ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది? - సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, uv creations/fb
- రచయిత, భవాని ఫణి
- హోదా, బీబీసీ కోసం
కథను అనేక మలుపులు తిప్పి ప్రేక్షకులను కట్టి పడెయ్యాలనుకున్న సాహో సినిమా, తను వేసుకున్న ముళ్లల్లో తానే చిక్కుకుని బోర్లా పడిపోయింది.
అంచనాల చెట్ల కొమ్మలు ఆకాశాన్నంటేసాయి కదాని, నేలనే ఆకాశమనుకోమనడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, సాహో ద్వారా జరిగిన ప్రయత్నం కూడా అలానే ఉంది. సినిమాను మరీ అంతగా నవ్వులపాలు చేయడంలో ముఖ్యపాత్రను పోషించినవి మాత్రం స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లే.
విపరీతమైన పాపులారిటీ ఉన్న ఒక హీరోను తీసుకొచ్చి, అతన్ని తన మీద తనే జోక్స్ వేసుకునే హుషారైన కుర్రాడిలా, ఆడపిల్లల వెంట తిరిగే అల్లరబ్బాయిలా, రౌడీలను చితక్కొట్టే సూపర్ మ్యాన్ లా పరిచయం చేసి, మెల్లమెల్లగా అతనిలోని మంచి మనసునూ, ఉన్నతమైన వ్యక్తిత్వాన్నీ, అంతులేని మేథో శక్తినీ, అనంతమైన ప్రేమ తత్వాన్నీ బయటపెట్టే క్రమంలో అతనికి చెందిన అసలు లక్ష్యాన్ని బహిర్గతం చేసుకుంటూ వెళ్లి, చివరికి ఆ ఉన్నతమైన లక్ష్యం చెంతకు అతడిని చేర్చడమే సాహో సినిమా అసలు ఉద్దేశ్యం.
కానీ, ఈ క్రమంలో అక్కడో ఇక్కడో తడబడ్డాడని చెప్పే వీల్లేకుండా, ఎక్కడికక్కడే అర్థం కానంత గందరగోళాన్ని సృష్టించారు దర్శకుడు. అనేక కాలగమనాలు లేకపోయినా, గతంలోకి, వర్తమానంలోకీ గెంతకపోయినా, క్లిష్టమైన కథాంశం కాకపోయినా, తెర మీద ఏం జరుగుతోందో తెలుసుకోవడం చాలా కష్టమైపోయేలా చేసింది ఈ సినిమాకు చెందిన అర్థరహితమైన కథన శైలి.

ఫొటో సోర్స్, UV Creations/fb
టూకీగా కథేమిటో చూస్తే, భారత్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఇక్కడి నేర ప్రపంచానికి నమూనాలాంటి వాజీ అనే కల్పిత నగరంలో, రెండు ముఠాల మధ్యన అధికారం కోసం తీవ్రమైన పోరు జరుగుతూ ఉంటుంది.
మరోపక్క ముంబయ్‌లో అతిపెద్ద దొంగతనాలను ఒంటి చేత్తో చేస్తున్న ఒక తెలివైన దొంగను పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అప్పుడే అండర్ కవర్ ఏజెంట్‌గా అశోక్ (ప్రభాస్) ఆ టీమ్ లోకి వస్తాడు. అమృత (శ్రద్ధా కపూర్) అనే పోలీస్ ఆఫీసర్‌తో ప్రేమలో పడతాడు. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో భారత దేశపు, వాజీ నగరపు కథలు రెండూ కలిసిపోతాయి.
ఆఖరి అరగంట సమయం సినిమా మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ దొంగతనాలు చేస్తోంది ఎవరు? ఎక్కడో ఉన్న వాజీ నగరానికీ, ముంబయ్ దొంగకూ సంబంధం ఏమిటి? ఆఖరికి వాజీ నగరంపై అధికారాన్ని ఏ ముఠా చేజిక్కించుకుంటుంది? వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలనిస్తూ సినిమా ముందుకు సాగుతుంది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 30న ఒకేసారి విడుదలైన ఈ సినిమా బాహుబలి తర్వాత రెండేళ్ల విరామంతో ప్రభాస్‌ను మళ్ళీ వెండి తెరమీదికి తీసుకొచ్చింది.
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్‌ను దక్షిణాది చిత్రాలకు పరిచయం చేసింది. రన్ రాజా రన్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించిన సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఫొటో సోర్స్, UV Creations/fb
సినిమాలోని నాలుగు పాటలనూ నలుగురు ప్రముఖ సంగీత దర్శకులు కంపోజ్ చేశారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను హైదరాబాద్, ముంబయ్, దుబయ్‌లతో పాటుగా ఇంకా కొన్ని ఇతర దేశాలలో కూడా చిత్రీకరించారు.
పెరల్ హార్బర్, ట్రాన్స్ఫార్మర్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు స్టంట్స్ ను సమకూర్చిన కెన్నీ బేట్స్ ఈ సినిమాకు స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించారు. జాకీష్రాఫ్, చంకీ పాండే, మందిరా బేడీ, ‘వెన్నెల’ కిషోర్, నీల్ నితిన్ ముఖేశ్ వంటి వివిధ భాషలకు చెందిన నటీనటులు సినిమాలోని ముఖ్య పాత్రలను ధరించారు.
సినిమాలో అసలేం జరిగిందో చూస్తే, గుర్తుపెట్టుకునేంత సమయమైనా ఇవ్వకుండా అనేకమైన ముఖాలూ, భాషలూ, ప్రాంతాలూ, సంఘటనలూ ఒకదానివెంట ఒకటి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తెర మీద కదిలిపోతుంటాయి.
ప్రభాస్ స్థాయిని అతని పాత్ర స్వభావం అందుకోలేకపోయింది. నిజానికి అతని పాత్రకు ఒక స్వభావమే లేదు. అతనిలోని నటనా కౌశలాన్ని వెలికితీయగల శక్తి దానికి లేకపోయింది.
అమృతగా నటించిన శ్రద్ధాకపూర్, టాస్క్ ఫోర్స్ ఏజెంట్ అయినప్పటికీ అమాయకమైన నిస్సహాయపు ఆడపిల్లలా బేలతనాన్నే ప్రదర్శిస్తుంది. ఆద్యంతం హీరో సహాయం కోసం ఎదురుచూస్తుంటుంది.

ఫొటో సోర్స్, uv creations/fb
అనేకమంది ప్రముఖ నటులు సినిమా నిండా కనిపించినప్పటికీ, ఎవరి పాత్రా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోలేకపోయింది. ఏ పాత్రా ప్రేక్షకుడితో సంబంధాన్ని ఏర్పరుచుకోలేకపోయింది. కనీస భావోద్వేగాన్ని కలిగించే ఒక్క సంఘటనైనా ఈ సినిమా సృష్టించలేకపోయింది.
సంభాషణల్లో కూడా అదే అయోమయం. "మగవాళ్ళు మీకే అంత స్వార్థముంటే, మిమ్మల్ని కన్న ఆడవాళ్ళం - మాకెంతుండాలి?" అనే మందిరా బేడీ మాటల్లో ఎంతటి అసంబద్ధత ఉందో, సినిమా మొత్తం కూడా అంతే అసంబద్ధత కొనసాగింది.
పాటల్లోని అంతంత మాత్రపు సంగీతానికి, పదాలు పొసగని సాహిత్యం తోడైంది. కెమెరా కన్ను ఎందుకు ఎటువైపు నుంచి చూసిందో అర్థం కాకుండా పోయింది. చివరికి యాక్షన్ థ్రిల్లర్ అంటూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమాలోని ఫైట్స్ కూడా సమర్ధనకు అవకాశమిమిచ్చేంత అద్భుతంగా లేకపోయాయి.

ఫొటో సోర్స్, uv creations/fb
అధిక వ్యయానికి కారణమైన విజువల్ ఎఫెక్ట్స్ చాలా రిచ్‌గా ఉన్నప్పటికీ, గొప్ప ఉద్విగ్నతనేమీ కలిగించలేకపోయాయి. మొత్తంగా చూస్తే ఈ సినిమా, జీవంలేని మరబొమ్మలా యాంత్రికమైన కదిలికలను చూసిన ఫీల్‌ను మనసు మీద ముద్రించగలిగింది.
చివరి అరగంట మాత్రం, అసలు అక్కడేం జరుగుతోందన్న ఆలోచనను పక్కన పెట్టి కేవలం తెరకు కళ్లనప్పగించి, గాల్లో ఎగిరి పడిపోయే కార్లనూ, నిట్టనిలువుగా కూలుతున్న భవనాలనూ, ఎవరికీ తగలకుండా దూసుకుపోతున్న బుల్లెట్లనూ చూస్తూ కూర్చుంటే ఎంతో కొంత రిలీఫ్ దొరికే అవకాశం ఉంది.
ఎంతటి నిపుణులైన ఎడిటర్లనూ, ఇతర టెక్నీషియన్‌లనూ తీసుకొచ్చినా వారి ప్రతిభను సరైన రీతిలో వినియోగించుకోలేకపోతే సినిమా ఎలా విఫలమవుతుందన్నదానికి సాహో సినిమానే ఉదాహరణ.
ఇవి కూడా చదవండి:
- ప్రభాస్ సాహో: ‘తెలుగు దర్శకులారా.. కాపీ కొట్టినా, సరిగ్గా కొట్టండి’ - లార్గో వించ్ డైరెక్టర్ తాజా ట్వీట్
- భార్యలను హత్య చేయగల భర్తలను ఇలా ముందే పసిగట్టవచ్చు
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు
- BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...
- 'హలో.. సన్నీ లియోని స్నానానికి వెళ్లారు. ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేరు'
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








