ప్రభాస్ సాహో: ‘తెలుగు దర్శకులారా.. కాపీ కొట్టినా, సరిగ్గా కొట్టండి’ - లార్గో వించ్ డైరెక్టర్ తాజా ట్వీట్

ఫొటో సోర్స్, facebook/SaahoTheMovie
తెలుగు సినీ నటుడు ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాపై ఫ్రెంచ్ సినీ దర్శకుడు జెరోమ్ సాలే చేస్తున్న ట్వీట్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
అయితే, ‘కాపీ కొట్టినా సరిగ్గా కొట్టండి’ అనే అర్థం వచ్చేలా ఆయన వ్యంగ్యంగా చేసిన తాజా ట్వీట్‌పై ట్విటర్ యూజర్లు మండిపడుతున్నారు.

ఫొటో సోర్స్, twitter/Jerome_Salle
‘‘లార్గో వించ్ నుంచి ఉచితంగా కాపీ కొట్టిన (ఫ్రీమేక్) రెండో సినిమా కూడా మొదటి సినిమాలాగే బాగోలేదనిపిస్తోంది. కాబట్టి, తెలుగు దర్శకులారా, మీరు నా పనిని దొంగిలించాలనుకుంటే.. దయచేసి సరిగ్గా దొంగిలించండి’’ అంటూ ఆదివారం చేసిన ఈ తాజా ట్వీట్‌లో జెరోమ్ సాలే పేర్కొన్నారు.
సాహో సినిమా ఆశించిన స్థాయిలో లేదని, దీనిపై లార్గో వించ్ డైరెక్టర్ కూడా స్పందించాడంటూ వచ్చిన ఒక కథనాన్ని కూడా ఈ ట్వీట్‌కు జెరోమ్ జత చేశారు.
సినిమా విడుదలైన రెండో రోజే ఆయన సాహోపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
'భారత్‌లో నాకు మంచి కెరీర్ ఉంటుందేమో' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, twitter/Jerome_Salle
శుక్రవారం నాటి తొలి ట్వీట్‌పై తాజా ట్వీట్‌లో జెరోమ్ వివరణ ఇస్తూ.. ‘‘భారతదేశంలో నా కెరీర్’ ట్వీట్ వ్యంగ్యంగా చేసిందే, నన్ను మన్నించండి. కానీ, నేనేమీ చేయలేను’’ అని ఈసారి మరింత వ్యంగ్యాన్ని జోడించారు.
ఇంతకీ ‘లార్గో వించ్’ కథేంటి? ఈ సినిమా హిట్టా? ఫట్టా?
ఐఎండీబీ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక కోటీశ్వరుడు హత్యకు గురవుతాడు. అతను రహస్యంగా పెంచుకున్న పెంపుడు కొడుకు.. తండ్రికి తానే చట్టబద్ధమైన వారసుడినని నిరూపించుకుని, తన తండ్రి ఆర్థిక సామ్రాజ్యాన్ని ఆ హంతకులు స్వాధీనం చేసుకోకుండా కాపాడుకోవాల్సి వస్తుంది.
ఈ రివేంజ్ స్టోరీ చిత్రం ఫ్రాన్స్‌లో 2008 డిసెంబర్ 17వ తేదీన విడుదలైంది. ఐఎండీబీ ఈ చిత్రానికి పదికి 6.5 రేటింగ్ ఇచ్చింది. దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో (2008 డిసెంబర్ 17 నాటికి డాలర్ రేటు ఆధారంగా) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సుమారు రూ. 145 కోట్లు రాబట్టింది.
ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ది బర్మా కాన్‌స్పిరసీ’ అనే చిత్రాన్ని కూడా జెరోమె సాలే తెరకెక్కించారు. 2011 ఫిబ్రవరి 16వ తేదీన విడుదలైన ఈ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో తెరకెక్కించగా.. బాక్సాఫీసు వద్ద విఫలమై కేవలం రూ. 63 కోట్లు రాబట్టగలిగింది. దీనికి ఐఎండీబీ వెబ్‌సైట్ 6.2 రేటింగ్ ఇచ్చింది.
పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’పైనా ఆరోపణలు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైనప్పుడు కూడా జెరోమ్ సాలే ఇలాగే ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, twitter/Jerome_Salle

ఫొటో సోర్స్, twitter/Jerome_Salle
పారిస్ నగరంలోని లా బ్రడే థియేటర్‌లో జనవరి 10వ తేదీన ఈ సినిమా చూసినట్లు, టికెట్‌ను ఫొటో తీసి ట్వీట్ చేశారు. "(థియేటర్‌లో) గొప్ప వాతావరణం.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాను బాగా ఇష్టపడేవాడినే.. దురదృష్టం కొద్దీ ఈ కథ నాకు బాగా తెలిసిందే" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, twitter/Jerome_Salle
లార్గో వించ్ దేశీయ హక్కులు టి-సిరీస్‌కు ఉన్నాయి. ఈ సంస్థ అజ్ఞాతవాసి నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపిందని, ఆ తరువాత ఇరువురి మధ్య సెటిల్‌మెంట్ జరిగిందని వార్తలు వచ్చాయి.
అయితే అజ్ఞాతవాసి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. టి-సిరీస్‌తో జరిగిన సెటిల్‌మెంట్ భారతదేశానికి మాత్రమే సంబంధించిందని తాజాగా జరోమ్ అన్నారు. మిగతా దేశాల సంగతేమిటని ట్విటర్ ద్వారా ప్రశ్నించారు.
అజ్ఞాతవాసి సినిమాకు ఐఎండీబీ వెబ్‌సైట్ 4.6 రేటింగ్ ఇచ్చింది. మీడియా కథనాల ప్రకారం చూస్తే.. రూ.80 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.95 కోట్లు వసూలు చేసింది.
మూడు రోజుల్లో సాహో కలెక్షన్ ‘రూ.294 కోట్లు’
కాగా, యూవీ క్రియేషన్స్ నిర్మించిన, కొత్త దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 29వ తేదీన విడుదలైంది.
మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.294 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా తీసేందుకు పెట్టిన ఖర్చు రూ.350 కోట్లు.
సాహో సినిమాకు ఐఎండీబీ వెబ్‌సైట్ 6.0 రేటింగ్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, twitter/praveendutt
కాగా, జెరోమ్ సాలే తాజా ట్వీట్‌పై ట్విటర్ యూజర్లు, సినీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
‘రెండు డిజాస్టర్‌లు (సినిమాలు) పడిన గొప్ప స్క్రిప్ట్ నీది. రెండు సార్లూ జనాలకి ఎక్కలేదు’ అంటూ సాహో, అజ్ఞాతవాసి హ్యాష్ ట్యాగ్‌లతో ప్రవీణ్ దత్ అనే యూజర్ జెరోమ్ సాలేకు రిప్లై ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు
- 'హలో.. సన్నీ లియోని స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు'
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- భార్యలను హత్య చేయగల భర్తలను ఇలా ముందే పసిగట్టవచ్చు
- ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








