తొమ్మిదేళ్ల కిందట అమిత్‌షా అరెస్టుకు.. ఇప్పుడు చిదంబరం అరెస్టుకు సంబంధమేమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ధీమంత్ పురోహిత్
- హోదా, బీబీసీ గుజరాతీ
దిల్లీలో బుధవారం (ఆగస్టు 21) రాత్రి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అరెస్టు సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను అందరం చూశాం.
అవి సినిమాలలోని సన్నివేశాలకు ఏమాత్రం తక్కువ కానట్లుగా సాగాయి.
దిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిలు నిరాకరించింది. సుప్రీంకోర్టు కూడా కేసును అత్యవసరంగా విచారణకు చేపట్టాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
దీంతో 27 గంటల పాటు మాయమైపోయిన చిదంబరం ఆగస్ట్ 21 రాత్రి 9 గంటలకు దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు.
మీడియానుద్దేశించి అక్కడ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పేర్లు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.
అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఆయన మీడియాతో మాట్లాడుతున్నారని తెలిసి సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లారు. కానీ, ఆయన అప్పటికే అక్కడి నుంచి జోర్‌బాగ్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.
ఆ తరువాత మొదలైంది దిల్లీలో ఎన్నడూ చూడనటువంటి 45 నిమిషాల రాజకీయ నాటకం.
చిదంబరం ఇంటి ప్రధాన ద్వారాలు మూసి ఉన్నాయి. విలేకరులంతా ఆ ఇంటికి వెలుపల నిరీక్షిస్తున్నారు.
అరెస్టు వారంటుతో సీబీఐ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు లోపలికి వెళ్లేందుకు అనుమతి దొరకలేదు. దీంతో వారు గేట్లు దూకి ఇంట్లోకి వెళ్లారు.
బయట కాంగ్రెస్ కార్యకర్తల నిరసన మొదలైంది.
వీటన్నిటి మధ్య చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన్ను తమ కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకీ వేట
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అయిన చిదంబరం ఏం చేస్తే ఇదంతా చేయాల్సి వచ్చింది..?
దీనికి సమాధానం తొమ్మిదేళ్ల కిందట జరిగిన పరిణామాల్లో కనిపిస్తోంది.
2010 ఆగస్టు 25న దాదాపు ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు అచ్చంగా అలాంటి పరిణామాలే మళ్లీ కళ్లకు కట్టాయి.
2010లో ఇదంతా జరిగేటప్పటికి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమిత్ షా గుజరాత్ హోం మంత్రి.. చిదంబరం కేంద్రంలో హోం మంత్రి.
అప్పటికి సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
గుజరాత్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఆ ఎన్‌కౌంటర్ నకిలీదేనని అంగీకరించింది. చిదంబరం విషయంలో బుధవారం జరిగినలాంటి నాటకీయ పరిణామాలే అప్పుడూ జరిగాయి.
అమిత్ షా సీబీఐకి దొరక్కుండా నాలుగు రోజులు కనిపించకుండాపోయారు.
చార్జిషీట్ దాఖలవడంతో 2010 జులై 24న అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
చిదంబరంలా కాదు.. అమిత్ షా అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చారు
మరుసటి రోజు జులై 25న అహ్మదాబాద్‌కు చెందిన జర్నలిస్టులకు ఓ సందేశం అందింది.. ఖాన్‌పూర్ బీజేపీ కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందన్నది దాని సారాంశం.
అమిత్ షా ఆ ప్రెస్ కాన్ఫరెన్సులో ఉండొచ్చని మాకు నమ్మకమైన సమాచారం అందింది.
అప్పటికి ఓ చానల్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న నేను లైవ్ ఇచ్చేందుకు ఓబీ వ్యానుతో వెళ్లాను.
చిదంబరం నిన్న కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టినట్లే అప్పట్లో బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు.
మాకు వచ్చిన సమచారం కరెక్టే.. అమిత్ షాయే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
చిదంబరం మాదిరిగానే ఆయనా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అయితే.. చిదంబరంలా కాకుండా ఆయన విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చారు.
‘ఈ నాలుగు రోజులూ ఏమైపోయావ్ అమిత్ భాయ్’
అన్నిటికంటే ముఖ్యమైనది నేను అడిగిన ప్రశ్నే. అదే చివరి ప్రశ్న. ''ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ అమిత్ భాయ్'' అని అడిగాను.
దానికి ఆయన.. ''నేను మీ ఇంట్లోనే ఉన్నాను ధీమంత్ భాయ్'' అంటూ పెద్దపెట్టున నవ్వారు.
చాలా సీరియస్ అంశంపై, సీరియస్‌గా మొదలైన ఈ ప్రెస్‌మీట్ అమిత్ షా బిగ్గరైన నవ్వుతో ముగిసింది.
చిదంబరం విషయంలో సీబీఐ అధికారులు ఆయన ఇంటికి హుటాహుటిన వెళ్లి ఇంటి గేట్లు దూకి మరీ అదుపులోకి తీసుకున్నారు.
కానీ, అమిత్ షా అప్పట్లో సీబీఐకి అలాంటి అవకాశం ఇవ్వలేదు. విలేకరుల సమావేశం ముగియగానే నేరుగా ఆయనే గాంధీనగర్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు.
ఆయన లొంగిపోగానే సీబీఐ అధికారులు ఆయన్ను మణినగర్‌లోని మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లారు.
ఆయన్ను రిమాండుకు పంపించమని అడగకుండా సబర్మతి జైలుకు తరలించారు.
అనంతరం కోర్టు ఆయనకు గుజరాత్‌లో అడుగుపెట్టరాదన్న షరతుపై బెయిలు మంజూరు చేసింది. అప్పుడు ఆయన దిల్లీకి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి:
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్‌నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








