మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - అవయవాల కొరత తీరుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
మనిషి లక్షణాలు, జంతు లక్షణాలు కలిసి ఉన్న హైబ్రిడ్ జీవుల గురించి మనిషికి చాలా కాలంగా ఎన్నో ఊహలు ఉన్నాయి. ఇలాంటి ఊహాజనిత జీవులను ప్రాచీన గ్రీకులు 'కైమెరాలు' అని పిలిచేవారు. ఈ ఊహలు నిజమయ్యే రోజు దగ్గరవుతోందా?
మనిషి అవయవాలను జంతువుల పిండాల్లో పెరిగేలా చేసేందుకే కాకుండా, ఇలాంటి పిండాలు పూర్తికాలంపాటు వృద్ధి చెందేలా చూసేందుకు శాస్త్రవేత్తల బృందానికి జపాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇలాంటి అనుమతి ఇచ్చిన తొలి దేశం జపానే.
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించే ప్రొఫెసర్ హిరోమిత్సు నకౌచి ఈ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా చేస్తారు?
ఈ పరిశోధనలో- క్లోమం (పాంక్రియాస్)గా వృద్ధి చేయడానికి వీలైన మూలకణాలను మార్పులకు లోను చేసిన ఎలుకల పిండాల్లోకి చొప్పిస్తారు.
ఈ పిండాలను తర్వాత సరొగేట్ జంతువుల గర్భంలోకి మారుస్తారు.
మనుషులకు ఏర్పాటు (ట్రాన్స్‌ప్లాంట్) చేయగలిగిన అవయవాలను జంతువుల పిండాల్లో వృద్ధి చేయడమనేది ఈ పరిశోధన అంతిమ లక్ష్యం.
జపాన్‌లో ఇటీవలి వరకున్న నిబంధనల ప్రకారం- మనిషి కణాలను ప్రవేశపెట్టిన జంతువుల పిండాలను 14 రోజుల తర్వాత నిర్జీవం చేయాలి. వృద్ధి చెందేందుకు వాటిని ఇతర జంతువుల గర్భంలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు.
ఈ ఆంక్షలను జపాన్ ప్రభుత్వం ఇటీవల తొలగించింది. ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకొని ఇలాంటి పరిశోధనలు సాగించేందుకు శాస్త్రవేత్తలకు వీలు కల్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
నైతిక కోణం
లోగడ ఎలుకలు, పందులు, గొర్రెల పిండాల్లో నకౌచి, ఇతర పరిశోధకులు మనిషి కణాలను వృద్ధి చేశారు.
మనుషుల్లో అవయవ మార్పిడికి (ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు) కావాల్సిన అవయవాలను తగినంతగా సరఫరా చేయడమే ఈ పరిశోధనల లక్ష్యం. ముఖ్యంగా క్లోమం లాంటి తక్కువగా లభ్యమయ్యే అవయవాల సరఫరా కోసం వీటిని చేపడుతున్నారు.
మధుమేహం వచ్చిన ఒక ఎలుకకు 2017లో ఈ విధానంతో నకౌచి విజయవంతంగా చికిత్స అందించారు. ఒక ఎలుక పిండంలో ఆరోగ్యగకర క్లోమం వృద్ధి చెందేలా చేసి, దానిని మధుమేహమున్న ఎలుకలోకి మార్చి, వ్యాధిని నయం చేశారు.
అయితే చట్టపరమైన నిబంధనల వల్ల లేదా ప్రయోగాలు విఫలమవడం వల్ల మనిషి కణాలతో ముడిపడిన పరిశోధనలు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.
ఈ పరిశోధనలపై నైతికత కోణంలో ఆందోళనలు కూడా ఉన్నాయి.
మనిషి కణాలు జంతువుల మెదడుకు చేరొచ్చని, పర్యవసానంగా మనిషి మేధోశక్తిని అవి పొందే ప్రమాదం ఉండొచ్చని ఈ పరిశోధనలను నైతిక కోణంలో వ్యతిరేకించేవారు చెబుతున్నారు.
మనిషి కణాలు జంతువుల పిండంలో క్లోమం వృద్ధి చెందడం వరకే పరిమితమయ్యేలా, మెదడుకు చేరకుండా ఉండేలా పరిశోధన సాగిస్తామని నకౌచి స్పష్టం చేశారు.
జులైలో జపాన్ విద్య, సంస్కృతి, శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన శాఖ నిపుణుల కమిటీ కొన్ని షరతులతో ఆయన పరిశోధనకు అనుమతి ఇచ్చింది.

ఫొటో సోర్స్, Thinkstock
భవిష్యత్తులో మరిన్ని అవయవాలపై...
ఈ పరిశోధనలో- క్లోమం లాంటి అవయవం ఏర్పడటానికి సంబంధించిన జన్యువులను తొలగించేందుకు జంతువు పిండాన్ని జన్యుపరమైన మార్పులకు లోను చేస్తారు.
తర్వాత జంతువు పిండంలోకి మనిషి మూలకణాలను ప్రవేశపెడతారు. అనంతరం పిండం పూర్తిస్థాయిలో వృద్ధి చెందేలా చూస్తారు. జపాన్ ప్రభుత్వ అనుమతి ఇందుకు వీలు కల్పిస్తోంది.
ప్రస్తుతం క్లోమం గురించి మాత్రమే పరిశోధన చేస్తున్నప్పటికీ, భవిష్యత్తులో కాలేయం, మూత్రపిండాలపైనా ప్రయోగాలు జరిగే అవకాశముంది.
జన్యుపరంగా మనిషికి చాలా దూరంగా ఉండే చిన్న జంతువుల్లోనే పరిశోధనలు చేయాలని నకౌచికి నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని జపాన్ విద్య, సంస్కృతి, శాస్త్రసాంకేతిక పరిజ్ఞాన శాఖలో 'బయోఎథిక్స్ అండ్ బయోసేఫ్టీ' విభాగ డైరెక్టర్ అయాకో మవేసవా చెప్పారు.
పిండం వృద్ధి చెందే క్రమంలో దాని మెదడులో మనిషి కణాలేమైనా ఉన్నాయా అన్నది పరిశోధకులు ప్రతి దశలో పరిశీలించాల్సి ఉంటుంది. ఎలుకలు పుట్టిన తర్వాత రెండేళ్లపాటు మార్పులను గమనిస్తారు.
పేపర్ వర్క్ పూర్తయ్యాక సెప్టెంబరులో పరిశోధనను ప్రారంభిస్తానని నకౌచి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ పరిశోధనలో ఏమైంది?
నకౌచి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాయలంలో జరిపిన ఒక పరిశోధనలో- ఫలదీకరణం చెందిన గొర్రెల అండాల్లో మనిషి మూలకణాలను చొప్పించి తర్వాత పిండాలను గొర్రెల గర్భంలోకి మార్చారు.
28 రోజుల వృద్ధి తర్వాత ఆ పిండాలను నిర్జీవం చేశారు.
అప్పుడు గొర్రెల్లో అత్యల్ప సంఖ్యలో మానవ కణాలు కనిపించాయని, మనిషి లక్షణాలేవీ రాలేదని ఆయన 'అసామి షింబన్' పత్రికతో చెప్పారు. గొర్రెల శరీరాల్లో వెయ్యిలో ఒక వంతు కన్నా తక్కువగా మానవ కణాలు కనిపించాయన్నారు.
అలాంటి స్థితిలో 'మనిషి ముఖంతో జంతువు' ఎన్నటికీ పుట్టదని ఆయన వ్యాఖ్యానించారు.
జన్యు దూరం
మనిషి కణాలను ఇతర జీవుల్లో వృద్ధి చేయడం సులభం కాదు.
ఈ అంశంపై అమెరికా డాలస్‌లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లోని 'సౌత్‌వెస్టర్న్ మెడికల్ సెంటర్' పరిశోధకుడు జున్ వు స్పందిస్తూ- ఉదాహరణకు పరిణామ క్రమంలో మనిషికి, పందులు, గొర్రెలు లాంటి జంతువులకు మధ్య చాలా దూరం ఉందని, వీటిని ఉపయోగించి మనిషి-జంతువు హైబ్రిడ్ పిండాలను పూర్తికాలం వృద్ధి చేయడం అర్థరహితమని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి జీవజాతుల్లో పిండాల (హోస్ట్ ఎంబ్రియోస్) నుంచి ప్రారంభ దశలోనే మానవ కణాలు దూరమవుతాయని ఆయన చెప్పారు.
చైనాలోని ఒక ప్రయోగశాలలో మనిషి-కోతి హైబ్రిడ్ పిండాలను వృద్ధి చేసినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలను ఉటంకిస్తూ స్పానిష్ పత్రిక 'ఎల్ పాయిస్' గత నెల్లో తెలిపింది.
అమెరికా కాలిఫోర్నియాలోని 'సాల్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయలాజికల్ స్టడీస్'కు చెందిన ప్రొఫెసర్ జువాన్ కార్లోస్ ఇజ్‌పీసుయా బెల్‌మాంటే ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
ఒక ప్రతిష్ఠాత్మక జర్నల్ తమ పరిశోధన వివరాలను త్వరలో వెల్లడించనుందని, ఆ తర్వాత తాము మరింత సమాచారం చెబుతామని స్పెయిన్ శాస్త్రవేత్తలు 'ఎల్ పాయిస్' పత్రికకు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- శుభ్రత అంటే ఏమిటి? పరిసరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అంటే ఏమిటి...
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- పని చేయాలంటే విసుగొస్తోందా? పరిష్కారాలేమిటి?
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- షేర్పాలు, టిబెటన్లకు ఆక్సిజన్ లోపాన్ని తట్టుకునే జన్యువు ఈ ప్రాచీన మానవజాతి నుంచే సంక్రమించిందా?
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- మనిషి పాదాల పరిమాణం రోజురోజుకు పెరిగిపోతోంది.. ఎందుకో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








