల్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా హువావే సొంత అప్లికేషన్లు ఇందులో ఏర్పాటు చేసింది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ యాప్‌లు హువావే సొంత యాప్ స్టోర్ 'హువావే యాప్ గ్యాలరీ'లో అందుబాటులో ఉన్నాయని సంస్థ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.
హువావేను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో చాలా కంపెనీల నుంచి అధునాతన టెక్నాలజీని సంస్థ పొందలేకపోతోంది.
గూగుల్ యాప్‌లను ఈ ఫోన్లలో 'సైడ్-లోడ్' చేసేందుకు వీలుందని, ఇది ఎలా చేయాలనేది వినియోగదారులకు ఫోన్లు విక్రయించే దుకాణాల సిబ్బంది చెబుతారని రిచర్డ్ తెలిపారు. వీటి పనితీరు అంత సజావుగా ఉండకపోవచ్చని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి హువావే గత మోడళ్ల తరహా ఫోన్లు కాదు. వీటిలో గూగుల్ అధికారిక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ లేదు. ఒక కస్టమైజ్డ్ ఓపెన్ సోర్స్ ఆండ్రాయిడ్ వర్షన్ ఇందులో ఉంది.
ఈ నెల 19న జర్మనీలోని మ్యూనిక్‌లో మేట్ 30, మేట్ 30 ప్రో ఫోన్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ప్రారంభమై గంటన్నర గడిచేదాకా గూగుల్ యాప్‌లు ఇందులో లేవనే అంశాన్ని హువావే అధికారులు ప్రస్తావించలేదు.
అమెరికా విధించిన నిషేధం వల్ల ఈ ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీసెస్ (జీఎంఎస్)ను ప్రిఇన్‌స్టాల్ చేయడం సాధ్యం కాలేదని హువావే కంజ్యూమర్ డివైసెస్ చీఫ్ రిచర్డ్ యూ ప్రకటించారు. ఈ నిషేధం వల్ల హువావే మొబైల్ సర్వీసెస్ (హెచ్‌ఎంఎస్) కోర్‌ను వాడాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ ఫోన్లలో వాడేందుకు అనువైన యాప్‌లు అభివృద్ధిచేసేలా డెవలపర్లను ప్రోత్సహించేందుకు వంద కోట్ల డాలర్లు కేటాయించామని ఆయన తెలిపారు. తమ టెక్నాలజీని 45 వేలకు పైగా యాప్‌లు ఇంటిగ్రేట్ చేసుకున్నాయన్నారు. ఆ యాప్‌ల వివరాలేవీ వెల్లడించలేదు.
శాంసంగ్ తర్వాత స్థానం హువావేదే
గత సంవత్సరం స్మార్ట్‌ఫోన్ల విక్రయ సంస్థల్లో శామ్‌సంగ్ తర్వాత హువావే రెండో అతిపెద్ద సంస్థగా నిలిచింది.
తమ స్మార్ట్‌ఫోన్లకు 2018 జనవరి నుంచి ఆగస్టు వరకున్న డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే ఎనిమిది నెలల కాలంలో డిమాండ్ 26 శాతం పెరిగిందని రిచర్డ్ చెప్పారు.
అమెరికా నిషేధం తర్వాత ఐరోపాలో హువావే విక్రయాలు పడిపోవడం మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, HUAWEI
"ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అభివృద్ధికి, పశ్చిమ ఐరోపాలాంటి కీలక మార్కెట్లలో వృద్ధికి గత పదేళ్లుగా హువావే వందల కోట్ల డాలర్లు వెచ్చింది. అలాంటి సంస్థ ప్రధానమైన ఫోన్లకు గూగుల్ నుంచి పూర్తి సహకారం లభించకపోవడమన్నది పెద్ద దెబ్బే"అని సీసీఎస్ ఇన్‌సైట్ కన్సల్టెన్సీకి చెందిన బెన్ వుడ్ వ్యాఖ్యానించారు.
అమెరికా ఆంక్షలను అధిగమించేందుకు హువావేకు కొన్ని మార్గాలు ఉంటే ఉండొచ్చని, కానీ ఈ ఫోన్లను వినియోగదారులు ఆదరించేలా చూడటం సంస్థకు చాలా కష్టమైన పనని బెన్ వుడ్ అభిప్రాయపడ్డారు. నిత్యం వాడే యాప్‌లు అందుబాటులో లేకపోవడం గురించి వినియోగదారులు ఆలోచిస్తారని చెప్పారు.
ఈ ఆంక్షల ప్రభావం చైనాలో హువావే అమ్మకాలపై ప్రభావం చూపకపోవచ్చు. చైనాలో ప్రత్యర్థుల కన్నా హువావే బాగా ముందుంది. గూగుల్ సర్వీస్‌లలో చాలా వాటిపై చైనాలో నిషేధం ఉంది. అక్కడ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ వాడరు.
హువావే నమ్మకం ఏమిటి?
ఐఫోన్ 11, శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ఫోన్లకు పోటీగా హువావే ఈ ఫోన్లను విడుదల చేసింది.
మేట్ 30, 30 ప్రో ఫోన్లలో కొన్ని అసాధారణ ఫీచర్లు ఉన్నాయని, వీటిని దృష్టిలో ఉంచుకొని అమెరికా ఆంక్షల పర్యవసానంగా కలిగే అసౌకర్యాన్ని వినియోగదారులు పట్టించుకోరని హువావే సంస్థ ఆశిస్తోంది.
ప్రపంచంలో రెండో తరం 5జీ ఫోన్లలో ఇవే మొదటివని సంస్థ చెబుతోంది. పోటీపడే ఇతర మోడళ్లతో పోలిస్తే అధిక బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన ఇంటర్నెట్ పొందే వెసులుబాటు లాంటి ప్రత్యేకతలు తమ ఫోన్లలో ఉన్నాయంటోంది.
శాంసంగ్ నోట్ 10+ 5జీతో పోలిస్తే తమ ఈ ఫోన్లలో డేటా 50 శాతం వరకు ఎక్కువ వేగంతో డౌన్లోడ్ అవుతుందని రిచర్డ్ యు చెప్పారు. అత్యధిక వేగంతో డేటా డౌన్లోడ్ చేసే 4జీ ఫోన్లతో పోలిస్తే 25 రెట్లు ఎక్కువ వేగంగా ఇవి డేటాను డౌన్లోడ్ చేస్తాయన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మేట్ 30 ప్రో: నాలుగు కెమెరాలు
మేట్ 30 ప్రో మోడల్ ఫోన్ వెనక వైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.
సూపర్ సెన్సింగ్ కెమెరా: సాధారణం కంటే పెద్దదైన సెన్సర్‌తో కూడిన 40 మెగాపిక్సెల్ (ఎంపీ) కెమెరా ఉంది. ఈ 'సూపర్ సెన్సింగ్' కెమెరాతో తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫొటోలు తీయొచ్చు.
3ఎక్స్ ఆప్టికల్ కెమెరా: 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో ఉన్న 8 ఎంపీ కెమెరా రెజల్యూషన్‌తో రాజీపడకుండా జూమ్ చేసి ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది.
సినీ కెమెరా: వీడియో చిత్రీకరణ కోసమే ప్రత్యేకంగా 40 ఎంపీ సినీ కెమెరా ఉంది. వీడియోలను సాధారణంగా వైడ్‌స్క్రీన్ ఫార్మాట్‌లో చూస్తారు. దీనికి తగినట్లుగా వీడియోను చిత్రీకరించే ఈ కెమెరాను 'సినీ కెమెరా'గా హువావే వ్యవహరిస్తోంది.
3డీ డెప్త్-సెన్సింగ్ కెమెరా: స్టిల్ ఫొటోలకు, వీడియో బ్యాక్‌గ్రౌండ్‌కు మరింత రియలిస్టిక్ బ్లర్ ఎఫెక్ట్‌ను తీసుకురావడానికి ఉపయోగపడే డేటాను ఈ కెమెరా అందిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మేట్ 30 ఫీచర్లు ఇవీ
మేట్ 30 ఫోన్లో మూడు కెమెరాలు ఉన్నాయి. మేట్ 30 ప్రో ఫోన్లో ఉండే 40 మెగాపిక్సెల్ (ఎంపీ) 'సూపర్ సెన్సింగ్' కెమెరా మేట్ 30 ఫోన్లోనూ ఉంది. మేట్ 30లో 16 ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా, నాణ్యమైన పోట్రయిట్ల కోసం 8 ఎంపీ టెలిఫోటో కంపోనెంట్ ఉన్నాయి.
ఈ రెండు మోడళ్లలో కిరిన్ 990 ప్రాసెసర్ ఉంది. ఇది ప్రాసెసింగ్‌ను, 5జీ మోడెమ్‌ను ఒకే చిప్‌పై ఇంటిగ్రేట్ చేస్తుంది.
'హువావే విజన్' పేరుతో ఒక స్మార్ట్ టీవీని కూడా హువావే ఆవిష్కరించింది. దీనికి పాప్-అప్ కెమెరా ఉంది. వీడియో కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్మార్ట్ వాచ్, వైర్‌లైన్ ఇయర్ బడ్స్‌లను కూడా సంస్థ ఈ కార్యక్రమంలో విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి:
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- నోకియా 9 ప్యూర్‌వ్యూ: ఐదు కెమెరాలతో ఫొటో తీసే స్మార్ట్ ఫోన్
- చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








