పెంపుడు రాళ్లు: వింత ఆలోచనతో కోటీశ్వరుడైన ఓ 'మేధావి' కథ

ఫొటో సోర్స్, Getty Images
మీకు తెలుసా..? లక్షలాది మంది అమెరికన్లు.. పెంచుకోవటం కోసం రాళ్లను కొనుక్కున్న రోజులు ఉన్నాయి. ఈ వేలం వెర్రిని కనిపెట్టిన వ్యక్తి.. 1970ల నాటి స్వేచ్ఛా స్ఫూర్తిని ''కచ్చితంగా పట్టుకున్న'' ఘనుడిగా కీర్తి అందుకున్నాడు. అసలు అదెలా జరిగిందంటే...
అసలు సిసలైన పెంపుడు జంతువులు అని వాటిని అభివర్ణించారు: వీటికి తిండి పెట్టాల్సిన అవసరం లేదు. స్నానం చేయించాల్సిన పని లేదు. పొద్దునా సాయంత్రం బయటకు తీసుకెళ్లి తిప్పాల్సిన శ్రమే లేదు. ఒకవేళ ఇంటిల్లిపాదీ కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాల్సి వస్తే.. వీటి బాగోగుల సంగతేమిటి అనే బెంగే ఉండదు.
1970వ దశకం మధ్యలో.. పెట్ రాక్స్ - అంటే పెంపుడు రాళ్లు - అమెరికాలో ఓ పిచ్చిగా మారింది. ఆ కాలపు స్వేచ్ఛా స్ఫూర్తి - మీరు కావాలనుకుంటే పిచ్చితనాన్ని అనుకోవచ్చు - భూమికగా ఈ వేలం వెర్రి కొన్ని నెలల పాటు ఆవహించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పెంపుడు రాళ్ల సృష్టికర్త గ్యారీ దాల్. అప్పుడు ఒక ఫ్రీలాన్స్ అడ్వర్టైజింగ్ కాపీరైటర్‌గా పనిచేసేవాడు. ('దివాళా తీసి ఉన్నాననే మాటకు అది మరో పదం' అని అతడు ఆ తర్వాత అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ చెప్పింది.)
కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలోని ఓ పట్టణంలో నివసించేవాడు. ఒక రోజు బార్‌లో స్నేహితులతో కలిసి చల్లటి బీర్లు తాగుతున్నపుడు అతడి మెదడులో ఈ ఐడియా పుట్టింది.
ఆ బార్‌లో వారి సంభాషణ పెంపుడు జంతువుల మీదకు మళ్లింది. వాటి బాగోగులు చూసుకోవటం ఎంత వ్యయప్రయాసలతో కూడుకున్నదో మాట్లాడుకున్నారు. అప్పుడు దాల్ తన స్నేహితులతో చెప్పాడు. 'నా దగ్గర అసలు సిసలైన పెంపుడు జంతువులున్నాయి.. పెంపుడు రాళ్లు'.
అంతే.. వాటిని కొన్ని ప్యాక్ చేసి అమ్మకానికి పెట్టాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు.
'ద పెట్ రాక్' - అంటే 'పెంపుడు రాయి' అని ఆ డబ్బా మీద రాశాడు. మెక్సికో తీరం నుంచి తెచ్చిన ఈ రాళ్లు సాధారణమైనవే, గుడ్డు ఆకారంలో ఉన్నాయి. వాటిని అట్టపెట్టెలో గడ్డి గూడు మీద పెట్టి ప్యాక్ చేశాడు. గాలి ఆడటానికి ఆ పెట్టెకు రంధ్రాలు పెట్టాడు.
అసలు చిత్రం ఇంకా ఉంది. ఆ పెంపుడు రాళ్లకు ఎలా శిక్షణ ఇవ్వాలి? వాటి బాగోగులు ఎలా చూసుకోవాలి? అని విశదీకరించే ఒక మాన్యువల్ కూడా ఆ పెట్టెకు జతచేశాడు.
''పెంపుడు రాళ్లకు శిక్షణనివ్వటం చాలా సులభం. కూర్చోవటం, ఉండటం, చనిపోయినట్లు నటించటం వంటివి చాలా త్వరగా నేర్చుకుంటాయి'' అని మాన్యువల్‌లో వివరించాడు.
''మీ పెంపుడు రాయిని ఎప్పుడూ ఈతకు తీసుకెళ్లొద్దు. వాటికి ఈత రాదు. నీటిలో మునిగిపోతాయి. అప్పుడప్పుడూ లోతు తక్కువగా ఉండే నీళ్లలో స్నానం చేయించటం వరకూ అయితే ఫర్వాలేదు'' అని కూడా జాగ్రత్తలు రాశాడు.
''తిండి లేకుండా దర్జాగా బతికేస్తాయి... బాగా బద్ధకం... మొండి ఘటాలు.. పిలిచినపుడు దగ్గరకు రావు...'' అంటూ ఈ పెంపుడు రాళ్ల గుణగణాలు కూడా వర్ణించాడు.
''సెలవులకు విహారాలకు వెళ్లడాన్ని ఆస్వాదిస్తాయి.. ప్యాకెట్లలో వెళ్లటానికి ఇష్టపడతాయి'' అని వాటి ఇష్టాయిష్టాలనూ వివరించాడు.
''జనం బాగా విసిగిపోయారు.. తమ సమస్యలన్నిటితో అలసిపోయారు.. దానివల్ల వారు ఊహాలోక విహారానికి వెళ్లడానికి సిద్ధమవుతారు - అలాంటి వారికి మేం కాస్త హాస్యాన్ని ప్యాకేజీ చేసి ఇచ్చామనొచ్చు'' అని దాల్ 1975లో పీపుల్ మేగజీన్‌తో చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
కోట్లు కురిపించిన ఐడియా...
ఈ ఆలోచనకు అమెరికన్లు పడిపోయారు.
ఆ రాళ్లు ఒక్కో దానిని 3.95 డాలర్లకు అమ్మాడు. ఇప్పటి విలువలో ఒక్కోటి 15 డాలర్లన్నమాట. 1975లో 50 లక్షల కన్నా ఎక్కువ రాళ్లే దాల్ సరఫరా చేశాడు. క్రిస్టమస్ తర్వాత ఈ వేలం వెర్రి కొద్దిగా తగ్గే సమయానికి.. అతడు కోటీశ్వరుడిగా అవతరించాడు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ డబ్బుతో అతడు తన డొక్కు కారు పడేసి.. ఓ మెర్సిడెస్ కొన్నాడు. అద్దెకున్న డబ్బా గది వదిలేసి ఇంద్రభవనం లాంటి ఇల్లు కొనుక్కున్నాడు.
కానీ.. పెంపుడు రాళ్ల వ్యాపారం ముందుకు సాగలేదు.
ఆ తర్వాత దాల్ మరికొన్ని ఐడియాలు అమలులో పెట్టటానికి ప్రయత్నించాడు. 1976లో ఇసుకను పుట్టించే కిట్లు (వాటిని కొన్న యజమానులు.. స్త్రీ, పురుష ట్యూబుల ద్వారా ఇసుకను పుట్టించటం) అమ్మటం వాటిలో ఒకటి. కానీ అది ఫలించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
1978లో చైనా నుంచి రహస్యంగా తెప్పించానంటూ మట్టి ట్యూబులు అమ్మబోయాడు. అదీ పారలేదు.
ఆ తర్వాత ఒక సెలూన్ తెరిచాడు. సెయిల్‌బోటు బ్రోకరేజి వ్యాపారమూ ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు.
ఆ దశాబ్దం చివరికల్లా.. అతడి ఆలోచనలన్నీ వాస్తవంగా తమవని.. అతడికి వచ్చిన లాభాల్లో తమకు ఇచ్చిన వాటా అతి స్వల్పమని కొందరు 'అసలు ఆవిష్కర్తలు' అతడి మీద కేసులు వేశారు.
ఈలోగా.. పెంపుడు రాళ్లకు అతడు కాపీరైట్ నమోదు చేసుకున్నా కూడా.. ఇతర వ్యాపారులు తమ సొంత రాళ్లను అమ్మటం అపలేకపోయాడు.
దీంతో.. దాహల్ మళ్లీ అడ్వర్టైజ్‌మెంట్ రంగానికి తిరిగివచ్చాడు. 2001లో ''అడ్వర్టైజింగ్ ఫర్ డమ్మీస్'' అనే గ్రంథం రచించాడు.
2015లో 78 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆ సమయానికి.. తనను కోటీశ్వరుడిని చేసిన తన ఐడియా పట్ల అతడిలో మిశ్రమ భావాలు వ్యక్తమయ్యాయి.
పెంపుడు రాళ్ల ఐడియా తర్వాత.. అనేక రకాల చెత్త ఐడియాలతో తన దగ్గరకు వచ్చే ఆవిష్కర్తలతో తలనొప్పులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
కానీ.. ''అప్పుడప్పుడు నేను వెనుదిరిగి చూసినపుడు.. ఆ పని చేయకపోతే.. నా జీవితం ఇంత సాధారణంగా ఉండేది కాదు అని నాకు అనిపిస్తుంది'' అన్నాడు.
ఇవి కూడా చదవండి:
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










