ఆర్థిక మందగమనం: ఉక్కు రంగ కార్మికులకు చిక్కులు ఎందుకు.. పరిశ్రమల్లో ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవి ప్రకాశ్
- హోదా, జంషెద్‌పుర్ నుంచి, బీబీసీ కోసం
బిహార్‌లోని సొంతూరును వదిలి ఉపాధి వెతుక్కుంటూ 1989లో జంషెద్‌పుర్‌కు వచ్చారు ముఖేశ్ రాయ్. ఐరన్ కట్టింగ్ యంత్రం నడపడం నేర్చుకుని వై-6 కేటగిరీ ఉద్యోగిగా మారారాయన. వై-6 అంటే కాంట్రాక్టు ఉద్యోగం. కూలీ రోజూ వారీగానే చెల్లిస్తారు. కానీ, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ప్రయోజనాలు మాత్రం ఉంటాయి.
ముఖేశ్ రాయ్‌కి ఇప్పుడు 52 ఏళ్లు. కానీ, రెండు నెలలుగా ఆయనకు ఉద్యోగం లేదు. ఆయన పనిచేస్తున్న 'మాల్ మెటాలిక్స్' సంస్థలో ఉత్పత్తి నిలిచిపోయింది.
దీంతో ఆయనకు ఉపాధి లేకుండా పోయింది. చివరగా జులై 8న ఆయన పని మీదకు వెళ్లారు. ఆ నెలలో పనిచేసిన ఎనిమిది రోజుల జీతం (రూ.3,500) కూడా ఆయనకు ఇంతవరకూ అందలేదు. ముఖేశ్ రాయ్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
రాయ్ భార్య రిందు దేవి గతంలో పొదుపు చేసిన డబ్బు కూడా ఖర్చైపోయింది. ఆమె నగలు తాకట్టు పెట్టి తీసుకువచ్చిన డబ్బుతో ప్రస్తుతం వారికి పూట గడుస్తోంది.
రాయ్, రిందుల కుమారుడు 12వ తరగతి చదువుతున్నాడు. చికెన్ తినాలన్న అతడి కోరికను మూడు నెలలుగా ఆ కుటుంబం తీర్చలేకపోతోంది.
గతంలో తామెప్పుడూ ఇలాంటి దుస్థితి ఎదుర్కోలేదని రిందు దేవీ బీబీసీతో చెప్పారు.
టాటా ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి తగ్గిపోయిందని, ఫలితంగా దానికి అనుబంధంగా పనిచేసే సంస్థల కార్యకలాపాలు ఆగిపోయాయని కాంట్రాక్టర్ తనకు చెప్పినట్లు ముఖేశ్ రాయ్ అన్నారు.
''జులై పోయింది. ఆగస్టు పోయింది. సెప్టెంబర్, అక్టోబర్‌ల్లోనైనా పని ఉంటుందా అన్నది చెప్పేవారు ఎవరూ లేరు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, EPA
ఉపాధి కోల్పోయిన వేలాది మంది
ఉక్కు రంగం ఇటీవల నెమ్మదించింది. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, ఆర్సెలర్ మిత్తల్ వంటి భారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి.
ఫలితంగా వందల సంఖ్యలో చిన్న సంస్థల్లో ఉత్పత్తి ఆగిపోయింది. కొన్ని మూతపడ్డాయి.
ఆదిత్యపుర్ పారిశ్రామిక ప్రాంతంలో ఇండక్షన్ ఫర్నేస్‌ల పనులు చేసే 30కిపైగా చిన్న సంస్థలున్నాయని, వాటి కార్యకలాపాలు ఆగిపోయాయని ఆదిత్యపుర్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందర్ అగర్వాల్ చెప్పారు.
ఝార్ఖండ్ ప్రభుత్వం ఒక్కసారిగా విద్యుత్ ధరలను 38% మేర పెంచడం కూడా ఇందుకు ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాంచీ, రామ్‌గఢ్‌ల్లోని చాలా సంస్థల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది.
ఝార్ఖండ్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 70వేలకుపైగా మందికి ఉపాధి లేకుండా పోయిందని లఘు ఉద్యోగ్ భారతి అధ్యక్షుడు రూపేశ్ కతియార్ చెప్పారు.
ఈ 70వేల మందిలో ముఖేశ్ రాయ్ ఒకరు.
మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఉక్కు ఉత్పత్తితో సంబంధమున్న సంస్థలన్నీ ఈ మందగమనాన్ని అధిగమించే దారుల కోసం వెతుకుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఝార్ఖండ్‌పైనే ఎక్కువ ప్రభావం
టాటా గ్రూప్ సంస్థల్లో ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఝార్ఖండ్ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఇండస్ట్రీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అనిల్ కుమార్ అన్నారు.
''డిమాండ్ తగ్గిపోయింది. ఆదిత్యపుర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 50వేల మంది దాకా నిరుద్యోగం ఎదుర్కొంటున్నారు. వారిలో చాలా మంది కిందిస్థాయి కార్మికులు, రోజూవారీ కూలీలు'' అని ఆయన చెప్పారు.
మార్కెట్‌లో నగదు కొరతే తాజా మందగమనానికి కారణమని ఆదిత్యపుర్ ఇండస్ట్రియల్ ఏరియా స్మాల్ ఇండస్ట్రీ అసోసియేషన్ కార్యదర్శి దీపక్ డొకానియా అన్నారు.
''మార్కెట్‌లో డబ్బు లేదు. పెట్టుబడి లేకపోతే ఉత్పత్తి ఎలా కొనసాగుతుంది. నేను బీఎంసీ మెటల్‌కాస్ట్ లిమిటెడ్ అనే కంపెనీ నడుపుతున్నా. అందులో 400 మంది ఉద్యోగులున్నారు. వారిలో 50 నుంచి 60 మందికి ఇప్పుడు రావొద్దని చెప్పేశాం. మాకు ఇంకో దారిలేకపోయింది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ANI
ఉక్కు ఉత్పత్తి ఎందుకు తగ్గింది?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కొన్ని రోజుల క్రితం టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఉక్కు రంగంలో మందగమనానికి ఆటోమొబైల్ రంగంతో సంబంధం ఉందని చెప్పారు.
దీని కారణంగా టాటా స్టీల్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో కోత పెట్టుకోవాల్సి వచ్చింది.
ఆర్థిక మందగమనం, వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత గురించి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆగస్టు 23న నిర్మలా సీతారామన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆటోమొబైల్ రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు 2020 మార్చి 31లోపు కొనుగోలు చేసిన బీఎస్-4 వాహనాలు వాటి రిజిస్ట్రేషన్ కాలపరిమితి వరకూ వాడుకలో ఉంటాయని, వాటిపై వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ విధింపును కూడా 2020 వరకూ వాయిదా వేస్తున్నామని ఆమె ప్రకటించారు.
పాత వాహనాలకు సంబంధించి కొత్త స్క్రాపేజ్ విధానాన్ని తెస్తామని కూడా ఆమె తెలిపారు.
వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథకాలను తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
''ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి 12 శాతం మేర తగ్గింది. ఆటోమోటివ్ ఉక్కు మార్కెట్‌పై దీని ప్రభావం పడింది. భారత్‌లో ఉత్పత్తయ్యే ఉక్కులో 20 శాతం మేర ఆటోమొబైల్ రంగమే వినియోగిస్తోంది. అయితే, ఈ పరిణామం ప్రభావం అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌పై పడలేదు. మందగమన ప్రధాన ప్రభావాలు దేశీయ మార్కెట్‌పైనే కనిపిస్తున్నాయి'' అని టీవీ నరేంద్రన్ అన్నారు.

ఫొటో సోర్స్, PTI
ఈ మందగమనం ఎంతకాలం?
ఈ మందగమనం నుంచి మార్కెట్ కోలుకోవడానికి ఐదారు నెలలు పట్టవచ్చని సింఘ్‌భుమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, పారిశ్రామికవేత్త రాహత్ హుస్సేన్ అన్నారు.
ఉక్కు రంగానికి ఆటో పరిశ్రమ, నిర్మాణ రంగం (రియల్ ఎస్టేట్) నుంచే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఇప్పుడు, భారీ నిర్మాణ ప్రాజెక్టులకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ప్రణాళికలు వేయట్లేదు. ఈ పరిస్థితిలో, ఉక్కు ఉత్పత్తి తగ్గడం సహజం.
"ఉక్కు పరిశ్రమ అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్తోంది. ఈ మందగమనాన్ని పరిష్కరించేందుకు మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి. లేదంటే, పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది" అని రాహత్ హుస్సేన్ బీబీసీతో అన్నారు.
ఇదిలా ఉండగా, ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా పనిచేసే ఇండక్షన్ ఫర్నేస్ కంపెనీలకు విద్యుత్ బిల్లుల్లో రాయితీలు ఇస్తున్నట్లు ఝార్ఖండ్ ప్రధాన కార్యదర్శి డి.కె తివారి తెలిపారు.
రాబోయే నాలుగు నెలల వరకు అది కొనసాగుతుంది. ఆ రాయితీలతో ఈ సంస్థల ఖర్చులు తగ్గుతాయి. ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి వీలుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ సంస్థలపైనా ప్రభావం
ఉక్కు పరిశ్రమలో మందగమనం ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) పై కూడా పడింది. ఈ సంస్థ నికర లాభంలో భారీ తగ్గుదల కనిపించింది.
సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ... గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ .15,473 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ మొత్తం అమ్మకాలు రూ .14,645 కోట్లకు తగ్గాయని చెప్పారు.
ఝార్ఖండ్‌లోని బొకారోలో సెయిల్‌కు స్టీల్ ప్లాంట్ ఉంది. ఇక్కడి కొందరు ఉద్యోగులు కూడా తమకు పని దొరకడం లేదని ఫిర్యాదులు చేశారు.
ఆర్థిక మంత్రి చూపుతున్న చొరవ మందగమనాన్ని అధిగమించడంలో ఉక్కు పరిశ్రమకు దోహదపడుతుందని టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ అన్నారు. మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆర్థికవ్యవస్థను మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది.. ఇది మానవ కల్పిత సంక్షోభం’
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- డెబిట్ కార్డులు, ఏటీఎంలు త్వరలో కనిపించకుండా పోతాయా...
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- ఏనుగుల దెబ్బకు భయపడి చెట్లపై బతుకుతున్నారు
- స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- ప్రభాస్ సాహో: ‘తెలుగు దర్శకులారా.. కాపీ కొట్టినా, సరిగ్గా కొట్టండి’ - లార్గో వించ్ డైరెక్టర్ తాజా ట్వీట్
- ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








