కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check

ఫొటో సోర్స్, SM VIRAL POST
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 సవరణను స్వాగతిస్తూ కొంతమంది ముస్లింలు ర్యాలీ తీస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"గంటపాటు కర్ఫ్యూను సడలించగానే, ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీరీ ప్రజలు ఎలా మద్దతు తెలుపుతున్నారో చూడండి" అని క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
దానిని అనేక ఫేస్‌బుక్ గ్రూపుల్లో, ట్విటర్ ఖాతాల్లో షేర్ చేశారు.
45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో తెల్ల దుస్తులు ధరించిన ముస్లింలు జాతీయ పతాకం పట్టుకుని రోడ్డుమీద ర్యాలీ తీస్తూ ’’భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేయడాన్ని చూడొచ్చు.
ఈ వీడియో ప్రామాణికతను పరిశీలించేందుకు బీబీసీ పాఠకులు మాకు వాట్సాప్ ద్వారా వీడియోను పంపించారు.
బక్రీద్‌కు ముందుగా ఆదివారం కశ్మీర్‌లో కర్ఫ్యూను సడలించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సోమవారం ఉదయం, మసీదులో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న కొన్ని ఫొటోలను హోమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి షేర్ చేశారు.
అయితే, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోకు కశ్మీర్‌కు, ఆర్టికల్ 370 సవరణ తర్వాత నెలకొన్న పరిణామాలకు ఎలాంటి సంబంధం లేదని మా పరిశీలనలో వెల్లడైంది.
ఆ వీడియో కర్ణాటకలోని బెంగళూరులో తీసినదని తేలింది. అది ఇప్పటిది కాదు, ఏడు నెలల క్రితం చిత్రీకరిందని గుర్తించాం.

ఫొటో సోర్స్, Prashant Chahal
వీడియో వెనకున్న వాస్తవం
ఆ వీడియోను 2019 ఫిబ్రవరిలో చిత్రీకరించారు. అందులో కనిపిస్తున్న ప్రజలు బోహ్రా ముస్లిం సముదాయానికి చెందినవారు, కశ్మీరీలు కాదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ద్వారా వెతికితే, 2019 ఫిబ్రవరి 19న లిండా న్యోమాయి అనే మహిళ చేసిన ట్వీట్‌లో ఈ వీడియో కనిపించింది.
ఆమె ట్విటర్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె బీజేపీ కార్యకర్త, ఆ పార్టీ ఎస్టీ వింగ్ సభ్యురాలు.
#IndianArmyOurPride, #StandWithForces అనే హ్యాష్‌ట్యాగులతో ఆమె ఆ వీడియోను ట్వీట్ చేశారు. "పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించేందుకు బెంగళూరులోని బెనెర్ఘట్టా రోడ్డులో బోహ్రా సముదాయానికి చెందిన ముస్లింలు ర్యాలీ తీశారు" అని ఆమె క్యాప్షన్ రాశారు.
2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మీడియా కథనాల ప్రకారం, పుల్వామా దాడిని ఖండిస్తూ, బెంగళూరులో మాదిరిగానే ముంబయిలోనూ స్థానిక ముస్లింలు ర్యాలీ తీశారు.

ఫొటో సోర్స్, AAKANKSHA 'MEGHA'
బోహ్రా ముస్లింలు ఎవరు?
గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బోహ్రా ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నారు. వ్యాపారంలో విజయవంతమైన ముస్లిం సముదాయంగా వీరిని భావిస్తారు.
ప్రవక్త హజరత్ మొహమ్మద్‌కు వారసుడిగా భావించే ఫాతిమా ఇమామ్స్ వారసత్వమే ఈ దావూదీ బోహ్రా సముదాయం అని చెబుతారు.
ఈ సముదాయానికి చెందినవారు ఇమామ్స్‌ను మాత్రమే గౌరవిస్తారు. తయ్యబ్ అబుల్ కాసీం బోహ్రాలలో ఆఖరి, 21వ ఇమామ్.
బోహ్రా సముదాయానికి అగ్రనేత సయ్యెదానా ముఫ్‌దల్ సైఫుద్దీన్‌ను కలిసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వెళ్లారు.
బెంగళూరులో ర్యాలీ నిర్వహించిన మాట వాస్తవమేనని ముంబయికి చెందిన బోహ్రా కమ్యూనిటీ సీనీయర్ సభ్యుడు బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మనుషుల కంటే ముందు అంతరిక్షంలోకి రోబోలను పంపనున్న ఇస్రో
- జమ్మూ కశ్మీర్ విభజన: ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం: అమిత్ షా
- వీకెండ్లో పబ్ కెళ్లడానికి బదులు ఇక్కడికొచ్చి నగ్నంగా కూర్చుంటారు
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
- 'ఆర్టికల్ 370 సవరణ'తో జమ్మూ, కశ్మీర్‌లో ఏమేం మారతాయి
- రాళ్లు అమ్మి కోటీశ్వరుడైన ఓ 'మేధావి' కథ
- కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!’
- ‘కశ్మీర్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం రద్దు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








