జర్మనీ- నార్డ్‌లింగన్: 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జూలీ ఓవగార్డ్
- హోదా, బీబీసీ ట్రావెల్
జెర్మనీలోని నార్డ్‌లింగన్ నగరంలో ఒక పురాతన చర్చి భవనం మెట్లు ఎక్కుతుండగా ఆ పాత రాతి మెట్లపై సూర్యకాంతి పడి తళుక్కున మెరవడం మొదలైంది. ఆ నల్లని రాతి మెట్లపై కనిపించిన మెరుపు నాలో దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది.
"ఆ చర్చి భవనాన్ని సువిటే రాతితో నిర్మించడం వలన ఆ మెరుపు వచ్చింది. ఆ రాయి లోపల చిన్న చిన్న వజ్రాలు ఉంటాయి" అని భవనం కాపలాదారుడు లెన్నర్ చెప్పారు.
"అదృష్టం కొద్ది ఆ వజ్రాలు చాలా సూక్ష్మమైనవి. లేదంటే, ఈ భవంతిని ఎప్పుడో కూల్చేసి ఉండేవారు" అని ఆయన నవ్వుతూ అన్నారు.
ఆ పట్టణ నిర్మాణం 9వ శతాబ్దంలో జరిగింది. అయితే, ఇక్కడి నిర్మాణాలకు వాడుతున్న రాళ్లలో కొన్ని కోట్ల వజ్రాలు సహజసిద్ధంగా ఉన్నాయని అప్పుడు ఎవరూ గుర్తించలేదని ఈ నగర చరిత్రకు సంబంధించిన రికార్డులు తెలుపుతున్నాయి. ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదు.
చర్చి టవర్‌పై నుంచి బవేరియా పట్టణాన్ని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రహశకలం పడటంతో
నిజానికి కోటి 50 లక్షల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకలం ఈ ప్రాంతాన్ని డీకొనడంతో నార్డ్‌లింగన్ వజ్రాల ప్రాంతంగా మారింది.
ఒక కిలోమీటరు విస్తీర్ణంతో ఉన్న ఆ గ్రహ శకలం సెకన్‌కి 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి భూమిని తాకడంతో 26 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఒక తొట్టె లాంటి ప్రాంతం తయారైంది.
అప్పుడు జనించిన వేడికి, ఒత్తిడికి అందులో ఉండే కార్బన్ రేణువులు సూక్ష్మమైన వజ్రాలుగా రూపాంతరం చెందాయి. అవి 0.2 మిల్లీ మీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వలన మన కంటికి కనిపించవు.
ఇక్కడ దొరికే సువిటే అనే రాయిలో వజ్రాలు ఉంటాయని తెలియక ఆ రాళ్లతోనే ఈ నగరంలోని చాలా భవంతులు నిర్మించారు.
అందుకే, ఇలాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.
"ఈ నగరంలోని ప్రతి గోడనూ ఆ గ్రహశకలం వల్ల రూపాంతరం చెందిన రాళ్లతోనే నిర్మించారు" అని నార్డ్‌లింగన్ నివాసి రోస్విత ఫీల్ చెప్పారు.
ఇటీవల కాలం వరకు ఇక్కడ ఉండే వారెవరికీ తమ నగరం పుట్టుక గురించి తెలియదు.
మెరిసే గోడలతో కూడిన ఇళ్ళు ఉన్న ఈ నగరవాసులు ఎప్పుడూ ఆ విషయం గురించి తెలుసుకునేందుకు అంతగా దృష్టి పెట్టలేదు. 1960లలో యూజీన్ షూమేకర్, ఎడ్వర్డ్ చావ్ ఈ నగరానికి వచ్చేవరకూ నగర వాసులంతా తమ నగరం ఒక అగ్నిపర్వత పేలుడుతో ఏర్పడిన గోతిలో నిర్మితమైందని అనుకుంటూ వచ్చారు.
ఈ నగరం గురించి అధ్యయనం చేసిన కొందరు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి అగ్నిపర్వత పేలుడుకు సంబంధం లేదని తేల్చారు. ఉల్కాపాతం వల్ల ఈ ప్రాంతం తొట్టెలా మారి ఉంటుందని భావించారు. నార్డ్‌లింగన్ చర్చి గోడను పరిశీలించేటప్పటికే వారి ఆలోచన సరైనదేనని అర్ధం అయిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
"అగ్నిపర్వతం పేలుడు కారణంగా వారి పట్టణం ఒక తొట్టిలో ఉన్నట్లు ఉంటుందని వారి పాత స్కూలు పుస్తకాలు చెబుతున్నాయి. గ్రహ శకలం వల్ల ఈ ప్రాంతం ఇలా మారిందని తెలిశాక పుస్తకాలలో మార్పులు చేయాల్సి వచ్చింది" అని ఫీల్ చెప్పారు.
ఈ నగరంలో ఉన్న గోడలు, భవంతుల్లో సుమారు 72,000 టన్నుల వజ్రాలు ఉంటాయని స్థానిక శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
సువిటే రాయి ప్రపంచంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. కానీ, ఇక్కడి రాయిలో వజ్రాలు ఉన్నట్టు మరెక్కడా ఉండవు.
చర్చి మెట్లు దిగిన తర్వాత నేను నిశ్శబ్దంగా ఉన్న నగర వీధుల్లో అటూ ఇటూ తిరిగాను. ఆ రోజు చాలా చలిగా ఉంది. కానీ, రంగు రంగుల భవంతులు, నార్డ్లింగన్ నగరానికి ప్రహరీగా చుట్టిన గోడ నాకు రక్షణ కల్పించాయి.
మబ్బులు వీడి సూర్యరశ్మి భవంతుల గోడలను తాకగానే గోడల్లో నిక్షిప్తమైన వజ్రాల మెరుపు నా కళ్ళకు కనిపించేది.
"ఇది చాలా విభిన్నమైనది" అని రీస్ క్రేటర్ మ్యూజియం డైరెక్టర్, భూగర్భ శాస్త్ర నిపుణులు స్టీఫెన్ హోల్జ్ చెప్పారు.
16వ శతాబ్దపు భవంతిలో ఉన్న ఈ మ్యూజియంలో ఒక గ్రహ శకలం ఈ నగర భవిష్యత్తును ఎలా మార్చేసిందో వివరిస్తూ ఉంటారు.
అందులో ఉన్న ఆరు గదుల్లో ఉన్న షో కేసులలో గ్రహ శకలాలు, సువిటే రాళ్ళ ముక్కలు ఉంటాయి.
"ఇలాంటి రాళ్లు ప్రపంచంలో చాలా చోట్ల ఉంటాయి. కానీ, ఇక్కడ భవన నిర్మాణంలో ఈ రాయిని వాడినట్లుగా మరెక్కడా వాడలేదు" అని హోల్జ్ వివరించారు.
"ఇక్కడ నగరం మొత్తాన్ని ఈ రాతితోనే నిర్మించారు" అని ఆయన అన్నారు.
కేవలం ఈ నగరంలో ఉన్న భవంతులే కాకుండా, ఈ నగరపు సరిహద్దుల దగ్గర జురాసిక్‌లా విస్తరించిన శంఖు ఆకారంలో పెరిగే కొనిఫెర్ వృక్షాలు, పైన్ చెట్ల అడవులు కూడా ఈ గ్రహ శకలం తాకిడికి సాక్ష్యంగా నిలుస్తాయి.
ఒకప్పుడు ఉప్పు నీటి అడుగున ఉన్నఈ వృక్షాలు గ్రహ శకలం తాకిడి తర్వాత పైకి వచ్చి అత్యంత సారవంతమైన ఈ మట్టిలో సమృద్ధిగా పెరుగుతున్నాయి.
ఈ భూభాగం చుట్టూ వాడకం లేని గనులు, క్వారీల ఆనవాళ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి.
అక్కడ నుంచే సువిటే రాయిని వెలికి తీశారని భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అపోలో 14, 16 మిషన్లకు వెళ్లిన వ్యోమగాములు చంద్రయానానికి ముందు ఈ నగరానికి వచ్చి ఇక్కడ ఉండే రాళ్లను పరిశీలించారని హోల్జ్ చెప్పారు. దీనిని బట్టి అంతరిక్షంలో దొరికే రాళ్ళ గురించి అంచనా వేసుకుని భూమికి ఎటువంటి రాళ్లను తీసుకుని రావాలో అర్ధం చేసుకున్నట్లు చెప్పారు.
ఇప్పటికీ నాసా నుంచి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి వ్యోమగాములు ఇక్కడకు వస్తూ ఉంటారని చెప్పారు.
ఈ కోట్లాది వజ్రాలు నిక్షిప్తమైన నగరంలో నివసిస్తున్న ప్రజలు మాత్రం ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు.
"మేము దీనిని రోజూ చూస్తాం. ఇదేమి మాకు ప్రత్యేకం కాదు" అని నగరవాసులు అంటారు.
మ్యూనిచ్ నుంచి నార్డ్‌లింగన్ వచ్చిన హోల్జ్‌కి మాత్రం ఇక్కడ ప్రజలు దీనికి ఆకర్షితులు కాకపోవడం వింతగా అనిపిస్తుంది.
"ఇది స్థానికులకు ఆసక్తికరంగా అనిపించదు. ఇక్కడకు అందరూ ఎందుకు వస్తారో వారికి అర్ధం కాదు" అని ఆయన అన్నారు.
"నార్డ్‌లింగన్‌లో ప్రతి సంఘటనా ఆ గ్రహశకలం తాకిడితో సంబంధం ఉన్నదే. అదెప్పుడో గతంలో జరిగి ఉండవచ్చు. కానీ, దాని ఫలితాన్ని నేటికీ చూడవచ్చు" అని ఆయన చెప్పారు.
" గతం ఇచ్చిన ఫలితమే వర్తమానం" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








