టెక్నాలజీలో మార్పులు: వర్చువల్ రియాలిటీకి ఆగ్మెంటెడ్ రియాలిటీకి తేడా ఏంటంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సాయిరాం జయరామన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో అత్యంత వేగంగా మారుతున్న అంశాల్లో టెక్నాలజీ ఒకటి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయి. వాటిల్లో ఇవి కొన్ని...
వచ్చేస్తోంది 5జీ
భారత్‌లో ఇంకా 4జీ టెక్నాలజీనే పూర్తి వేగాన్ని అందుకోలేదు. కానీ ఇతర దేశాలు మాత్రం వడివడిగా 5జీ వైపు అడుగేస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘క్వాల్‌కామ్’ అనే కంపెనీ ఇటీవల అత్యాధునిక యాంటెనాలను తయారు చేసింది. వీటి సాయంతో మొబైల్ ఫోన్లు 5జీ తరంగాలను సులువుగా అందుకోగలవు.
కేవలం మొబైల్ ఫోన్లు 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తే సరిపోదు. దాని కోసం శాటిలైట్ సిగ్నల్ టవర్లను ఆధునికీకరించాలి. అమెరికాలో 4జీ వినియోగదార్ల ఇంటర్నెట్ స్పీడ్ సగటున 71ఎంబీపీఎస్‌గా ఉంది. కానీ ఇప్పుడది 2వేల శాతం అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం అక్కడ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 5జీ ఫోన్లలో 1.4జీబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వచ్చింది.
క్వాల్‌కామ్ కొత్తగా అభివృద్ధి చేసిన యాంటెనాల వల్ల ఇప్పుడు 5జీ ఫోన్లు ఆ వేగాన్ని సులువుగా అందుకోగలవు.
ఈ చిన్న యాంటెనాలను ఫోన్‌కు నాలుగు వైపులా అమర్చడం ద్వారా ఫోన్ 5జీ స్పీడ్‌ను అందుకుంటుంది. 2019 నాటికి ఫోన్ లోపలే ఇన్‌బిల్ట్‌గా ఈ యాంటెనాలు అందుబాటులోకి వస్తాయని క్వాల్‌కామ్ చెబుతోంది.

జీమెయిల్‌తో జాగ్రత్త
గత ఏప్రిల్‌లో జీమెయిల్ కొన్ని కొత్త ఫీచర్లను తన ఈమెయిల్‌లో అందుబాటులోకి తెచ్చింది. అందులో ‘కాన్ఫిడెన్షియల్’ మోడ్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఈ మోడ్‌లో మెయిల్‌ను పంపితే అవతలి వ్యక్తి దాన్ని ఫార్వర్డ్ చేయలేడు. కాపీ చేయడానికి, ప్రింట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అవసరమనుకుంటే ఈమెయిల్‌కు పాస్‌వర్డ్‌తో పాటు ఎక్స్‌పైరీ డేట్ కూడా పెట్టుకోవచ్చు.
కానీ ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ వల్ల వినియోగదార్ల వ్యక్తిగత సమాచారం రిస్కులో పడే అవకాశం ఉందని ‘ఈఎఫ్ఎఫ్’(ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్) అనే సంస్థ చెబుతోంది. జీమెయిల్ ద్వారా పంపే ఈమెయిళ్లకు ఎన్‌క్రిప్షన్ ఉండదనీ, కాబట్టి ఎవరైనా వాటిని చదివే అవకాశం ఉందనీ ఆ సంస్థ అంటోంది. ఉదాహరణకు వాట్సాప్, మెసెంజర్, వైబర్ లాంటి యాప్స్ ద్వారా పంపే సందేశాలు ఎన్‌క్రిప్ట్ అవుతాయి. వాటిని యాప్ డెవలపర్‌తో పాటు ప్రభుత్వం కూడా చదవడానికి వీలుండదు.
వీటికి తోడు జీమెయిల్ సందేశాలను స్క్రీన్ షాట్ తీసుకోవచ్చని, మెయిల్ గడువు పూర్తయ్యాక కూడా దాన్ని చదివే అవకాశం జీమెయిల్ సంస్థకు ఉంటుందని ఈఎఫ్ఎఫ్ చెబుతోంది. జీమెయిల్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌లో ఎస్.ఎం.ఎస్ పాస్‌కోడ్ ఆప్షన్‌ను వాడటం ద్వారా వినియోగదారుడికి తెలీకుండానే అతడి ఫోన్ నంబర్ గూగుల్‌కు చేరే అవకాశం కూడా ఉందని ఈఎఫ్ఎఫ్ హెచ్చరిస్తోంది.

ఒకే రాకెట్ మళ్లీ మళ్లీ...
భూమిపైన ఎన్నో అవసరాలకు శాటిలైట్లు కావాలి. రాకెట్లు ఆ శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వదిలేస్తాయి. ఆ తరవాత ఖాళీ రాకెట్లు అంతరిక్షంలోనే చెత్తలా పేరుకుపోతాయి.
అందుకే, చాలా కంపెనీలు పునర్వినియోగ రాకెట్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి అందుబాటులోకి వస్తే రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లాక ఉపగ్రహాలను వదిలేసి, తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల రాకెట్ల ఉత్పత్తి ఖర్చుతో పాటు అంతరిక్షంలో పేరుకుపోయే వ్యర్థాలు కూడా తగ్గుతాయి.
స్పేస్ ఎక్స్ సంస్థ చాలా కాలంగా ఇలాంటి టెక్నాలజీపైనే పని చేస్తోంది. ఈమధ్యే అది ‘టెల్‌స్టర్19 వాంటేజ్’ ఉపగ్రహాన్ని ఫాల్కన్ 9 బ్లాక్ 5 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపింది. ఆ ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాల్లోనే ఫాల్కన్ తిరిగి భూమ్మీదకు వచ్చి అట్లాంటిక్ మహా సముద్రంలో కూలింది.
ఈ ప్రయోగం ద్వారా ‘రీ యూజబుల్ రాకెట్’లను అభివృద్ధి చేయాలన్న ప్రయత్నంలో స్పేస్ ఎక్స్ విజయం సాధించినట్లయింది.
గతంలో బ్లాక్ 4 పేరుతో ఇదే సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్లు కొన్నిసార్లు మాత్రమే పనికొచ్చేవి. కానీ ఈ కొత్త రాకెట్లు భద్రంగా భూమికి తిరిగొస్తే కొన్ని వందల సార్లు వీటిని వినియోగించొచ్చని ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ చెబుతోంది.

మీకు తెలుసా?: ఆగ్మెంటెడ్ రియాలిటీకి, వర్చువల్ రియాలిటీకి తేడా
వర్చువల్ రియాలిటీ
ఒక్కసారి వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్‌ను తొడుక్కుంటే అది మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఉదాహరణకు ఆ పరికరం సాయంతో హిమాలయాల్లో విహరించినట్లు, తాజ్ మహల్‌ను చుట్టినట్లు, వైట్ హౌజ్‌లోని ఒక్కో గదిలోకి వెళ్లినట్లు అనుభూతి పొందొచ్చు. మనిషి శారీరకంగా ఎక్కడికీ కదలకుండా, కావల్సిన ప్రాంతంలో విహరించిన అనుభూతిని వర్చువల్ రియాలిటీ పంచుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, కాళ్లు ఉన్నచోటనే ఉంటాయి, కళ్లు మాత్రం ప్రపంచాన్ని చుట్టేస్తాయి. అదే వర్చువల్ రియాలిటీ.

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్మెంటెడ్ రియాలిటీ
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటడ్ రియాలిటీ.. రెండూ ఒక్కటే అని చాలా మంది అనుకుంటారు. కానీ వర్చువల్ రియాలిటీలో మనం వెళ్లని ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఓ కొత్త ప్రపంచం మన కళ్ల ముందుకొస్తుంది. ఉదాహరణకు ఓ టీచర్ విద్యార్థులకు సౌర కుటుంబాన్ని చూపించాలనుకుంటే, టెక్నాలజీ సాయంతో ఆ సౌర కుటుంబాన్ని ఓ గదిలోనే సృష్టించొచ్చు.
పోకెమాన్ గో ఆట ఆగ్మెంటెడ్ రియాలిటీకి ఓ మంచి ఉదాహరణ. అందులో ఆటలోని వస్తువులు కూడా బయటి ప్రపంచంలోకి వచ్చినట్టు కనిపిస్తాయి. అలాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీతో నిండిన ఆటలు ఇటీవలి కాలంలో చాలా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- యూట్యూబ్ వీడియోలు చూసి కాన్పు, గర్భిణి మరణం: ఇంటి దగ్గర ప్రసవం మంచిదేనా?
- వండర్ గర్ల్ హిమాదాస్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాల్సి వచ్చింది
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- 2050 నాటికి అతి పెద్ద పది సవాళ్లివే!
- ‘ప్రపంచ భాష ఇంగ్లిష్’కు రోజులు దగ్గరపడ్డాయా!
- ఇంటర్నెట్ ప్రకటనలు: ఎలా మొదలయ్యాయి? ఎలా ఇబ్బంది పెడుతున్నాయి? ఇకపై ఏమవుతాయి?
- #గమ్యం: విమానాశ్రయాల్లో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










