జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా?

జేమ్స్ బాండ్

ఫొటో సోర్స్, DANJAQ LLC/UNITED ARTISTS/COLUMBIA PICTURES

ఫొటో క్యాప్షన్, డేనియల్ క్రెగ్
    • రచయిత, అలెక్స్ టేలర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మరోసారి పలకరించేందుకు 'జేమ్స్ బాండ్' సిద్ధమవుతున్నాడు. బాండ్ సినిమాల సిరీస్‌లో 25వ చిత్రం 'నో టైమ్ టు డై' వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది.

డేనియల్ క్రెగ్ ఈ చిత్రంలో మళ్లీ బాండ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకిది ఐదో బాండ్ చిత్రం.

అయితే, ఈసారి ప్రపంచాన్ని కాపాడటంతోపాటు నేటి సమాజానికి తగ్గట్లుగా తనను తాను సంస్కరించుకునే బాధ్యత కూడా బాండ్‌పై పడింది.

బాండ్ పాత్ర వ్యక్తిత్వంలో అవలక్షణాలున్నాయని 'నో టైమ్ టు డై' సినిమా ప్రారంభ కార్యక్రమంలో డేనియల్ క్రెగ్ అంగీకరించారు.

''అవి మార్చుకోతగ్గ అవలక్షణాలు. చుట్టూ ప్రపంచంలో ఏ జరుగుతోందో చూడకపోతే మనం క్రియేటివ్ పీపుల్ అవ్వలేం. సమయానికి తగ్గట్టు బాండ్ ఎప్పుడూ మారుతూ వచ్చాడు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

జేమ్స్ బాండ్

ఫొటో సోర్స్, PROP STORE

ఏంటా అవలక్షణాలు?

ప్రపంచాన్ని కాపాడేవాడిగా బాండ్ పాత్రకు ఎంత పేరుందో, స్త్రీలను ఆకర్షించేవాడిగానూ అంతే పేరు ఉంది.

'బాండ్ గర్ల్స్' పాత్రలు, వాటితో బాండ్ బంధాల చిత్రణ కూడా ఇందుకు తగ్గట్లు ఉంటుంది. చాలా మంది స్త్రీలను అతడు లోబరుచుకుంటుంటాడు. తాను పనిచేసే ఆఫీస్‌‌లోని సెక్రటరీతోనూ సరసాలాడుతుంటాడు.

మొదట్లో వచ్చిన బాండ్ చిత్రాల్లో కథనాయక పాత్రలో హాలీవుడ్ నటుడు సీన్ కానరీ నటించారు. వాటిలో స్త్రీలపై బాండ్ చెయ్యిచేసుకునే సీన్లు కూడా ఉన్నాయి.

నటుడు రోజర్ మూర్ ఆ పాత్ర పోషించినప్పుడు బాండ్.. స్త్రీ ద్వేషిగా కనిపించాడు. 'గోల్డెన్ ఐ' సినిమాలో బాండ్ పాత్రను 'స్త్రీ ద్వేషి, సెక్సిస్ట్ డైనోసార్'గా మరో ప్రధాన పాత్ర వర్ణిస్తుంది.

జేమ్స్ బాండ్

ఫొటో సోర్స్, DAVE ALLOCCA/STARPIX/REX/SHUTTERSTOCK

బాండ్ పాత్రకు అన్ని అవలక్షణాలున్నా, బాండ్ మూవీ మేకర్స్‌కు గతంలో ఎప్పుడూ అది పెద్ద ఇబ్బందిగా మారలేదని రచయిత్రి ఫియోనా స్టర్జెస్ అన్నారు. ఫీమేల్ స్టార్స్‌ని కూడా సైడ్ డిష్‌ల్లాంటి పాత్రలకు పరిమితం చేసేవారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు సమాజం మారుతోంది. స్త్రీ, పురుష సమానత్వం గురించి చాలా చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 'మీ టూ' ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది.

'నో టైమ్ టు డై'లో వీటి ప్రభావం కచ్చితంగా ఉంటుందని, పరిస్థితులకు తగినట్లు మార్పులు కనిపిస్తాయని ఆ చిత్ర నిర్మాత బార్బరా బ్రొకోలీ చెప్పారు. 2015లో వచ్చిన 'స్పెక్టర్' చిత్రంలో బాండ్ పాత్రలో పెద్ద మార్పులు కనిపించాయి.

వాలెర్ బ్రిడ్జ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వాలెర్ బ్రిడ్జ్

మారాలా, వద్దా?

బాండ్ పాత్ర మారాలా, వద్దా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

'నో టైమ్ టు డై'కి స్క్రీన్‌ప్లే రాస్తున్నవారిలో ఒకరైన వాలెర్ బ్రిడ్జ్ కూడా ఈ విషయంపై స్పందించారు.

''బాండ్ చిత్రం స్త్రీలతో సరిగ్గా వ్యవహరిస్తుంది. ఆ అవసరం బాండ్ పాత్రకు లేదు. అతడు తనలాగే ఉండాలి'' అని ఆమె అభిప్రాయపడ్డారు.

జేమ్స్ బాండ్

ఫొటో సోర్స్, Alamy

జర్నలిస్ట్ కేథరిన్ బ్రే ఈ విషయంలో వాలెర్‌తో విభేదించారు.

''కథలో బాండ్ పాత్ర ప్రధానం. కానీ, అతడిని అలా స్త్రీ ద్వేషిగా చూపించకుండా కూడా ఉండొచ్చు. సెక్సిస్ట్ డైలాగ్స్‌నూ తీసేయొచ్చు'' అని ఆమె అన్నారు.

''సినిమాలో ప్రతి పాత్రా బాండ్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే, అతడి వ్యక్తిత్వాన్ని మార్చకుండా, పెద్ద మార్పు తీసుకురావడం కష్టం'' అని బ్రే అభిప్రాయపడ్డారు.

మరి, బాండ్ అలాగే ఉండిపోతాడా? లేక మారతాడా? ఒకవేళ మారితే తన అసలు స్వభావాన్ని పోగొట్టుకోకుండా బాండ్‌కు అది సాధ్యమవుతుందా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసేది వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)