అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, UGC
- రచయిత, ప్రతిమ ధర్మరాజు
- హోదా, బీబీసీ కోసం
బాలికను ఓ గ్రామపెద్ద చేతితో, కర్రతో కొడుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటని, బాలికను తీవ్రంగా కొట్టే అధికారం అతనికెవరిచ్చారని బాలల హక్కుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన, వివాదాస్పదమైన ఈ వీడియో వెనక ఏం జరిగింది?
వీడియో వైరల్ కావడంతో అనంతపురం జిల్లాలో ఆ ఊరు ఎక్కడ ఉందో వెతుక్కోవడం పోలీసులకు పెద్ద పనిగా మారింది.
ఒక బాలికను అంత తీవ్రంగా దండించడానికి కారణమేంటి, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు గుమ్మఘట్ట మండలంలోని కేపీ దొడ్డి గ్రామానికి వెళ్లింది బీబీసీ.
గ్రామస్తులను, పోలీసులను అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అసలేం జరిగింది?
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో 16 ఏళ్ల మైనర్ అమ్మాయి, 20 ఏళ్ల సాయికిరణ్ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ 15 రోజుల క్రితం ఊరు వదిలి పారిపోయారు. ఇరువైపుల వారూ వారిని వెతికి పట్టుకుని, ఈ నెల 11న తిరిగి ఊరికి తీసుకొచ్చారు.
వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై పంచాయతీ చేయవలసిందిగా మాజీ సర్పంచ్ నాగప్పని కోరారు. ఆ ఊరిలో చిన్నదైనా, పెద్దదైనా.. ఏ గొడవ జరిగినా పోలీస్ స్టేషన్‌కి వెళ్లరు. ఆ గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ నాగప్పే ఆ తగాదాలను పరిష్కరిస్తారు. రచ్చబండపై కూర్చుని ఊరందరి సమక్షంలో సమస్యను పరిష్కరించుకుంటారు.

అదే విధంగా ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం కూడా పరిష్కరించమని వీరి తల్లిదండ్రులు నాగప్పని పంచాయతీకి పిలిచారు. నాగప్ప, ఇంకా కొంత మంది పెద్దలు ఈ నెల 11వ తేదీ పంచాయతీ పెట్టి, రచ్చబండ దగ్గరకు సాయికిరణ్‌ను, బాలికను పిలిచారు.
"మీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లవుతారు. కాబట్టి మీరు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నీకు వేరే పెళ్లి చేస్తాం. ఆ పిల్లాడిని మర్చిపో" అని ఆ బాలికకు చెప్పారు నాగప్ప. ఇదే విషయాన్ని సాయికిరణ్‌కు కూడా చెప్పారు.
దీనికి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు కానీ, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.
"నాకు ఆ అబ్బాయి కావాలి, అతనితోనే ఉంటా" అంటూ ఏడుపు మొదలెట్టింది. గ్రామ పెద్దలు చెప్పినదానికి ఒప్పుకోలేదు.
దీంతో నాగప్పకు పట్టరానంత కోపం వచ్చింది. ఎదురుగా ఉన్న ఆ బాలికను చేత్తోను, అక్కడే ఉన్న కర్రతోనూ చితకబాదారు. అయినా, కోపం చల్లారక కాలితో ఆ బాలిక గుండెల మీద తన్నారు. అసభ్యకరమైన పదజాలంతో తీవ్రంగా దూషించారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న ఇతర గ్రామపెద్దలు కూడా నాగప్పకు జతకలిసి, ఆమెను తీవ్రమైన పదజాలంతో తిట్టడం ప్రారంభించారు. సాయికిరణ్ తండ్రి కూడా ఆ బాలికను కొట్టాడు. ఈ తతంగమంతా ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

మా గ్రామపెద్దగా ఆయన చేసింది సరైన పనే
గ్రామంలోని ప్రజలందరూ "మా నాగప్ప మాకు దేవుడు. ఎన్నో పంచాయతీలు చేశాడు. ఏరోజూ ఇలా ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించలేదు. కానీ ఆ ఇద్దరూ అన్నాచెల్లెళ్ల వరస కావడం, సర్ది చెప్పినా వినకపోవడంతో అలా కొట్టవలసివచ్చింది. అందులో ఆయన తప్పేమీ లేదు" అంటున్నారు.
ఓ గ్రామపెద్దగా ఆయన అలా చేశారు, అదేమీ తప్పుకాదని ఆ ఊరి ప్రజలు అంటున్నారు.

పోలీసులేమంటున్నారు?
ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో, ఆ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న డీఎస్పీతో బీబీసీ మాట్లాడింది.
"వారు తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో చెప్పాలి కానీ అలా ఒక బాలికను అంత దారుణంగా కొట్టడం చట్టరీత్యా నేరం. దీనికి సంబంధించి నాగప్పపై ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశాం. అమ్మాయి మైనర్ కావడం వల్ల సాయికిరణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం" అని వివరించారు.

గ్రామాల్లో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల తమ సమస్యల పరిష్కారానికి ఇలాంటి పంచాయతీలను, గ్రామపెద్దలను ఆశ్రయించడం అప్పుడప్పుడూ జరుగుతోందని, వీటిపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ సత్యబాబు తెలిపారు.
ఈ ఘటన 'బాలల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి) అధ్యక్షురాలు నల్లాని రాజేశ్వరి అన్నారు. ఆధునిక కాలంలో కూడా సామాజిక రుగ్మతలు కొనసాగుతుండడంపై విచారం వ్యక్తి చేసిన రాజేశ్వరి, "బాధిత బాలికను అన్ని విధాలా ఆదుకుంటాం. వైద్య చికిత్స, కౌన్సిలింగ్‌తో పాటు న్యాయపరమైన సహకారం కూడా అందిస్తాం" అని అన్నారు.
బాధితురాలిని ఆమె ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. బాలికకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించి ఆదుకునే ప్రయత్నం చేస్తాం" అని రాజేశ్వరి చెప్పారు.
ఇదిలా ఉంటే, నాగప్పను విడుదల చేయాలంటూ గ్రామస్తులంతా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేశారు. ఊరి పెద్దగా ఆయన చేసిన దానిలో తప్పేమీ లేదని వారంటున్నారు.
సాయికిరణ్ కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులో లేరు. ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి.
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- ఈ తెగలో వ్యభిచారం ఓ ఆచారం, అమ్మాయి పుడితే సంబరాలు చేసుకుంటారు
- మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో చెప్పిన త్రివిధ దళాల ముఖ్య అధికారి ఎలా ఉంటారు?
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తకు తగిన గుర్తింపు దక్కలేదా
- కశ్మీర్: మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి దేశంలో విస్తృతంగా మద్దతు ఎందుకు లభిస్తోంది?
- భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. గుణపాఠం చెప్పే సమయం వచ్చింది : ఇమ్రాన్ ఖాన్
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








