విశాఖపట్నం ఎంఎస్ఎంఈలపై ఆర్థికమాంద్యం ప్రభావం: ‘ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి’

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్టణంలోని ఓ పెయింట్స్ గోదాములో రాము దినసరి కూలీ. గాజువాకలోని ఆటోనగర్‌లో ఈ గోదాము ఉంది.
పెయింట్స్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బాలను వేర్ హౌస్‌లకు తీసుకువెళ్లే బళ్లలో ఎక్కించడం రాము పని.
నాలుగు నెలల క్రితం వరకూ రోజుకు రూ.500-600 వరకూ ఆయన సంపాదించునేవారు.
కానీ, గత మూడు నెలలుగా పనులు సరిగ్గా లేవు. ఇప్పుడు రోజుకు కనీసం రూ.150 కూలీ రావడం కూడా గగనమైపోయిందని రాము వాపోతున్నారు.
ఆటోనగర్‌లోనే ఉన్న ఓ వెల్డింగ్ యూనిట్‌లో పనిచేస్తున్న రామభద్రానిది కూడా ఇదే పరిస్థితి.
గతంలో ఆయనకు రోజూ పని ఉండేది. అప్పుడప్పుడు ఓవర్ టైమ్ చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవారు.
ఇప్పుడు వారంలో నాలుగైదు రోజులే పని దొరకుతోందని రామభద్రం అంటున్నారు.
విశాఖ నగరంపై ఇప్పుడిప్పుడే ఆర్థిక మాంద్యం చూపుతున్న ప్రభావం ఆనవాళ్లు ఇవి.
చిన్న పరిశ్రమలపై మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మూతపడేంత తీవ్రమైన పరిస్థితి లేకపోయినా, ఒకప్పటిలా కార్మికులకు చేతినిండా పని మాత్రం దొరకడం లేదు.
పరిశ్రమలే విశాఖ ఊపిరి
హెచ్‌పీసీఎల్, స్టీల్ ప్లాంట్, పోర్ట్, బీహెచ్ఈఎల్ వంటి సంస్థలు, ఆటోనగర్‌తో విశాఖ పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందింది.
భారీ పరిశ్రమలకు చిన్న పరికరాలు, విడి భాగాలు అందించే చిన్న చిన్న పరిశ్రమలు అవసరం. అలా నగరంలో అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటి సంస్థలు 2500 వరకు ఉంటాయని ఒక అంచనా.
వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా 25 వేల మంది, పరోక్షంగా మరో 40 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సంస్థల టర్నోవర్ ఏడాదికి సుమారు రూ.2500 కోట్ల వరకు ఉంటుంది.

తగ్గిపోయిన ఆర్డర్లు
ఆటోనగర్‌లో ఉన్న పరిశ్రమల్లో ఎక్కువ శాతం స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఉండేవే.
కొద్ది కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనధికారికంగా పర్చేజ్ హాలిడేను అమలు చేస్తోంది. దీంతో ఈ పరిశ్రమలకు ఆర్డర్లు లేకుండా పోయాయి.
ఇప్పటికిప్పుడు చిన్న సంస్థల్లో ఉద్యోగాలు తీసేసే పరిస్థితి లేకపోయినా, భవిష్యత్‌లో వారంలో కొద్ది రోజులు పాటూ పని కల్పించలేని పరిస్థితి రావొచ్చని విశాఖ చిన్నతరహా పరిశ్రమల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలాజీ బీబీసీతో చెప్పారు.
లలితా మ్యానుఫ్యాక్చర్స్ అనే పరిశ్రమను ఆయన నడుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే ఆర్డర్ల ఆధారంగా ఆ పరిశ్రమలో ఉత్పత్తి జరుగుతుంది.
స్టీల్ ప్లాంట్ నుంచి కొద్ది కాలంగా ఆర్డర్లు లేవని, దీంతో ఉత్పత్తిని కొంత తగ్గించామని బాలాజీ వెల్లడించారు.

ఆటోనగర్‌లో శ్రీ వెంకటసాయి వెల్డింగ్ షాపులో గతంలో కార్మికులకు ఓటీలు చెల్లించి పనిచేయించుకునేవారు.
ఆ షాపులో ఐదుగురు ఉపాధి పొందుతున్నారు.
ఆర్డర్లు లేకపోవడంతో ఇప్పుడు వారికి వారంలో ఐదు రోజులు మాత్రమే పని కల్పిస్తున్నామని సంస్థను నడుపుతున్న కొండా అచ్చిబాబు చెప్పారు.
నగరంలోని అనేక చిన్న పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితే ఉంది.

ఆరేళ్లుగా సమస్యలు
ఆరేళ్లుగా విశాఖపట్టణంలోని చిన్న పరిశ్రమలకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది.
మొదట్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేది.
ఆ తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు పరిశ్రమలకు ఇబ్బందిగా మారాయి. రాష్ట్ర విభజన వల్ల ఆర్డర్లు తగ్గాయి.
దాని నుంచి తేరుకునే సమయంలో హుద్‌హుద్ తుపాను వచ్చింది. తిరిగి నిలదొక్కుకుంటున్న సమయంలో నోట్ల రద్దు, ఆ తరువాత జీఎస్టీ అమలు.. ఇలా పరిశ్రమలకు తేరుకునే అవకాశమే రాలేదు.
ఇప్పుడు మాంద్యం మళ్లీ చిన్న పరిశ్రమలకు సమస్యగా మారింది.

చిన్న పరిశ్రమలకు, పెద్ద పరిశ్రమలకు భారీ స్థాయిలో బిల్లులు పెండింగ్ లో ఉండిపోవడంతో మార్కెట్‌లో నగదు రొటేషన్ తగ్గిపోయిందని సీఐఐ ఏపీ అధ్యక్షుడు సాంబశివరావు అన్నారు.
''బ్యాంకులు కూడా లోన్ల విషయంలో చిన్న పెట్టుబడిదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రూ.వేల కోట్లు ఎగ్గొట్టే వారి పట్ల ఉదాసీనంగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలూ మారిపోతుండటంతో పరిశ్రమలకు ఇక్కట్లు తప్పడం లేదు'' అని ఆయన చెప్పారు.
హెచ్‌పీసీఎల్, విశాఖ పోర్ట్ లాంటి సంస్థలు చిన్న పరిశ్రమలకు భారీగా పనులు కల్పిస్తే సమస్య ఉండదని సాంబశివరావు అభిప్రాయపడ్డారు.
''గతంలో ఆర్థిక మాంద్యం ఉన్నా, ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల నగదు ప్రవాహం ఆగలేదు. దీంతో మాంద్యం ప్రభావం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మార్కెట్లో ఇసుక దొరక్కపోవడం వల్ల దినసరి కూలీలకూ పనులు లేకుండా పోయాయి'' అని సాంబశివరావు వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- ‘ఆర్థికవ్యవస్థను మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది.. ఇది మానవ కల్పిత సంక్షోభం’
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- నిర్మలా సీతారామన్: ఆంధ్రాబ్యాంక్ ఇక కనుమరుగు.. అయిదేళ్ల కనిష్ఠానికి జీడీపీ
- ఆర్థిక వృద్ధి అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి
- అనుష్కతో హానీమూన్‌కు సంబంధించి కోహ్లీ బయటపెట్టిన ఆసక్తికర విషయం ఏమిటి?
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లు ఎందుకు హత్యకు గురవుతున్నారు
- ఇందిరాగాంధీ హత్య: అంగరక్షకులే ఆమెను చంపేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










