బాయ్‌ఫ్రెండ్‌ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...

ఆష్లే

ఫొటో సోర్స్, BBC Three

ఫొటో క్యాప్షన్, ఆష్లే

హెచ్చరిక: ఇందులో మిమ్మల్ని కలచివేసే వివరాలుంటాయి.

"ఫైర్ , పారా మెడికల్ సిబ్బంది: సంఘటన ఎక్కడ జరిగింది?"

"ఈగిల్ రివర్ దగ్గర ఉన్న టర్నర్ పార్కులో.

"ఏమి జరిగిందో చెప్పండి."

“ నేను మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు తువ్వాలులో చుట్టిన పసి కందు కనిపించింది.“

"ఏమిటి? తువ్వాలులో చుట్టిన పసి బిడ్డా?“

“అవును. ఈ పసికందు శ్వాస తీసుకోవడం లేదు. శరీరం నీలం రంగులో ఉంది.“

"సరే! ఆ పసికందు ఎలా కనిపిస్తోంది?

"ఇప్పుడే పుట్టినట్లుగా ఉంది."

“సరే! మేము పారా మెడికల్ సిబ్బందిని పంపిస్తున్నాం.“

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఆంకొరేజ్ సబర్బ్ లో మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఒక వ్యక్తికి పార్కులో తువ్వాలులో చుట్టిన ఒక పసికందు కనిపించింది. ఆయన ఈ దారుణాన్ని చూసిన వెంటనే ఎమెర్జెన్సీ సేవలు 911కి కాల్ చేశారు. ఈ సంఘటన 2013 అక్టోబరు 13న చోటు చేసుకుంది.

సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఆ ఊర్లోకి పోలీసు కార్లు, కెమెరాలు రావడంతో ఆ ఊరి ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు.

అదే రోజు మధ్యాహ్నం అక్కడకు దగ్గర్లో ఉండే 24 సంవత్సరాల ఆష్లే ఆర్డ్ కూడా ఆమెకయిన గాయాలకు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆమెకయిన గాయాలను బట్టి ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లుగా అనిపిస్తోంది.

అలస్కా మొత్తానికే ఆష్లే ఒక ద్వేష పూరిత వ్యక్తి అని అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు రాశారు. ఆమె బిడ్డకు చేసిన అన్యాయానికి మరణ శిక్ష విధించాలని కొంత మంది వ్యాఖ్యానాలు చేశారు.

"ఎక్క్యూజ్డ్: ఎ మదర్ ఆన్ ట్రయిల్ " పేరిట బీబీసీ త్రీ ఐదేళ్ల పాటు సాగిన ఆష్లే న్యాయ విచారణను డాక్యుమెంటరీ సిరీస్‌లో పొందు పరిచింది.

ప్రాసిక్యూటర్లు ఆమెను వివరాలను తారు మారు చేసే వ్యక్తి అని, ఆమె పై సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదు చేయాలని అన్నారు.

అయితే, ఆమె తరపున వాదించే న్యాయవాదులు మాత్రం ఆమెకు భర్తతో ఉన్న హింసాత్మక సంబంధాలను వివరించారు. ఆమె ప్రాణానికి కూడా బెదిరింపులను ఎదుర్కొంటూ ఉండేవారని వారన్నారు.

పోస్ట్ పార్టం సైకోసిస్, గర్భం దాల్చిన విషయాన్ని దాచి పెట్టి ఉంచడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఆ చిన్నారి వణికించే చలిలో పార్కులోకి ఎలా చేరింది? ఎందుకలా జరిగింది?

ఈగిల్ రివర్ దగ్గర ఉన్న టర్నర్ పార్కు

ఫొటో సోర్స్, BBC THREE

ఫొటో క్యాప్షన్, ఈగిల్ రివర్ దగ్గర ఉన్న టర్నర్ పార్కు

మతిస్థిమితం లేని ప్రవర్తనకు పరాకాష్ట

ఆష్లే ఆర్డ్ వర్జీనియా రాష్ట్రంలో పోర్ట్స్ మౌత్ లో జన్మించారు. ఆమె గతంలో ఎప్పుడూ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు.

ఆమె మతపరమైన నమ్మకాలు ఉన్న కుటుంబంలో పెరిగారు. ఆమె హైస్కూల్ చదువు పూర్తయ్యాక ఆర్మీలో చేరారు. అక్కడ ఉండే ఒక మతాధికారికి సహాయకురాలిగా పని చేశారు.

అక్కడే ఆమెకు కెనార్డ్ అనే సైనికునితో పరిచయం అయింది. కానీ, ఆ సంబంధం క్రమేణా హింసాత్మకంగా మారి అశాంతికి దారి తీసిందని ఆమె కుటుంబం, స్నేహితులతో చెబుతూ ఉండేవారు.

"అప్పుడప్పుడూ ఏడుస్తూ నాకు ఫోన్ చేసేది. ఆమె మోసపోతున్నాననే విషయం ఆమెకు ఆధారాలతో సహా తెలుసు" అని ఆష్లే స్నేహితురాలు చెప్పారు.

"వారిద్దరి మధ్యనున్న బంధం ఒక మతిస్థిమితం లేని ప్రవర్తనకు పరాకాష్ట" అని కెనార్డ్ కుటుంబ సభ్యులు ఒకరు అన్నారు.

కెనార్డ్ తన పట్ల చూపించే విశ్వసనీయత మీద అనుమానాలు ఉన్నప్పటికీ ఆష్లే ఆయనను 2011 అక్టోబరులో పెళ్లి చేసుకున్నారు.

ఆమె కొన్ని రోజులకే అతని వలన గర్భం దాల్చారు.

ఆ మరుసటి వేసవిలో కెనార్డ్ అఫ్గానిస్తాన్ కి ఉద్యోగ నిమిత్తం వెళ్లారు. ఆష్లే ఆ సమయంలో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక కుటుంబం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కెనార్డ్ దూరంగా ఉన్న రోజుల్లో ఆమెకు మరొక అబ్బాయితో పరిచయం అయినట్లు ఆష్లే అంగీకరించారు.

ఆమె మళ్ళీ ఈ వ్యక్తి వలన గర్భం దాల్చారు. ఆమె అబార్షన్ చేయించుకుందామని అనుకున్నారు కానీ, మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నారు.

కెనార్డ్ తిరిగి వచ్చిన తరువాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు ఆమె గుర్తించారు. ఆయనకు పిటిఎస్ డి సమస్య ఉందేమోనని అనుకున్నారు.

ఆయనకు అకస్మాత్తుగా కోపం వచ్చేది. గట్టిగా శబ్దాలు వినిపించినా, ఫ్లాష్ లైట్లు చూసినా ఆయన కోపం పెరిగిపోయేది. దాంతో ఆయన రంకెలు వేస్తూ ఉండేవారు.

కెనార్డ్ నిద్రపోయేటప్పుడు కూడా తల కింద తుపాకి పెట్టుకుని పడుకునే వారు. ఎప్పుడైనా ఎవరి వల్లనైనా ఆష్లే గర్భం దాల్చినట్లు తెలిస్తే చంపేస్తానని బెదిరించేవారు.

ఒక సారి మాత్రం తుపాకిని గురి పెట్టినట్లు కెనార్డ్ కూడా అంగీకరించారు కానీ, ఆమె అభియోగం చేసినట్లు మాత్రం బెదరింపులేవి చేయలేదు అని ఆయన అన్నారు.

"ఆమె నన్ను గట్టిగా పట్టుకుని గుద్దేవారు, కానీ, నేనెప్పుడూ ఆమెను తిరిగి కొట్టలేదు" అని ఆయన చెప్పారు.

ఒక రోజు రాత్రి మా ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. అప్పుడు ఆమె నన్ను గట్టిగా చెంప దెబ్బ కొట్టారు. దానికి వెంటనే నేను తిరిగి ఆమెను కొట్టాను" అని చెప్పారు.

కెనార్డ్ అఫ్గానిస్తాన్ నుంచి తిరిగి వచ్చాక అలస్కాలో ఒక మిలటరీ కేంద్రంలో పోస్టింగ్ వచ్చింది. ఆష్లే మరొక వ్యక్తితో గర్భం దాల్చినప్పటికీ, కెనార్డ్ తో తన సంబంధాలు సరిగ్గా లేకపోయినప్పటికీ ఆమె భర్త దగ్గరకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆమె గర్భవతి అని తనకు తెలియదని కెనార్డ్ పోలీసులకు, డాక్యుమెంటరీ చిత్రకారులకు కూడా చెప్పారు.

"చాలా జాగ్రత్తగా ఆమె గర్భవతిననే విషయాన్ని దాచి పెట్టారు" అని ఆయన అన్నారు. "కొన్ని విషయాలను రహస్యంగా ఉంచినప్పుడు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి" అని ఆయన అన్నారు.

ఆమె గర్భంతో ఉన్నప్పటికీ వారిద్దరూ రోజూ సెక్స్ లో పాల్గొనే వారని ఆయన చెప్పారు. ఆమె బరువు పెరుగుదల గురించి ప్రశ్నించినప్పుడు, అది ఫైబ్రాయిడ్ల వలన అని చెప్పి తప్పించుకునే వారని చెప్పారు.

ఇలాగే ఆష్లే 9 నెలల పాటు తన గర్భాన్ని అందరి నుంచి దాచిపెట్టి ఉంచారు.

ఆ చిన్నారి పార్కులో దొరికిన ముందు రోజు రాత్రి కెనార్డ్ ఇంట్లో లేరు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఏమి జరిగిందో తెలియదు అని ఆయన అన్నారు.

కెనార్డ్ ఇంట్లో లేని సమయంలో ఆష్లే కి పురిటి నొప్పులు వచ్చాయని పోలీసులు చెప్పారు. ఆ సమయంలోనే ఆమె బిడ్డకు జన్మ నిచ్చి , పాపను పార్కులో వదిలిపెట్టి ఇంటికి తిరిగి వచ్చారు. ఆష్లే బిడ్డకు జన్మనిచ్చిన చోట గోడలు, నేల రక్తంతో నిండిపోయినట్లు పోలీసులు చూపించిన చిత్రాలలో కనిపించింది.

సాధారణ ప్రసవంలో కంటే అయిదింతలు ఎక్కువ రక్తాన్ని కోల్పోయినట్లు ఆమె వైద్య నివేదికలు చెబుతున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెను పోలీసులు ఆసుపత్రిలో రెండు గంటల సేపు విచారణ చేశారు.

"ఈ రోజు మాకు బిడ్డ దొరికింది" అని పోలీసులు ఆమెకు చెప్పారు.

"బిడ్డ ఏమిటి? నేను ఎవరికీ జన్మనివ్వలేదు" అని ఆష్లే ఇచ్చిన సమాధానం రికార్డు అయింది.

ఆష్లే పై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసారు. ఈ నేరం నిరూపితమైతే ఆమె 99 సంవత్సరాల పాటు జైలులో ఉండాల్సి వస్తుంది.

"నేను చాలా రక్తం కోల్పోయాను. చాలా నొప్పితో ఉన్నాను".

ఆష్లే విచారణ జరగడానికి ముందు ఆమె అలస్కాలో ఉన్న మహిళా జైలు హిలాండ్ మౌంటెన్ కరెక్షనల్ ఫెసిలిటీలో ఉన్నారు.

అక్కడే ఆమెకు బీబీసీ డాక్యుమెంటరీ చిత్రీకరణ బృందంతో కలిసే అవకాశం దొరికింది. ఆ రాత్రి జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి ఆమె చాలా ఇబ్బంది పడ్డారు.

"నేను మంచం పై పడుకుని ఉండగా కడుపులో నొప్పి మొదలయింది. దాంతో నేను బాత్ రూమ్ లోకి వెళ్లి షవర్ విప్పాను". అని ఆమె ఏడుస్తూ చెప్పారు.

"నాకు చాలా రక్తం పోవడంతో నేను చాలా నొప్పితో బాధపడుతున్నాను. బాత్ రూమ్ నేల మీదే నేను బిడ్డకు జన్మనిచ్చాను.

ఆష్లే ఆర్డ్, కెనార్డ్ కి 2011లో వివాహం జరిగింది

ఫొటో సోర్స్, BBC THREE

ఫొటో క్యాప్షన్, ఆష్లే ఆర్డ్, కెనార్డ్ కి 2011లో వివాహం జరిగింది

"శిశు మారణహోమం" అంశం పై కొన్ని దశాబ్దాల పాటు పరిశోధన చేసిన డాక్టర్ డయానా లిన్ బార్న్స్ ఇప్పుడు ఆష్లే తరుపున మాట్లాడుతున్నారు.

ఆమె ఆష్లేని, ఆమె స్నేహితులను, కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆమె గర్భాన్ని దాచి పెట్టి ఉంచినట్లు ఆమె నిర్ధరించారు

గర్భం దాల్చిన మహిళ గర్భం విషయం గురించి ఎవరితోనూ చెప్పకుండా దాచిపెట్టినప్పుడు కానీ, లేదా నిజంగానే ఆమె గర్భంతో ఉన్నట్లు తెలియకపోవడం వలన చెప్పకపోవడాన్ని ప్రెగ్నన్సీ కన్సీల్మెంట్ అని అంటారని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ నియమావళి చెబుతున్నాయి.

దీనికి, గృహ హింస కానీ, మానసిక అనారోగ్యం కానీ కారణం కావచ్చని ఆ నియమాలు చెబుతున్నాయి. ఇలాంటివి 2500 కేసులలో సుమారు ఒకరు (0. 04 శాతం) ఉంటారు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

"ఇది కచ్చితంగా ప్రెగ్నన్సీ కాన్సీల్మెంట్ కేసు అని బార్న్స్ అన్నారు. నువ్వు ఎవరి వల్లనైనా గర్భం దాలిస్తే చంపేస్తాను" అని ఆమె భర్త చేసిన బెదిరింపులు ఆమెను ఈ చర్యకు పాల్పడటానికి ప్రభావితం చేశాయి" అని ఆమె అన్నారు.

పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కూడా కొంత కారణమై ఉండవచ్చని ఆమె అన్నారు.

"కొన్ని సార్లు తల్లులు ఒక మాయలో, పిచ్చి పట్టిన మనసుతో పిల్లల ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. అదే బిడ్డకు మంచిదని వారు భావిస్తారు" అని బార్న్స్ అన్నారు.

"ఆష్లే విషయంలో కూడా ఇదే జరిగి ఉండవచ్చు" అని అన్నారు.

అనారోగ్యంతో ఉన్నవారిని శిక్షించడం సరైనది కాదని నా అభిప్రాయం. పోస్ట్ పార్టమ్ , పెరి పార్టుమ్ సైకోసిస్ మళ్ళీ మళ్ళీ తలెత్తే సమస్యలు.

ఆష్లే మారణకాండ చేసిన నేరాన్ని అంగీకరించారు.

ఆష్లే గర్భం దాల్చిన విషయం కెనార్డ్ కి తెలియదని చెప్పారు.

ఫొటో సోర్స్, BBC THREE

ఫొటో క్యాప్షన్, ఆష్లే గర్భం దాల్చిన విషయం కెనార్డ్ కి తెలియదని చెప్పారు.

కానీ, తీర్పు ఇచ్చే సమయంలో డాక్టర్ బార్న్స్ ఇచ్చిన విశ్లేషణను మరో ఇద్దరు స్వతంత్ర మానసిక శాస్త్ర నిపుణుల నివేదికలు ఖండించాయని ప్రాసిక్యూటర్ జెన్నా గ్రాన్ స్టీన్ చెప్పారు.

"ఇది కేవలం మానసిక సమస్యో, రోగమో కాదు" అని నా అభిప్రాయం అని జెన్నా అన్నారు. "ఆష్లే విషయాలను తారు మారు చేసే తెలివితేటలు కల వ్యక్తి అని అనుకుంటున్నట్లు చెప్పారు.

"ఆమె రికార్డులు పరిశీలిస్తే ఆమె ఎవరో ఒకరి పై స్పష్టంగా నిందలు మోపుతున్నట్లు అర్ధం అవుతోంది. ఆమె చేసిన పనులకు ఆమె బాధ్యత వహించటం లేదు".

"చాలా మంది హింసాత్మక సంబంధాలలో కానీ, సరిగ్గా లేని వివాహ బంధాలలో కానీ ఉంటారు. అలా అని, వాళ్లకి పుట్టిన బిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయరు. ఇలా జరగకుండా ఆపడానికి చాలా మార్గాలున్నాయి" అని ఆమె అన్నారు.

ఆష్లేకు చివరకు 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అందులో 3 సంవత్సరాలను కుదించగా చివరకు ఆమె 9 ఏళ్ల పాటు జైలులో ఉండాల్సి వస్తుంది.

ఆమె జైలులో ఉండగా తిరిగి డాక్యుమెంటరి బృందంతో మాట్లాడారు. ఆమెకు లభిస్తున్న చికిత్స ఆ రోజు రాత్రి జరిగిన విషయాల గురించి మాట్లాడేందుకు సహాయపడిందని చెప్పారు.

ఈ పసిబిడ్డ మరణంతో కెనార్డ్ కి సంబంధం లేదని ఆమె ధృవీకరించారు. కానీ, ఆ బిడ్డకు ఒంటరిగా ఎలా జన్మనిచ్చారో ఆమెకే తెలియలేదని చెప్పారు.

"బిడ్డను పట్టుకుని మంచం పై పెట్టడం నాకు గుర్తు ఉంది" అని అన్నారు.

"ఆ తరువాత నేను ఆ బిడ్డను తీసుకుని కారు దగ్గరకు వెళ్లి కారులో పెట్టాను. బిడ్డను టవల్ లో చుట్టినట్లు గుర్తు ఉంది" అని చెప్పారు.

"ఆ బిడ్డకు నేను క్షమాపణ కూడా చెప్పాను.నేను నిన్ను చూసుకోలేను కానీ, నిన్ను ఇంకెవరైనా చూసుకుంటారు అని చెప్పాను".

"ఆ బిడ్డను నేనెక్కడైనా స్టోర్ లో కానీ, లేదా స్కూలులో కానీ, చూస్తాను అని చెప్పినట్లు కూడా గుర్తు. తను నన్ను గుర్తు పెట్టకపోయినా పర్వాలేదు. కానీ, ఎవరో ఒకరు తనను జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అనుకున్నాను" అని ఆమె అన్నారు.

"కానీ, అలా జరగలేదు" అని చెబుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)